డిసెంబర్ 26న రాజధాని ప్రాంతీయ తెలుగు సంఘం CATS (అమెరికా) వారు, సత్యసాయి సేవాసంస్థలు, పాడేరు వారి సహకారంతో విశాఖ జిల్లా, గుమ్మంతి గ్రామంలో నిర్మించబడిన శ్రీ సత్యసాయి ప్రేమామృత ధార మంచినీటి పథకం ప్రారంభోత్సవం జరిగింది.
CATS సంస్థ ప్రతినిధులు శ్రీ గోపికృష్ణ జయంతి, శ్రీమతి లక్ష్మి లావణ్య తేలు గార్లను ఆ గ్రామ గిరిజనులంతా సాయి భజనలు, గిరిజన వాయిద్యాలు, నృత్యాల కోలాహలంతో స్వాగతం పలుకగా సత్యసాయి సేవా సంస్థ సభ్యులతో కలసి ప్రారంభోత్సవం చేసి ఆ గ్రామంలోని 110 మంది గ్రామస్థులకు రగ్గులు, చీరలు, పంచెలను పంపిణీ చేశారు. సత్యసాయి సేవా సంస్థల జిల్లా అధ్యక్షులు శ్రీ కే. గణేష్ గారు మాట్లాడుతూ CATS ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు.
రాజధాని ప్రాంతీయ తెలుగు సంఘం ప్రతినిధులు గోపికృష్ణ గారు , లావణ్య గారు మాట్లాడుతూ CATS అధ్యక్షురాలు శ్రీమతి కొండపు సుధారాణి గారి అధ్యక్షతన తలపెట్టిన ఈ పథకంద్వారా గిరిజనులు ఒక బిందెడు నీటికోసం ఎండనకా వాననక , వాగులు వంకలు దాటి ఎన్నో బాధలు పడి ఎంతో దూరం వెళ్ళి తెచ్చుకునే అవసరం లేకుండా ఆనీటినే వారి ఊరివరకు పైపులైన్ల ద్వారా తెచ్చి వాటరు టాంకులను ఏర్పరచి వాటిద్వారా ఊరందరికీ నీరు అందిస్తున్న ఈ పథకానికి ఆ గ్రామస్థుల ఆనందం విలువ కట్టలేనిదనీ, ఇంత అద్భుతమైన కార్యక్రమానికి తాము వ్యక్తిగతంగా పాల్గొనడం చాలా సంతోషంగా ఉందనీ, ఈ మంచినీటి పధకం కు విరాళాలిచ్చిన తమ సంస్థ సభ్యులు సుజిత్ మారం గారు, చైతన్య తులగారు, మల్లా భద్రయ్యగారు, రమణ మద్దికుంట గారు మరియు వారి మిత్రబృందానికి మరియు ఈ కార్యక్రమానికి తోడ్పడిన సత్యసాయి సేవా సంస్థల ప్రతినిధులందరికీ వారు కృతజ్ఞతలు తెలియజేసారు.
ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున “వనవాసి” కార్యకర్తలు, సత్యసాయి కార్యకర్తలు గిరిజనులతో పాటు సత్యసాయి సేవా సంస్థ కోఆర్డినేటర్ ప్రతాప్ కుమార్ గారు, మరియు ప్రశాంతి నిలయం ఏలూరు సేవా కో-ఆర్డినేటర్ సురేష్ గారు, ట్రస్ట్ సభ్యులు చరణ్ గారు, కె.ఎ.వి.ఎస్.ఎన్. మూర్తి గారు, శ్రీనివాస్ శీరపు గారు తదితరులు పాల్గొన్నారు.