Connect with us

Government

అమర రాజా బ్యాటరీస్ తరలింపు వదంతులపై ఆందోళన వ్యక్తం చేసిన చికాగో ప్రవాసాంధ్రులు

Published

on

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చిత్తూరు జిల్లాలో ఉన్న అమర రాజా బ్యాటరీస్ సంస్థ తరలింపు వదంతుల నేపథ్యంలో అమెరికా లోని చికాగో మహానగర ప్రవాసాంధ్రులు ఆందోళన వ్యక్తం చేసారు. స్థానిక అరోరా ఉపనగరంలోని ఫాక్స్ వాలీ సెంటర్ నందు గత శనివారం ఆగష్టు 14వ తారీఖున దాదాపు నలభై మంది సమావేశమయ్యారు. వీరిలో అమర రాజా సంస్థ పూర్వ ఉద్యోగులు, చిత్తూరు తదితర సమీప జిల్లాలకు చెందినవారు మరియు ఇతర తెలుగువారు తమ అనుభవాలను, సూచనలను పంచుకొన్నారు.

సమావేశ ప్రారంభంలో యుగంధర్ గారు ఉపన్యసిస్తూ అమర రాజా యాజమాన్యంకు సమాజంపై గల అంకిత భావం, పదిమంది జీవితాల్లో వెలుగు నింపాలనే తాపత్రయం, మాతృ భూమికి కొండంత సహాయ సహకారాలు అందించాలనే దీక్ష , పట్టుదల, అవిశ్రాంత కృషే ఆ సంస్థ ఉన్నతికి, అక్కడి సమాజ హితానికి ఇతోధికంగా తోడ్పడ్డాయన్నారు. ఆ సంస్థ చైర్మన్ రామచంద్ర నాయుడు గారు చికాగో నగరంలో 1980 దశకంలోనే చికాగో నగరంలో హిందూ టెంపుల్ స్థాపించడంలో కృషి చేశారు అని, ఎల్లప్పుడూ పది మంది హితం కోరే పనులు చేసే వారు అని కొనియాడారు.

సంస్థ యొక్క పూర్వ ఉద్యోగులు ప్రతాప్ గారు, నవీన్ గారు తదితరులు మాట్లాడుతూ కాలుష్య, పర్యావరణ, మరియు ఇతర సమాజహిత కార్యక్రమాలు సంస్థలో ఎలా విధిగా పాటిస్తారు అలాగే జాతీయ మరియు అంతర్జాతీయ నిర్దేశిత ప్రమాణాలు ఎలా పాటిస్తారు, తరచూ ఎలా వాటిని బేరీజు వేసుకొంటారు అని సోదాహరణంగా వివరించారు. ఆ సంస్థ ఇంకా కొత్త ఎనర్జీ రంగంలోకి ప్రవేశించాలి అనుకొంటున్న తరుణంలో, మన రాష్ట్రంలోనే విస్తరణ జరిగితే ఇటు నిరుద్యోగలకు అటు ఆర్థికంగా రాష్ట్రానికి మరియు దేశోన్నతికి ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు.

ఆ తరువాత హేమ చంద్ర గారు, మురళి, ఉదయ్, రఘు, హరీష్, రవి, సందీప్, జీవన్ తదితరులు రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ఆర్థిక పరిస్థితి దృష్ట్యా రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు రావడం, ఉన్న పరిశ్రమలను కాపాడుకోవడం ఎంతో ముఖ్యమని తద్వారా యువతకు ఉద్యోగావకాశాలు పెరగాలని, ముఖ్యంగా అంతర్జాతీయస్థాయిలో పేరు గాంచి గ్రామీణ ప్రాంతాల్లో పరిఢవిల్లుతున్న అమర రాజా లాంటి సంస్థ తరలింపు రాష్ట్ర అభివృద్ధికి మంచిది కాదని సూచించారు. వూహించనిదేమైనా జరిగి అమర రాజా తరలిపోతే, ఇతర కంపెనీలు రాష్ట్రానికి రావడం ఇబ్బందికరంగా మారుతుందని అన్నారు.

చివరగా చిరంజీవి మాట్లాడుతూ ఒక వేళ కాలుష్యం ఉన్నా దాని ప్రభావం మొట్ట మొదటగా అక్కడే నివసిస్తున్న యాజమాన్యం మీదే ఉండేదని, వారు గత మూడున్నర దశాబ్దాలకు పైగా అక్కడే నివసిస్తున్నారని అభిప్రాయ పడ్డారు. నవ్యాంధ్ర ఉజ్వల భవిష్యత్ కోసం, భావి తరాల అభ్యున్నతి, సమాజ శ్రేయస్సు కోసం మంచి పరిశ్రమలు అలాగే వాటి పురోగమనం ఎంతగానో అవసరమని, తద్వారా అవి ఆర్థిక పరిపుష్టి గల నవ సమాజ నిర్మాణానికి ఎంతగానో సహాయపడతాయి అని అన్నారు. ఈ సమావేశానికి సహాయ పడ్డ శ్రీనివాస్, ప్రతాప్, రవి, వీరన్న, హనుమంత్, కృష్ణ మోహన్, పవన్ తదితరులకు, అలాగే పాల్గొన్న ఎన్నారైలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected