అమెరికాలో తెలుగువారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం NATS తాజాగా అమెరికాలో ఉంటున్న ప్రవాస తెలుగు వారి కోసం ఆన్‌లైన్ వేదికగా అవగాహన సదస్సు నిర్వహించింది. ప్రముఖ ఆర్ధిక నిపుణులు శ్రేయ్ అగర్వాల్ ఈ సదస్సులో పాల్గొని తెలుగువారికి అమూల్యమైన విషయాలను వివరించారు.
అమెరికాలో బ్యాంక్ అకౌంట్ల (Bank Accounts) నిర్వహణ ఎలా ఉండాలి.? అమెరికాతో పాటు ఇండియాలో కూడా బ్యాంక్ అకౌంట్లు ఉంటే వాటిని ఎలా నిర్వహించాలి..? ఆర్థికపరమైన, న్యాయపరమైన చిక్కులు రాకుండా ఆర్ధిక వ్యవహారాలు ఎలా నిర్వహించుకోవాలి..? అనే విషయాలను చక్కగా వివరించారు. ఆర్ధిక విషయాలపై అమెరికాలో ఉండే నియమ, నిబంధనల (Rules & Regulations) పై ఈ NATS సదస్సులో పాల్గొన్న సభ్యుల సందేహాలను నివృత్తి చేశారు.
ఈ ఆర్ధిక అవగాహన సదస్సుకు నాట్స్ (NATS) బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని (Prasanth Pinnamaneni) సమన్వయకర్తగా వ్యవహరించారు. ఆర్ధిక అంశాలపై ఎంతో ఉపయుక్తమైన సదస్సు నిర్వహించినందుకు ఈ సదస్సులో పాల్గొన్న తెలుగువారు నాట్స్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నాట్స్ ఆహ్వనాన్ని మన్నించి ఈ సదస్సుకు విచ్చేసిన శ్రేయ్ అగర్వాల్ కు నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి (Madan Pamulapati) కృతజ్ఞతలు తెలిపారు.