ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అయ్యాయి. ముఖ్యంగా విజయవాడ, ఖమ్మం నగరాలు తీవ్రంగా వరద ముంపునకు గురయ్యాయి. ఇప్పటికీ విజయవాడ నగరం వరద ముంపు నుంచి బయటకు రాలేదు. 24 గంటల వ్యవధిలో అసాధారణ రీతిలో వర్షపాతం నమోదు కావడం.. అప్పటికే కృష్ణా నదిపై నిర్మించిన ప్రాజెక్టులు నిండుకుండలా ఉండటంతో, ఉప్పొంగిన బుడమేరు వరద బయటకు వెళ్లే దారి లేక విజయవాడ (Vijayawada) నగరం వరద నీటిలో చిక్కుకుపోయింది.
ఇటువంటి విపత్కర పరిస్తితులలో తెలంగాణ ముఖ్యమంత్రి సహయానిధికి (Telangana CM Relief Fund) కోటి రూపాయిలు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి (Andhra Pradesh CM Relief Fund) కోటి రూపాయిలు, అలాగే ముంపుకి గురైన సుమారు నాలుగు వందల గ్రామాలకు ఒక లక్ష చెప్పున ఒక్కో పంచాయితీకి అత్యవసర నిధి కింద నాలుగు కోట్లు విరాళాన్ని ప్రకటించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన వితరణను చాటుకొన్నారు.
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan Konidela) నేతృత్వంలోని పంచాయతీరాజ్ ఉద్యోగులు వరద బాధితులకు అండగా నిలిచారు. ముఖ్యమంత్రి సహాయనిధికి తమ ఒక్క రోజు జీతాన్ని విరాళంగా ప్రకటించారు. పంచాయతీరాజ్ జాయింట్ యాక్షన్ కమిటీ శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలిసి 1.64 లక్షల మంది ఉద్యోగుల ఒక్క రోజు మూల వేతనం రూ. 14 కోట్లు, పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ విభాగం రూ. 75 లక్షలు, గ్రామీణ నీటి పారుదల శాఖ ఉద్యోగులు రూ. 10 లక్షలు ముఖ్యమంత్రి సహాయ నిధికి ప్రకటిస్తున్నట్లు లేఖలు అందచేశారు. ఉద్యోగులను ఉప ముఖ్యమంత్రి అభినందించారు.
ఇటువంటి విపత్కర పరిస్తితులలో అటు ముఖ్యమంత్రి (Nara Chandrababu Naidu) ముంపు ప్రాంతాలను పర్యవేక్షిస్తుండగా, ఇటు ఉప ముఖ్యమంత్రి వివిద ప్రభుత్వ విభాగాలతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. తాడేపల్లి లోని విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో ఉన్న స్టేట్ ఎమర్జెన్సీ సెంటర్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రాష్ట్ర హోమ్, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత ఈ సమీక్షలో పాల్గొన్నారు. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.పి. సిసోడియా, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఆ శాఖ డైరెక్టర్ కృష్ణతేజ, విపత్తుల నిర్వహణ విభాగం డైరెక్టర్ కూర్మనాథ్ పరిస్థితిని వివరించారు.
వరద పరిస్తితిపై పవన్ కళ్యాణ్
253 ప్రాంతాలు నీట మునిగితే 100కు పైగా యథాస్థితికి వచ్చాయన్నారు. 45 వేల మంది ప్రజలకు సహాయక శిబిరాల్లో ఆశ్రయం కల్పించినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో సంభవించిన వరదల్లో 29 మంది మరణించినట్లు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan Konidela) చెప్పారు. ఇద్దరు గల్లంతైనట్లు పేర్కొన్నారు. ఇలాంటి విపత్తు పరిస్థితుల్లో సీఎం చంద్రబాబు నాయుడు చాలా సమర్థవంతంగా పనిచేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి (Deputy Chief Minister) పవన్ కల్యాణ్ అన్నారు. ఈ వయసులో కూడా సీఎం చంద్రబాబు నాయుడు ట్రాక్టర్లు, జేసీబీలల్లో ఎక్కి వరద ప్రాంతాల్లో సంచరించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారని, ప్రతి ఒక్కరు ఆయన అభినందించాల్సిన అవసరం ఉందని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు.
