Tirumala, Tirupati: అమెరికాలో ప్రతి రెండేళ్లకు ఒక్కసారి అంగరంగ వైభవంగా నిర్వహించే నాట్స్ అమెరికా తెలుగు సంబరాలను దిగ్విజయం చేయాలనే సంకల్పంతో తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని నాట్స్ టీం దర్శించుకుంది. ఆ తిరుమలేశుడి హుండీలో నాట్స్ సంబరాల (NATS Convention) ఆహ్వాన పత్రికను సమర్పించి ఆ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు కోరుకుంది.
తెలుగు వారి ఇంట ఏ శుభకార్యం జరిగినా ఆ శుభకార్య ఆహ్వాన పత్రికను ఆ తిరుమలేశునికి సమర్పించడం ఓ సంప్రదాయంలా వస్తుంది. అమెరికాలో ప్రతి రెండేళ్లకు జరిగే అమెరికా తెలుగు సంబరాలను నాట్స్ (NATS) శుభకార్యంగా భావిస్తోంది. ఈ క్రమంలోనే తిరుమల (Tirumala) ను నాట్స్ టీం దర్శించుకుని ఆహ్వాన పత్రికను వేంకటేశ్వరునికి సమర్పించింది.
జులై 4,5,6 తేదీల్లో టాంపా వేదికగా అమెరికా తెలుగు సంబరాలు ఫ్లోరిడా (Florida) రాష్ట్రంలోని టాంపా కన్వెన్షన్ సెంటర్ (Tampa Convention Center) లో ఘనంగా జరగనున్నాయి. ఇందులో మన సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఆధ్యాత్మిక (Devotional) కార్యక్రమాలు కూడా ప్రత్యేకంగా నిర్వహించనున్నారు.
TTD ఛైర్మన్‌కు నాట్స్ ఆహ్వానం
తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanams – TTD) చైర్మన్ బి.ఆర్. నాయుడు కి నాట్స్ అమెరికా తెలుగు సంబరాలకు రావాలని ఆహ్వానించింది. తిరుమలలో బి.ఆర్. నాయుడి (Bollineni Rajagopal Naidu) ని కలిసిన నాట్స్ బృందం ఆహ్వాన పత్రికను అందించి సంబరాల ప్రాముఖ్యతను వివరించింది. నాట్స్ సంబరాలకు తప్పనిసరిగా రావాలని బి.ఆర్. నాయుడు ను కోరింది.
ఈ కార్యక్రమంలో నాట్స్ (North America Telugu Society – NATS) అమెరికా తెలుగు సంబరాల కమిటీ కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి, నాట్స్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీహరి మందాడి, నాట్స్ సంబరాల కమిటీ కార్యదర్శి శ్రీనివాస్ మల్లాది, నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ శ్రీనివాస్ పిడికిటి పాల్గొన్నారు.