కాలిఫోర్నియా రాష్ట్రంలో మడేరా కౌంటీ, మెర్సెడ్ కౌంటీ, కేరన్ కౌంటీ తదితర జిల్లాల్లో కృష్ణాజిల్లా చల్లపల్లి మండలం యార్లగడ్డ గ్రామానికి చెందిన తొట్టెంపూడి నాగేశ్వరరావు మరియు వారి మిత్రబృందం “యాగ్రిగ్రో ఫార్మింగ్” సంస్థను ఏర్పాటు చేసి పూర్తిస్థాయి యాంత్రికరణ పద్ధతి లో 3000 ఎకరాల్లో సాగు చేస్తున్న బాదం, పిస్తా, అంజీర తదితర ఉద్యానవన పంటలు మరియు టమోటా కూరకాయ పంటను పండిస్తూ వాటికి అందజేస్తున్న నీటి యాజమాన్య పద్ధతిని తన అమెరికా పర్యటనలో భాగంగా సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ళ వెంకట గోపాల కృష్ణారావు పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆళ్ళ వెంకట గోపాల కృష్ణారావు మాట్లాడుతూ.. ఈ పంటలకు ఇక్కడ రైతులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1997 లో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలకు అతీతంగా భారత దేశం లో మొట్ట మొదటి సారిగా ఎర్పాటు చేసిన నీటి సంఘాల వ్యవస్థ మాదిరిగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వాటర్ డిస్టిక్ ద్వారా ఇచ్చే నీటిని సాగునీటి వినియోగదారుల సంఘాలను ఏర్పాటు చేసుకొని అందరు ఐక్యమత్యంగా ఉండి నీటి వృధాను అరికట్టి నీటి యాజమాన్యాన్ని సరైన పద్ధతిలో నిర్వహిస్తున్నారని వాటర్ డిస్టిక్ట్ ఇచ్చే నీటిని మొదట నిల్వ చెరువుల్లో నింపి అక్కడ నుంచి 200 హార్స్ పవర్ హై స్పీడ్ మోటార్ తో జెట్ ఇరిగేషన్ ద్వారా ఒక్కొక్క యూనిట్ 300 ఎకరాలకు ఒకేసారి నీరు వెళ్లేలాగా సమర్థవంతంగా నిర్వహించటం అద్భుతంగా ఉందని తెలిపారు.
ఒక ఏకరా కు ఒక అడుగు ఎత్తున నీరు ఇవ్వటానికి 43,500 క్యూబిక్ అడుగులు నీటి పరిమాణాన్ని ఇస్తున్నారని అట్లాగే అవసరమైనప్పుడు వాటర్ డిస్టిక్ట్ నీటితో పాటు వ్యవసాయ క్షేత్రాల్లో సొంతంగా ఏర్పాటు చేసుకున్న 300 హార్స్ పవర్ టర్బైన్ పంపుల ద్వారా 600 అడుగుల నుంచి నిమిషానికి 2000 గాలన్స్ భూగర్భ జలాలను వెలికి తీసి స్టోరేజ్ టాంక్ ద్వారా డ్రిప్, స్ప్రింక్లర్, జెట్ పద్ధతి లో పంటలను సాగు చేస్తున్నారని తెలిపారు.
ఈ విధానం ద్వారా ఎకరం బాదం, పిస్తా పంటలు వేయడానికి 4,000 డాలర్లు పెట్టుబడి పెడితే 6,000, డాలర్ల ఆదాయం వస్తుండగా రైతుకు 2000 డాలర్లు మిగులుతుందని ఒక ఎకరాకు టన్నున్నర దిగుబడి వస్తుందని తెలిపారు. అట్లాగే టమోటా ఎగరానికి 60 టన్నులు దిగుబడి వస్తుండగా నాలుగు నెలల్లో అన్ని ఖర్చులు పోను రైతుకు 2,000 డాలర్లు ఆదాయం వస్తుందని తెలియజేశారు.
ఇక్కడ రైతులు చేస్తున్న నీటి యాజమాన్యాన్ని మన రాష్ట్రంలో ఆయిల్ పామ్,మామిడి,అరటి కొబ్బరి లాంటి తదితర ఉద్యానవన పంటల్లో ఈ విధానం అనుసరించినట్లయితే నీటి వృధాను అరికట్టి రైతులకు మరింత ఆదాయం రావడానికి ఎంతో ఆస్కారం ఉంటుందని తెలియజేశారు. ఎంతో సమర్థ వంతంగా ఉద్యానవన పంటలు సాగు చేస్తున్న కృష్ణా జిల్లా ఎన్నారై రైతు తొట్టెంపూడి నాగేశ్వరరావుకు అభినందనలు తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ లోని మెట్ట ప్రాంతాల్లో ఈ విధానాన్ని సాగు చేయడానికి రైతులకు సాంకేతిక సలహాలు, సూచనలు ఆన్ లైన్ ద్వారా ఇవ్వాలని ఆయనను కోరారు.