ప్రజల ప్రాణాలను కాపాడటమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan Konidela) పేర్కొన్నారు. వరద ప్రభావిత ప్రాంతాలకు తాను వస్తే ఇబ్బందులు కలుగుతాయనే రాలేదన్నారు. వరద సాయం అందని ప్రజల కోసం టోల్ ఫ్రీ నంబర్లు ప్రకటించారు. 24 ఎస్ టీఆర్ఎఫ్ బృందాలు, 26 ఎన్ డీఆర్ఎఫ్ బృందాలు వరద ప్రాంతాల్లోసహాయక చర్యల్లో పాల్గొంటున్నాయని అన్నారు. నేవీ నుండి రెండు హెలికాప్టర్లు, ఎయిర్ ఫోర్స్ నుంచి వచ్చిన నాలుగు హెలికాప్టర్ల ద్వారా వరద బాధిత ప్రాంతాల్లో ఆహారం అందిస్తున్నామని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు.
వరద బాధిత ప్రాంతాల్లో పంచాయతీరాజ్ శాఖ సిబ్బంది పాల్గొంటున్నారని ,175 బృందాలు విజయవాడ అర్బన్ లోనే పనిచేస్తున్నాయని, వరద ప్రభావం లేని జిల్లాల నుంచి పారిశుద్ధ కార్మికులు వచ్చి వరద సహాయక చర్యల్లో పనిచేస్తున్నాయని పవన్ కల్యాణ్ అన్నారు. విపత్తు సమయంలో నిందలు వేయడం కంటే ప్రజల ప్రాణాలు కాపాడడం తమ ప్రభుత్వం ముందున్న లక్ష్యమని పవన్ కళ్యాణ్ స్పష్టంచేశారు. ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలల్లోనే ఇలాంటి విపత్తు సంభవించడం దురదృష్టకరమన్నారు.
భారీ వర్షాలు, ఎగువన ఉన్న రాష్ట్రాలు, ప్రాంతాల నుంచి వచ్చిన వరద నీటితోనే ఏపీలో విపరీతమైన నష్టం వాటిల్లిందన్నారు. ప్రకాశం బ్యారేజీకి 11.43 లక్షల క్యూసెక్కుల వరద వచ్చిందనీ… ఎప్పుడూ రానంత వరద ఇదీ అని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan Konidela) తెలిపారు. వరదలు తగ్గుముఖం పట్టిన తరవాత రాష్ట్రంలోని ప్రతి నగరానికీ పకడ్బందీగా ఫ్లడ్ మేనేజ్మెంట్ ప్లాన్ ఉండేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. బుడమేరు నిర్వహణ పనులను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్లే విజయవాడకు ఇంతటి ముప్పు సంభవించిందన్నారు.
బడమేరులో తొంబై శాతం అక్రమణలే విజయవాడకు శాపంగా మారిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Deputy Chief Minister Pawan Kalyan Konidela) ఆరోపించారు. ఈ కష్ట సమయంలో విపక్ష పార్టీ నేతలు అనవసరమైన రాజకీయ విమర్శలు మాని, చేతనైతే సాయం చేయడానికి ముందుకు రావాలని పవన్ అన్నారు. వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించాలంటే మిమ్మల్ని తన కాన్వాయ్ లో స్వయంగా తానే పిలుచుకొని వెలుతానని, ఆ తర్వాత ఆ ప్రాంతాలు పరిశీలించి తనకు సలహాలు ఇవ్వాలని పవన్ కల్యాణ్ వైసీపీ (YSR Congress Party) నాయకులకు సూచించారు.
కవి చొడప్ప గారు చెప్పినట్టు “దేవుడు దేవుండనగా, దేవుండా దివి నుండి దిగి వచ్చేనా?”, ఇది ముమ్మాటికి ప్రజలహితం కోరే పవన్ కళ్యాణ్ గారికి నూటికి నూరుపాళ్ళు సరిపోతుంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం, న్యాయేన మార్గేణ మహీం మహీశాః గోబ్రాహ్మణేభ్య శ్శుభమస్తు నిత్యం, లోకా స్సమస్తా స్సుఖినో భవంతు. భావం: ప్రజలందరికీ స్వస్తి కలుగుగాక. దేశాధినేతలు న్యాయమైన మార్గములో పరిపాలన చేసెదరు గాక. గోవులకు బ్రాహ్మణులకు శుభమగు గాక. లోకములో ఉన్న అందరూ సుఖముగా ఉండెదరు గాక.