Krakow, Poland: పోలాండ్ తెలుగు అసోసియేషన్ (PoTA) వారి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 28 (ఆదివారం), 2025 న క్రాకావ్ (Krakow) నగరంలో బతుకమ్మ మరియు దసరా పండుగలను ఎంతో వైభవంగా, ఉత్సాహభరితంగా నిర్వహించారు. పోలాండ్‌లో నివసిస్తున్న తెలుగు ప్రజలు మరియు PoTA సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ పండుగలను ఘనంగా జరిపారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా క్రాకావ్ భారత హానరరీ కాన్సులేట్ జనరల్ మిస్ అలెగ్జాండ్రా గ్వార్ద్ (Aleksandra Glod) గారు విచ్చేసి, తెలుగు సంఘం సాంస్కృతిక పరిరక్షణకు ఇలాంటి పండుగలు ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా అభినందించారు. ఆమె భాగస్వామ్యం కార్యక్రమానికి మరింత గౌరవాన్ని తెచ్చింది.
ఈ వేడుకలో చిన్నపిల్లల సాంస్కృతిక ప్రదర్శనలు, నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. స్త్రీలు, యువతీ యువకులు, పిల్లలు అందరూ బతుకమ్మ (Bathukamma) చుట్టూ చేరి, పూలతో రూపొందించిన బతుకమ్మను వలయాకారంలో ఉంచి, సాంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించారు.
దసరా (Dasara) వేడుకలో దేవి ఆలయోత్సవాలు, సాంస్కృతిక పాటలు, ఆటలు కూడా నిర్వహించబడ్డాయి. ఈ వేడుకల ద్వారా తెలుగు సాంప్రదాయాలు, పండుగల వైభవం పోలాండ్ నేలపై ప్రతిధ్వనించి, భవిష్యత్తు తరాలకు మన సంస్కృతిని పరిచయం చేసే వేదికగా నిలిచింది. ముఖ్యంగా చిన్నపిల్లలకు తెలుగు సంప్రదాయాలపై అవగాహన కల్పించడమే కాక, సంఘంలో ఐక్యతను పెంపొందించింది.
దసరా బతుకమ్మ సంబరాలను విజయవంతంగా నిర్వహించడంలో Poland Telugu Association (PoTA) క్రాకావ్ చాప్టర్ సభ్యుల కృషి విశేషంగా నిలిచింది. కార్యక్రమ సమన్వయంలో కీలక పాత్ర పోషించిన చంద్రశేఖర్ అల్లూరి, సుమన్ కుమార్ జనగామ, సత్య మండవల్లి, నవీన్ గౌడ్ కూరెల్లి, మౌనిక వేముల కూరెల్లి, దీక్షిత్ బాసాని, అజయ్ ఉప్పుల, పాలకోడేటి సాయి మౌనిక, మధుసూదన రెడ్డి ఉస్తిలి, సత్య లోకేష్ నున్న, విజయ్ సిరిపురం గారి నిబద్ధత, శ్రమ అందరి ప్రశంసలకు పాత్రమైంది.
మిస్ అలెగ్జాండ్రా గ్వార్ద్ గారు మాట్లాడుతూ, “ ఇలాంటి పండుగలు కేవలం సాంస్కృతిక ఆనందం మాత్రమే కాకుండా, వివిధ దేశాలలో నివసిస్తున్న భారతీయులను (NRI’s) ఏకం చేసే వంతెనలా ఉంటాయి. క్రాకావ్ నగరంలో ఇంత అందంగా, ఉత్సాహంగా నిర్వహించడం నిజంగా అభినందనీయం ” అని పేర్కొన్నారు.
క్రాకావ్‌లో జరిగిన ఈ వేడుకకు హాజరైన వారందరూ ఆనందభరితంగా, స్వదేశ వాతావరణాన్ని గుర్తుచేసుకుంటూ, ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలను తరచుగా నిర్వహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహించిన క్రాకావ్ చాప్టర్ సభ్యులందరికీ PoTA ప్రెసిడెంట్ శ్రీ చంద్ర భాను అక్కల (Chandra Bhanu Akkala) గారు అభినందనలు తెలియజేశారు.
అలాగే ఈ నెల 18వ తారీఖున తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanam – TTD) వేద పండితుల చేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణాన్ని వార్సాలో PoTA వారు రెండవ సంవత్సరం అత్యంత వైభవంగా నిర్వహించుటకు సన్నాహాలు చేస్తున్నారు.
PoTA గురించి: పోలాండ్ తెలుగు అసోసియేషన్ (PoTA) అనేది పోలాండ్‌లో నివసిస్తున్న తెలుగు సమాజాన్ని ఒక చోట చేర్చి, తెలుగు భాష, సాంస్కృతిక విలువలు, సంప్రదాయాలను కాపాడుతూ భవిష్యత్ తరాలకు పరిచయం చేసే ఉద్దేశ్యంతో స్థాపించబడిన సంఘం. పండుగలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సామాజిక సేవా కార్యక్రమాలు, అలాగే అత్యవసర సహాయక చర్యలు వంటి విభిన్న రంగాలలో PoTA కీలక పాత్ర పోషిస్తోంది. మరింత సమాచారం కోసం: www.pota.com.pl