Dallas, Texas: ‘భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది’, ‘అమ్మను మర్చిపోలేము-అంబికను మరిచిపోలేము’ వంటి వినూత్న ప్రచార శీర్షికలతో తెలుగు రాష్ట్రాలతో పాటు భారతదేశవ్యాప్తంగా పేరుగడించిన అంబికా దర్బార్ బత్తి వ్యాపారాన్ని అమెరికాలో కూడా విస్తరించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తునట్లు ఆ సంస్థ చైర్మన్ అంబికా కృష్ణ తెలిపారు.
ప్రముఖ ప్రవాస భారతీయ నాయకుడు డా. ప్రసాద్ తోటకూర (Dr. Prasad Thotakura) బుధవారం సాయంత్రం డల్లాస్ (Dallas, Texas) లో అంబికా కృష్ణకు ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశం లో కృష్ణ ప్రసంగిస్తూ 1946లో తన తండ్రి ఆలపాటి రామచంద్రరావు ప్రారంభించిన సంస్థలో 1968 లో జేరిన తాను అంచలంచెలుగా సంస్థను బలోపేతం చేసిన తీరు, వ్యాపార-సినిమా-రాజకీయ రంగాల్లో తన అనుభవాలను, జీవితపాఠాలను సభికులతో జరిపిన ప్రశ్నోత్తర కార్యక్రమంలో చాలా నిజాయితీగా, చలోక్తులతో అంబికా కృష్ణ సరదాగా పంచుకున్నారు.
తన వెంటపడిన రాజకీయ అవకాశాలు శాసనసభ్యునిగా విజయాన్ని అందించగా, తాను వెంటపడిన రాజకీయ అవకాశాలు ఓటమి పాఠాలు నేర్పాయని, ‘నమ్మకమే అమ్మకమని’ తన తండ్రి చెప్పిన వ్యాపారసూత్రాన్ని పాటించి తాను ఈ స్థితికి చేరుకున్నానని అంబికా కృష్ణ (Ambica Krishna) వ్యాఖ్యానించారు.
నిర్మాతగా తాను తీసిన 10 సినిమాల్లో 7 సరిగ్గా ఆడకపోయినా అనుభవాలు, మిత్రులు, పరిచయాలు పెరిగాయని అంబికా కృష్ణ ఆశావహంగా ప్రసంగించారు. నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) తాను మంచి మిత్రులమని, ప్రతిరోజు మాట్లాడుకోకుండా ఉండలేమని ఆయన వెల్లడించారు.
ఏలూరులో సంగీత-సాహిత్య-కళా రంగాలకు తాము సేవ చేస్తున్నామని, 2,500 మంది ఉద్యోగులతో తమ సంస్థ అంబికామాత ఆశీర్వాద బలంతో దూసుకెళ్తోందని అన్నారు. 120కు పైగా వ్యాపార ఉత్పత్తులే గాక హోటల్ రంగంలో కూడా తాము ప్రవేశించామని కృష్ణ (Ambica Krishna) తెలిపారు.
ఇప్పటికీ తమది ఉమ్మడి కుటుంబమన్న అంబికా కృష్ణ (Ambica Krishna) ఆ సంప్రదాయాన్ని కొనసాగించడం వెనుక అహంకారానికి, అవసరాలను అర్థంచేసుకునే మనోస్థితికి మధ్య సమన్వయమే కారణమని పేర్కొన్నారు. తమ కుటుంబసభ్యులు ఎల్లప్పుడూ నవ్వుతుండటం వెనుక అంబికా అమ్మవారి కృప ఉందని వెల్లడించారు.
తాను 30 దేశాల్లో తిరిగినా అమెరికా అంటే అదొక ఆత్మీయ అనుభూతి అని ఇక్కడి మిత్రులను కలవడం ఎల్లప్పుడూ ఆనందంగానే ఉంటుందన్నారు. ఏలూరు (Eluru) ప్రాంత చరిత్రను కూలంకషంగా వివరిస్తూ డా. తోటకూర ప్రసాద్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ ప్రాంతం నుండి సామాజిక-సాంఘిక-రాజకీయ-సినిమా-వ్యాపార-కళా రంగాల్లో విజయతీరాలు అందుకున్నవారిని ప్రసాద్ స్మరించుకున్నారు.
కళారత్న కె.వి. సత్యనారాయణ అంబికా కుటుంబంతో తనకున్నఅనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అనంతరం అంబికా కృష్ణ (Ambica Krishna) కు డా. తోటకూర ప్రసాద్ తన మిత్రబృందంతో కలసి “ Outstanding Leadership” అవార్డు ప్రదానంచేసి ఘనంగా సత్కరించారు. ఫ్లేవర్స్ రెస్టారెంట్ వారు అందించిన విందుభోజనం అందరి మన్ననలను పొందింది.
ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల ప్రతినిధులు, పురప్రమఖులు – ఎల్.ఎన్ కోయ, గోపాల్ పోణంగి, ఇక్బాల్, అనంత్ మల్లవరపు (Ananth Mallavarapu), రాజశేఖర్ సూరిభొట్ల, చిన్ని, రవి తూపురాని, బాపు నూతి (Bapu Nuthi), మురళి వెన్నం (Murali Vennam), చంద్రహాస్ మద్దుకూరి, డా. ప్రసాద్ పొదిల, సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ, విజయ్ మోహన్ కాకర్ల, చినసత్యం వీర్నపు (China Satyam Veernapu), దయాకర్ మాడ, భీమ పెంట, డా. రాజేష్ అడుసుమిల్లి, హరిచరణ్ ప్రసాద్, డా. శ్రీధర్ రెడ్డి కొర్సపాటి, డా. ఆళ్ళ శ్రీనివాసరెడ్డి, కళారత్న కె.వి సత్యనారాయణ, అజయ్ రెడ్డి, విజయ్ వర్మ కొండ, వినోద్ ఉప్పు, గోపి కందుకూరి మొదలైనవారు పాల్గొన్నారు.
ఎల్లప్పుడూ అందరికీ అందుబాటులో ఉంటూ తెలుగు భాష, సేవా కార్యక్రమాలలో ముందు వరుసలో ఉండే చిరకాల మిత్రులు డా. తోటకూర ప్రసాద్ (Dr. Prasad Thotakura) తన రాకను పురస్కరించుకుని ఎంతో ఆత్మీయంగా అభినందనసభ ఏర్పాటు చేసి సన్మానించినందులకు వారికి, వారి మిత్ర బృందానికి హృదయపూర్వక కృతజ్ఞతలు అన్నారు అంబికా కృష్ణ.