ఉత్తర అమెరికా తెలుగు సంఘం NATS గత రెండేళ్లలో చేసిన సేవలను భారత నీతి అయోగ్ గుర్తించింది. ఈ రెండేళ్లలో నాట్స్ అధ్యక్షునిగా బాపయ్య చౌదరి (Bapu Nuthi) నూతి చేసిన సేవా కార్యక్రమాలు సమాజంలో స్ఫూర్తిని నింపేలా ఉన్నాయని నీతి అయోగ్ కొనియాడింది.
బాపు నూతి సేవలను అభినందిస్తూ నీతి ఆయోగ్ (NITI Aayog) సభ్యులు పద్మభూషణ్ డాక్టర్ విజయ్ కుమార్ సరస్వత్ గుర్తింపు పత్రాన్ని బాపు నూతికి అందించారు. గత రెండు సంవత్సరాలుగా వేలాది మందికి సహాయక సేవా కార్యక్రమాలు నిర్వహించినందుకు బాపు నూతికి ఈ అరుదైన గౌరవం దక్కింది.
ఢిల్లీ (Delhi) లోని నీతి అయోగ్ భవన్ లో బాపు నూతికి గుర్తింపు పత్రాన్ని ఇచ్చి విజయ్ కుమార్ అభినందించారు. ముఖ్యంగా నాట్స్ (NATS) మన గ్రామం – మన బాధ్యత కార్యక్రమం ద్వారా రెండు తెలుగు రాష్ట్రాలలో అనేక సేవా కార్యక్రమాలు, దివ్యాంగుల కోసం ఆటిజం కేర్ ఆన్ వీల్ పేరుతో మొబైల్ వెహికల్ ఏర్పాటు చేయడాన్ని ప్రత్యేకంగా ప్రశంసించారు.
ఆటిజం కేర్ ఆన్ వీల్ (Autism Care on Wheel) ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లోని గ్రామీణ, అటవీ ప్రాంతాలలో దివ్యాంగులకు సహాయపడే విధంగా డాక్టర్స్, ఫిజియోథెరపిస్ట్, ఎడ్యుకేషన్ కిట్స్ ను పంపించి వారి ఎదుగుదలకు తోడ్పాటు అందించడం చాలా గొప్ప విషయం అని విజయ్ కుమార్ అన్నారు.
నాట్స్, స్పర్ష్ ఫౌండేషన్ సంస్థలు రెండు తెలుగు రాష్ట్రాల్లోని (Telugu States) దివ్యాంగులకు, పిల్లలకు సేవా కార్యక్రమాలతో పాటు మొబైల్ వ్యాన్ ని ఏర్పాటు చేసి డాక్టర్స్ ద్వారా సేవలను అందించడం అభినందనీయమన్నారు. దివ్యాంగులకు పునరావాస కార్యక్రమాలు చేపట్టడం, గ్రామీణ గిరిజన తండాల్లోని వైద్య సేవలు, అవసరమైన వారిని గుర్తించి సహాయం అందించడం స్ఫూర్తిదాయకమన్నారు.
ఈ కార్యక్రమంలో బాపు నూతి తో పాటు నాట్స్ డల్లాస్ నాయకులు రవి తాండ్ర, స్పర్ష్ ఫౌండేషన్ అధినేత పంచముఖి, డా. జ్యోతిర్మయి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాపయ్య చౌదరి (Bapu Nuthi) నూతి ని మరియు నాట్స్ (North America Telugu Society) ని తెలుగువారు అభినందిందిస్తున్నారు.