Houston, Texas: గ్రేటర్ హ్యూస్టన్ నగరంలో తెలంగాణ (Telangana) శాసన మండలి సభ్యులు (MLC) శ్రీ అద్దంకి దయాకర్ (Addanki Dayakar) గారు మరియు ఆయన సతీమణి శ్రీమతి నాగమణి గారితో ఒక ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం వారి అమెరికా పర్యటనలో భాగంగా శ్రీ గాధే శ్రీధర్ రెడ్డి గారు మరియు సోమయ్య గారు, తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ హ్యూస్టన్ (TAGH) సహకారంతో ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి ఫోర్ట్ బెండ్ కౌంటీ (Fort Bend County) లో జడ్జి పదవులకు పోటీ చేస్తున్న శ్రీ కెన్నెత్ ఒమొరుయి గారు మరియు శ్రీమతి ఆశారెడ్డి గారు కూడా అతిథులుగా హాజరయ్యారు. ప్రధాన అతిథిగా హాజరైన శ్రీ అద్దంకి దయాకర్ MLC గారు సుమారు 70 మంది ఉత్సాహభరితమైన ప్రేక్షకులను ఉద్దేశించి ప్రసంగించారు.
తన ప్రసంగంలో తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతోందని, హైదరాబాద్ సమీపంలో ఏర్పాటు కానున్న ఫ్యూచర్ సిటీలో ఎన్‌ఆర్‌ఐ (NRI) లకు విస్తృత పెట్టుబడి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. తెలంగాణ రెట్టింపు వేగంతో అభివృద్ధి చెందుతోందని, తెలంగాణ ప్రభుత్వ విజన్‌లో భాగస్వాములు కావాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్‌ఆర్‌ఐలను కోరారు.
అలాగే రాష్ట్ర విభజన అనంతరం రెండు తెలుగు రాష్ట్రాలు (Telugu States) మరింత అభివృద్ధి చెందుతున్నాయని ఆయన పేర్కొన్నారు. అమెరికాలో నివసిస్తున్న తెలుగు ప్రజల నుండి ఏవైనా అభ్యర్థనలు, డిమాండ్లు లేదా సూచనలు ఉంటే వాటిని రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పరిష్కరించేందుకు తాను సహకరిస్తానని హామీ ఇచ్చారు.
శ్రీమతి ఆశారెడ్డి గారు 2026లో జరిగే రానున్న ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ హ్యూస్టన్ (Telangana Association of Greater Houston) ప్రతినిధులు విజయ్ దేవిరెడ్డి, ప్రొఫెసర్ రాజేందర్ అప్పారసు, రాజ్ గుత్తా, వీరేందర్ దేవిరెడ్డి, నారాయణరెడ్డి ఇందుర్తి, సువీన్ మాడుగుల, రాజేశ్ గంప, వెంకట్ గార్లపాటి, ఉదయ్ మరుపాకులతో పాటు హ్యూస్టన్ స్థానిక తెలుగు సమాజ నాయకులు కూడా పాల్గొన్నారు.