Farmington Hills, Michigan: అంతర్జాతీయ మహిళల దినోత్సవం ఉత్సవాన్ని పురస్కరంచుకుని గ్లోబల్ తెలంగాణ సంఘం (Global Telangana Association) డెట్రాయిట్ మహిళా విభాగం నిర్వహించిన లేడీస్ నైట్ అట్టహాసంగా జరిగింది. గత శనివారం నాడు ఫార్మింగ్టన్ మేనర్ లో జరిగిన ఈ కార్యక్రమానికి వివిధ వృత్తుల్లో ఉన్న సుమారు 350 మంది ఉత్సాహవంతులైన స్త్రీలు పాల్గొన్నారు.
తల్లులుగా, భార్యలుగా, ఉద్యోగస్తులుగా, ఇంజనీర్లుగా, డాక్టర్లు గా, వ్యాపారవేత్తలుగా దైనందిన జీవితాలలోని తమ విజయాలను వారు ఈ సందర్భంగా అస్వాదించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన రెండవ తరం భారతీయ సంతతికి చెందిన జిల్లా జడ్జి, జస్టిస్ షాలినా కుమార్ ప్రసంగిస్తూ.. అమెరికా కు మరియు ప్రపంచానికి వివిధ సామాజిక, ఆర్ధిక, మరియు సాంస్క్రుతిక రంగాల్లో భారతీయ మహిళల అందించిన ఎనలేని సేవలను, కనపరిచిన విశేష ప్రతిభా పాటవాలను ఈ సందర్భంగా కొనియాడారు.
అన్ని రంగాల్లో మహిళా సాధికారత (Women Empowerment) కు రెట్టించిన ఉత్సాహంతో పాటుపడాలని మరియు తమ కార్యక్రమాలను అంతే చిత్తశుద్ధితో కొనసాగించాలని ఉద్బోదించారు. “జీవితంలో అన్ని రంగాలలో స్త్రీల స్థితిస్థాపకం, శక్తి మరియు విజయాలను మనం జరుపుకుంటున్నప్పుడు లింగ సమానత్వం మరియు మహిళలకు సమానత్వాన్ని సాధించే ప్రయాణం చాలా దూరం ఉందన్న మనం మరచిపోవద్దు. మహిళలు తమ అవకాశాలను పొందకుండా ఉన్న అడ్డంకులు అన్నింటిని మనం సమర్థవంతంగా ఎదుర్కొని తొలగించాలి” అని అన్నారు.
ఈ వేడుకలకి ముఖ్య వక్త గా విచ్చేసిన ప్రొఫెసర్ పద్మజ నందిగామ మాట్లాడుతూ.. మహిళలు కుటుంబం కొరకు రోజూ నిర్వహించే వివిధ సేవలు అన్నీ వెల కట్టలేనివని అన్నారు. నిర్వాహకులు ఈ సందర్భంగా ఫ్యాషన్ షో (Fashion Show) కూడా నిర్వహించారు. అత్యుత్తమంగా అలంకరించుకుని వచ్చిన మహిళలకు అవార్డులు (Awards) అందించారు.
ఘుమఘుమలాడే భారతీయ వంటకాలు అతిథులను ఆకర్షించాయి. గాయకులు శ్రీకాంత్ సందుగు (Srikanth Sandugu) పాటలు ఆహుతులను అలరించాయి. యాంకర్ సాహిత్య వింజమూరి (Sahithya Vinjamuri) కార్యక్రమానికి వచ్చిన అందరినీ తనదైన శైలిలో పొందికైన మాటల మాలలతో ఆకట్టుకుంది.
ఇంతటి విశిష్టమైన కార్యక్రమానికి ప్రణాళిక రచించి ఆచరణలో పెట్టడంలో కీలక పాత్ర వహించిన కమిటీ సభ్యులు సుష్మ పడుకోనె, స్వప్న చింతపల్లి, సుమ కల్వల, దీప్తి వెనుకదాసుల, దీప్తి లచ్చిరెడ్డిగారి, హర్షిని బీరపు, అర్పిత భూమిరెడ్డి, కళ్యాణి ఆత్మకూరు, శిరీషారెడ్డి, డాక్టర్ అమిత కాకులవరం తదితరులను జీటిఎ డెట్రాయిట్ కార్యవర్గం (GTA Detroit Chapter) అభినందించింది.