Connect with us

Arts

గురువుల మధ్య కళాశోభితంగా తానా కళాశాల అభినందన కార్యక్రమం

Published

on

డల్లాస్ , టెక్సాస్: తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘తానా కళాశాల’ అభినందన కార్యక్రమాన్ని తానా DFW కార్యవర్గం ఫ్రిస్కో లోని శుభం ఈవెంట్ సెంటర్ లో డిసెంబర్ 21న ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తానా కార్యవర్గం తో పాటు పలువురు కళాప్రియులు విచ్చేసి కళాశాల కార్యక్రమ వివరాలతో పాటుగా A2B వెజిటేరియన్ రెస్టారెంట్ మరియు కొప్పెల్ పీకాక్ రెస్టారెంట్ వారి పసందైన విందు భోజనాన్ని కూడా ఆస్వాదించారు.

ఈ కార్యక్రమాన్ని తానా DFW ప్రాంతీయ ప్రతినిధి సతీష్ కొమ్మన స్వాగతోపన్యాసం, సంగీత గురువు సమీరా శ్రీపాద ప్రార్థనా గీతంతో ప్రారంభించారు. అనంతరం తానాకళాశాల చైర్మన్ డా. రాజేష్ అడుసుమిల్లి, కొ-చైర్ మాలతీ నాగభైరవ సభికులకు కళాశాల కార్యక్రమాల గురించి వివరించారు. గత ఐదేళ్లుగా తానా సంస్థ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం తో కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్న కూచిపూడి, భరతనాట్యం మరియు సంగీతం కోర్సులకి ఎనలేని స్పందన లభిస్తోందని, ఇప్పటికి దాదాపు 400 పైగా విద్యార్థులు ఈ కోర్సులో చేరి ఒక క్రమ పద్దతిలో కళలను నేర్చుకుంటూ ప్రతి సంవత్సరం థియరీ మరియు ప్రాక్టికల్ పరీక్షలు తీసుకుని పద్మావతి విశ్వవిద్యాలయం సరిఫికేట్స్ పొందుతున్నారని తెలిపారు. వివిధ పూర్వ తానా అధ్యక్షులు అలాగే ప్రస్తుత అధ్యక్షులు అంజయ్య చౌదరి గారి సహకారంతోనే ఈ కళాశాల అభివృద్ధి సాధ్యపడిందని పేర్కొన్నారు.

తానా పూర్వాధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ ‘కళాశాల’ కార్య రూపం దాల్చడానికి తానా సంస్థ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంతో కలిసి చేసిన కృషిని గుర్తుచేసుకున్నారు. మహిళా విశ్వవిద్యాలయం సలహా సహకారాలతో ఈ శిక్షణా తరగతులని అమెరికా అంతటా విస్తృతం చేసే దిశగా కృషి చేస్తున్న కళాశాల చైర్స్ రాజేష్ అడుసుమిల్లి, మాలతీ నాగభైరవ లను అభినందించారు. తానా పూర్వాధ్యక్షులు డా. రాఘవేంద్ర ప్రసాద్ సూదనగుంట మాట్లాడుతూ భారతీయ కళలు తద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను పెంపొందించే దిశగా తానా పని చేయాలనే తన ఆకాంక్ష ఈ విధంగా సాకారం అవుతున్నందుకు ఆనందం వ్యక్తం చేశారు.

కళాశాల నాల్గవ సంవత్సరం సీనియర్ విద్యార్థులకి పరీక్షలు నిర్వహించడానికి భారతదేశం నుండి విచ్చేసిన ప్రొఫెసర్ డా. హిమబిందు ఉప్పరి గారు తానా కళాశాలతో తన అనుభవాన్ని పంచుకున్నారు. ఇక్కడ అమెరికాలో నృత్యం సంగీతం నేర్చుకుంటున్న చిన్నారులు బడి, ఆటలు ఇతర వ్యాపకాల మధ్య కళలకు కూడా ఇస్తున్న ప్రాముఖ్యత, దాని కోసం వారు తమకున్న సమయాన్ని ఎలా చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నారో చూస్తే చాలా ఆనందం కలుగుతోందన్నారు.

అనంతరం వివిధ తానా కార్యక్రమాలకు అలాగే తానా కళాశాల అభ్యున్నతికి ఎంతో సహకారం అందిస్తున్న నృత్య మరియు సంగీత గురువులు పద్మ శొంఠి, డా. సుధా కలవగుంట, శ్రీలత సూరి, కల్యాణి ఆవుల, హేమ చావలి, సమీర శ్రీపాద గార్లను తానా కార్యవర్గం ఘనంగా సత్కరించింది. అలాగే భారతదేశం నుండి విచ్చేసిన ప్రొఫెసర్ డా. హిమబిందు గారికి జ్ఞాపిక బహూకరించి సత్కరించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగు సంస్థ టాంటెక్స్ అధ్యక్షురాలు లక్ష్మి పాలేటి మరియు తానా ప్రతినిధులు మురళి వెన్నం, శ్రీకాంత్ పోలవరపు, లోకేష్ నాయుడు, సాంబ దొడ్డ, నాగరాజు నలజుల, వెంకట్ ములుకుట్ల, లెనిన్ తుళ్లూరి, రాజా నల్లూరి, ప్రవీణ్ కొడాలి, రాజేష్ పోలవరపు, విజయ్ వల్లూరు, వెంకట్ తొట్టెంపూడి, చంద్ర రెడ్డి పోలీస్, దీప్తి సూర్యదేవర, మధుమతి వైశ్యరాజు, శ్రీదేవి ఘట్టమనేని, అరవింద జోస్యుల తదితరులు పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతమవడంలో తోడ్పడ్డారు.

చివరిగా తానాకళాశాల చైర్మన్ డా. రాజేష్ అడుసుమిల్లి ఈ సాహితీ కార్యక్రమం ఇంత అత్యద్భుతంగా జరగడానికి సహకరించిన తానా కార్యవర్గసభ్యులకు, సురేష్ మండువకు, విచ్చేసిన గురువులకు, సభా ప్రాంగణాన్ని ఎంతో చక్కగా అలంకరించిన గోల్డ్ డస్ట్ డెకొరేటర్స్ యామిని సూరపనేని, , A2B రెస్టారెంట్ యాజమాన్యం , పీకాక్ రెస్టారెంట్ యాజమాన్యం అలాగే హాజరైన సభికులకు హృదయపూర్వక కృతఙ్ఞతలు తెలపి కార్యక్రమాన్ని ముగించారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected