Connect with us

Literary

మన భాష మన యాస, మాండలిక భాషా అస్తిత్వంపై TANA దృశ్య సమావేశం

Published

on

తానా (TANA) ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ప్రతి నెలా ఆఖరి ఆదివారం “నెల నెలా తెలుగు వెలుగు” పేరిట నిర్వహిస్తున్న 74వ అంతర్జాతీయ అంతర్జాల దృశ్య సమావేశం “మన భాష – మన యాస” “మాండలిక భాషా అస్తిత్వం” అనే కార్యక్రమం వైభవంగా జరిగింది. తానా అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు (Niranjan Srungavarapu) కార్యక్రమంలో పాల్గొంటున్న అతిథులందరకు ఆత్మీయ స్వాగతం పలికి వివిధ ప్రాంతాల మాండలిక భాషలు వాటి సొగసును సోదాహరణంగా వివిరించారు.

తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర (Dr. Prasad Thotakura) మాట్లాడుతూ కేవలం మన తెలుగు రాష్ట్రాలలోనే గాక తెలుగునేలనుండి తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా, ఛత్తీస్ఘడ్, మహారాష్ట్ర మొదలైన రాష్ట్రాలతో పాటు శ్రీలంక, మయన్మార్, మారిషస్ మొదలైన దేశాలకు వలస వెళ్ళిన తెలుగు కుటుంబాలవారు కూడా వివిధ రకాల యాసలతో తెలుగు భాషను సజీవంగా ఉంచడానికి శతాబ్దాలగా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. మాండలిక భాషలోఉన్న సహజ సౌందర్యం నిరాదరణకు, నిర్లక్ష్యానికీ గురికాకుండా అస్తిత్వం నిలుపుకుంటూ మాండలిక భాషలో ఎంతో సాహిత్య సృజన చేయవలసిన అవసరం ఉందన్నారు.

మన దేశంలోనే ఒక లంబాడీ గిరిజన మహిళ ఒక విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా ఎన్నికకాబడిన తొలి మహిళ ‘వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయ’ ఉపకులపతి ఆచార్య డా. సూర్యా ధనంజయ్ ముఖ్యఅతిథిగా పాల్గొని “ఇలాంటి ముఖ్యమైన అంశంమీద సమావేశం నిర్వహిస్తున్న తానా ప్రపంచ సాహిత్య వేదిక కృషిని అభినందించారు. మాండలిక (Dialect) భాషలతో పాటు, లిపిలేని లంబాడీ భాషల లాంటి భాషలకు లిపిని కల్పించి పరిరక్షించుకోవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. లిపి ద్వారా ఆయా తెగల జీవన విధానం, ఆచార వ్యవహారాలను సజీవంగా చిత్రీకరించవచ్చు అన్నారు.

విశిష్టఅతిథిగా పాల్గొన్న సుప్రసిద్ధ రచయిత, ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) పూర్వ భాషా, సాంస్కృతిక శాఖా నిర్దేశకులు డా. డి.విజయభాస్కర్ ‘ఉత్తరాంధ్ర యాస’ అస్తిత్వంపై శ్రీకాకుళం, విజయనగం, విశాఖపట్నం ప్రాంతాల ప్రజల యాసల మాధుర్యాన్ని, ఆ సాహిత్య సృజనచేసిన ఆయా ప్రాంత కవుల, రచయితల పాత్రను వివరించారు. లిపిలేని “రెల్లి” జాతికి చెందిన ప్రముఖ రచయిత మంగళగిరి ప్రసాదరావు పారిశుద్ధ్య కార్మికులుగా రెల్లి కులస్తులు చేస్తున్న సేవ, రెల్లి భాషకు లిపి కల్పిస్తేనే, ఇంకా ఎక్కువ సాహిత్యం వస్తేనే, వారి జీవనవిధానం పైన యితరులకు అవగాహన కలుగుతుంది అన్నారు.

విద్యారంగం (Education Sector) లో 50కు పైగా డిగ్రీలు సాధించిన అరుదైన విద్యావేత్త, వృత్తిపరంగా మానసిక వైద్యనిపుణులు, రాజమహేంద్రవరంవాసి, ‘అర్థం-పర్థం’ అనే శీర్షికతో ఇప్పటికే ఏడువందలకు పైగా ఎపిసోడ్స్ రాసిన తెలుగు భాషాభిమాని డా. కర్రి రామారెడ్డి చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. ప్రముఖ రచయిత, సి.పి.బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రం సహాయ పరిశోధకులు డా. చింతకుంట శివారెడ్డి రాయలసీమ మాండలికంలో నిత్యం వాడుకలోఉండే అనేక పదాలకు అర్థాలు, వాటి విశిష్టతను ఆసక్తికరంగా పంచుకున్నారు.

తెలంగాణ ప్రాంత వాసి, ప్రస్తుతం కాశీ హిందూ విశ్వవిద్యాలయం, వారణాశిలో భాషాశాస్త్రంలో సహయాచార్యులుగా ఉన్న డా. గట్ల ప్రవీణ్ తెలంగాణా భాషా మాధుర్యాన్ని, తెలంగాణ (Telangana) రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల మాండలిక భాషల వ్యత్యాసాలను సోదాహరణంగా వివరించారు. తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ ఉభయ తెలుగు రాష్ట్రాలలో వేర్వేరు ప్రాంతాల ప్రజల మాండలిక భాషను ఒకే వేదికమీద ఒకేసారి సమీక్షించడం ఒక్క తానా ప్రపంచసాహిత్యవేదికకు మాత్రమే సాధ్యమైంది అన్నారు. ఎంతో సమయం వెచ్చించి ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

error: NRI2NRI.COM copyright content is protected