Connect with us

Literary

Dallas: శ్రీశ్రీ మహాప్రస్థానం ప్రత్యేక సంచిక ఆవిష్కరణ

Published

on

డాలస్, టెక్సాస్, అక్టోబర్ 3, 2021: తెలుగు భాషాభిమాని, ప్రముఖ ప్రవాస భారతీయ నాయకులు డా. ప్రసాద్ తోటకూర అధ్యక్షతన డాలస్, ఫోర్ట్ వర్త్ నగర పరిసర ప్రాంతాలలోని సాహితీప్రియులు ఫ్రిస్కో నగరంలోని దేశీ డిస్ట్రిక్ట్ రెస్టారెంట్లో సమావేశమై మహాకవి శ్రీశ్రీ కి ఘన నివాళులర్పించారు.

డా. తోటకూర ప్రసాద్ తన స్వాగతోపన్యాసం లో శ్రీశ్రీ జీవితంలోని కొన్ని ముఖ్య సంఘటనలను, ఆయన కలంనుండి వెలువడ్డ వివిధ రచనలను, వెయ్యేళ్ళ సాహిత్య చరిత్ర లో శ్రీశ్రీ “మహాప్రస్థానం” ఒక గొప్ప కవితా సంకలనంగా చిరస్థాయిగా నిలిచిపోయి, ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకున్న వైనాన్ని, మహాప్రస్థానాన్ని శ్రీశ్రీ తన సన్నిహిత మిత్రుడు కొంపల్లె జనార్ధన రావుకి అంకితం ఇవ్వడానికి గల కారణాలను వివరించి శ్రీశ్రీ రాసిన “అంకిత గీతం” చదివి సభను ప్రారంభించి, ఒక్కొక్క వక్తను పరిచయం చేసి మహప్రస్థానం లోని కవితలను చదవమని ఆహ్వానం పలికారు.

అనంత్ మల్లవరపు, ఎం.వి.ఎల్ ప్రసాద్, డా. అరుణజ్యోతి కోల, రాజశేఖర్ సూరిభొట్ల, రావు కల్వాల, డా. విశ్వనాధం పులిగండ్ల, డా. నక్త రాజు, డా. రమణ జువ్వాడి, సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ, కిరణ్మయి గుంట, డా. శ్రీధర్ రెడ్డి కొర్సపాటి, డా. శ్రీనివాసరెడ్డి ఆళ్ళ, భాస్కర్ రాయవరం, శారద సింగిరెడ్డి, మురళి వెన్నం, డా. నరసింహారెడ్డి ఊరిమిండి, లెనిన్ వేముల, చంద్రహాస్ మద్దుకూరి, చినసత్యం వీర్నపు, రాజేశ్వరి ఉదయగిరి, డా. జగదీశ్వరన్ పుదూర్, దయాకర్ మాడ లు అందరూ కలసి మహాప్రస్థానం లోని మొత్తం 40 కవితలను భావగర్భితంగా చదివి సాహిత్య సభను రంజింపజేశారు. విశ్వేశ్వరరావు కంది, సురేష్ మానుకొండ, చి. సింధు వేముల, చి. సాహితి వేముల, శాంతా పులిగండ్ల, సుందర్ తురిమెల్ల, వెంకట్ ములుకుట్ల, సత్యన్ కళ్యాణ్ దుర్గ్ లు కూడా అత్యంత ఉత్సాహంగా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

విజయవాడ శ్రీశ్రీ ప్రింటర్స్ ఇటీవలే ముద్రించిన శ్రీశ్రీ మహాప్రస్థానం ప్రత్యేక ప్రతులను ఆవిష్కరించారు. విజయవాడ సాహితీ మిత్రులు విశ్వేశ్వరరావు, బండ్ల మాధవరావు, టి. శ్రీనివాసరెడ్డి ప్రభ్రుతులు నిర్వహించిన కార్యక్రమ స్పూర్తితో ఈ కార్యక్రమం చేపట్టామని, ఎంతో శ్రద్ధతో, ఉన్నత ప్రమాణాలతో కూడిన ఇలాంటి పుస్తకాన్ని శ్రీశ్రీ ప్రింటర్స్ ప్రచురించడం అభినందనీయం అని, డాలస్ లోని కొంతమంది సాహితీ ప్రియులు ఆ పుస్తకాలను సొంతం చేసుకుని, ఒకచోట చేరి మహాప్రస్థానం లోని మొత్తం 40 కవితలను చదివి, 25 మహాప్రస్థానం ప్రతులను ఒకేసారి ఆవిష్కరించడం సాహితీ జగత్తులో ఒక చరిత్ర అని, పాల్గొన్న ప్రతి ఒక్కరికీ డా. ప్రసాద్ తోటకూర ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected