రిచర్డ్ బ్రాన్సన్ ఆధ్వర్యంలోని వర్జిన్ గలాక్టిక్ ఈ జులై 11న ఉదయం 9 గంటలకు అంతరిక్ష నౌకని ప్రయోగిస్తున్న వార్త ఈరోజు ప్రకటించినప్పటినుంచి భారతీయులు, ముఖ్యంగా తెలుగు వారి ఆనందాలకు హద్దులు లేవు. ఎందుకంటే ఆ అంతరిక్ష నౌకలో ప్రయాణించేవారిలో తెలుగు అమ్మాయి శిరీష బండ్ల ఉండడం, అందునా ఈ ఘనత సాధించిన మొట్టమొదటి తెలుగు అమ్మాయిగా శిరీష చరిత్రపుటలకెక్కడం. అంతేకాకుండా కల్పన చావ్లా తరువాత స్పేస్ లోకి వెళుతున్న రెండవ భారత మహిళగా ఘనత సాధించారు.
డాక్టర్ మురళీధర్ బండ్ల మరియు అనురాధ బండ్ల గారాలపట్టి శిరీష బండ్ల ఆంధ్రప్రదేశ్ లో జన్మించారు. తల్లితండ్రులు అమెరికా వలసరావడం వల్ల తన కాలేజ్ విద్యాభ్యాసం అమెరికాలో సాగింది. టెక్సాస్ రాష్ట్రంలోని హ్యూస్టన్లో జాన్సన్ స్పేస్ సెంటర్ ని చూస్తూ పెరిగిన శిరీష, జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీలో ఎంబీఏ చేసినప్పటికీ, తండ్రి నుంచి వణికిపుచ్చుకున్న అభిరుచో ఏమోగానీ మొదటినుంచి అంతరిక్ష పరిశోధనవైపే మొగ్గుచూపారు. తన సేవలకై 2014 లో ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ నుండి యూత్ స్టార్ అవార్డు కూడా అందుకున్నారు.
కాలేజీ తర్వాత కొంతకాలం డీసీ లోని కమర్షియల్ స్పేస్ ఫ్లైట్ ఫెడరేషన్లో ఉద్యోగం చేశారు. 16 సంవత్సరాల వర్జిన్ గలాక్టిక్ సంస్థ పరిశోధనల ప్రతిఫలంగా, పరిశోధనా అనుభవానికి సంబంధించిన ఆస్ట్రోనాట్ 004 రోల్ లో అంతరిక్షంలోకి అడుగెట్టనున్న శిరీష బండ్ల కి ఎప్పటికైనా నాసా ఆస్ట్రోనాట్ అవ్వాలనే తన కోరిక త్వరలోనే నెరవేరాలని కోరుకుంటూ ఎన్నారై2ఎన్నారై.కామ్ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.