నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (NATS) ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి అమెరికా తెలుగు సంబరాలు (Convention) పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న సంగతి అందరికీ విదితమే. ఇందులో భాగంగా, వచ్చే సంవత్సరం 2025 జులై 4, 5, 6 తేదీలలో 8వ అమెరికా తెలుగు సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు.
శ్రీనివాస్ గుత్తికొండ కన్వీనర్ గా, ప్రశాంత్ పిన్నమనేని ఛైర్మన్ గా, బాపయ్య చౌదరి (బాపు) నూతి అధ్యక్షునిగా నాట్స్ (NATS) 8వ అమెరికా తెలుగు సంబరాలు ఫ్లోరిడా రాష్ట్రం, టాంపా మహానగరంలోని టాంపా కన్వెన్షన్ సెంటర్ (Tampa Convention Center) లో మన సంస్కృతీ సంప్రదాయాలకు పెద్దపీట వేసేలా ప్రణాళిక వేయనున్నారు.
కన్వెన్షన్ అంటేనే అదొక మహాయజ్ఞం. యజ్ఞం లాంటి పెద్ద కార్యక్రమాన్ని చేపట్టేముందు ఆ దేవుడిని తలచుకొని విఘ్నాలు ఏమీ రాకుండా వేడుకోవడం శుభప్రదం. ఈ విషయాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ నాట్స్ టాంపా బే టీం (NATS Tampa Bay Team) శ్రీనివాస్ గుత్తికొండ సారధ్యంలో జనవరి 28 ఆదివారం నాడు స్థానిక హిందూ టెంపుల్ ఆఫ్ ఫ్లోరిడా లో విఘ్నేశ్వరునికి పూజలు నిర్వహించారు.
తీర్థప్రసాదాల అనంతరం నాట్స్ 8వ అమెరికా తెలుగు సంబరాల కన్వీనర్, నాట్స్ మాజీ ఛైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ మాట్లాడుతూ… ఈ రోజు మంచి రోజు కావడంతో పూజలు నిర్వహించి నాట్స్ తెలుగు సంబరాలు విజయవంతంగా జరగాలని అభిలాషించామన్నారు. అలాగే ప్రపంచ నలుమూలల నుంచి తెలుగువారందరూ ఉత్సాహంగా పాల్గొనవలసిందిగా కోరారు.
నాట్స్ ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని మాట్లాడుతూ… టాంపా లో నిర్వహించనున్న ఈ నాట్స్ 8వ అమెరికా తెలుగు సంబరాలకు టాంపా బే టీం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుందన్నారు. ఎప్పటి నుంచో కమ్యూనిటీలో ఉంటూ మంచి అనుభవం ఉన్న ఎనర్జిటిక్ నాట్స్ టాంపా బే టీం సభ్యులు తమ బాధ్యతలు నిర్వహించడానికి సన్నద్ధంగా ఉన్నారన్నారు.
పూజల అనంతరం నాట్స్ టాంపా బే టీం (NATS Tampa Bay Team)సమావేశమై కన్వెన్షన్ కి సంబంధించిన పలు విషయాలపై చర్చించారు. సామాన్యంగా కన్వెన్షన్ కి ఒక సంవత్సరం ముందు ప్రణాళిక మొదలుపెడతారు. కానీ నాట్స్ వారు ఈ సారి సుమారు 17 నెలల ముందే రంగంలోకి దిగడం చూస్తుంటే ఒక పక్కా ప్రణాళిక ప్రకారం అన్ని విధాలుగా మంచి కన్వెన్షన్ చేయాలనే పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ విషయంలో నాట్స్ టీం ని తప్పక అభినందించాలి.
ఈ కార్యక్రమంలో నాట్స్ మాజీ ఛైర్మన్ & నాట్స్ 8వ అమెరికా తెలుగు సంబరాల కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ బోర్డు గౌరవ సభ్యులు డా. కొత్త శేఖరం, నాట్స్ బోర్డు ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ శ్రీనివాస్ మల్లాది, నాట్స్ కార్య నిర్వాహక కమిటీ వైస్ ప్రెసిడెంట్ (ఫైనాన్స్ / మార్కెటింగ్) భాను ధూళిపాళ్ల, ప్రోగ్రామ్ నేషనల్ కోఆర్డినేటర్ రాజేష్ కాండ్రు, జాయింట్ ట్రెజరర్ సుధీర్ మిక్కిలినేని, సలహా కమిటీ సభ్యులు ప్రసాద్ అరికట్ల, సురేష్ బొజ్జా, చాప్టర్ కోఆర్డినేటర్ సుమంత్ రామినేని, జాయింట్ కో ఆర్డినేటర్ విజయ్ కట్టా, కోర్ టీమ్ కమిటీ శేఖర్ యెనమండ్ర, ప్రసాద్ కొసరాజు, శ్రీనివాస్ అచ్చి, భాస్కర్ సోమంచి, శ్రీనివాస్ బైరెడ్డి, సతీష్ పాలకుర్తి, రవి కలిదిండి, మాధురి గుడ్ల, శైలేంద్ర గుడ్ల, మాలిని తంగిరాల, శ్యామ్ తంగిరాల తదితరులు పాల్గొన్నారు.