రాజధాని ప్రాంతీయ తెలుగు సంఘం “కాట్స్” 2020- 2021 సంవత్సరాలకు గాను నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. అధ్యక్షురాలిగా శ్రీమతి సుధారాణి కొండపు గారు, ఉపాధ్యక్షలుగా సతీష్ వడ్డీ గారు, కార్యదర్శిగా దుర్గాప్రసాద్ గంగిశెట్టి గారు, కోశాధికారిగా పార్ధసారధి బైరెడ్డి గారు, సాంస్కృతిక కార్యదర్శిగా హరీష్ కుమార్ కొండమడుగు గారు, కమ్యూనిటీ సర్వీస్ కార్యదర్శిగా రామచంద్రరావు ఆరుబండి గారు, ధర్మకర్తలుగా ప్రవీణ్ కాటంగురి గారు, గోపాల్ నున్న గారు , వెంకట్ కొండపోలు గారు నియమితులయ్యారు. ఈ కార్యక్రమంలో కాట్స్ మాజీ అధ్యక్షులు రవి బొజ్జ గారు నూతన అధ్యక్షురాలు సుధారాణి గారికి పదవీ బాధ్యతలను అప్పగించగా సహాయ కార్యదర్శి శ్రీనివాస్ వూట్ల గారు నూతన కార్యవర్గంతో ప్రమాణస్వీకారం చేయించారు. అడ్వైజర్స్ శ్రీ భువనేష్ బూజాల గారు, మధుకోల గారు, భాస్కర్ బొమ్మారెడ్డి గారు, అనిల్ నీరుకొండ గారితో పాటు కాట్స్ వ్యవస్థాపకులు రామ్మోహన్ కొండా గారు, చిత్తరంజన్ నల్లుగారు నూతన కార్యవర్గానికి అభినందనలు తెలియజేశారు.
గతంలో సంస్థలో అనుభవజ్ఞులైన వారి సలహాలతో కొత్తగా కార్యవర్గంలో చేరినవారి ఆలోచనలను రంగరిస్తూ కొత్త ఒరవడితో 50 మందితో కూడిన కీలక బృంద సభ్యులతో సుధారాణి కొండపు గారు పదవీ బాధ్యతలను స్వీకరించారు. తెలుగు భాష, సాహితీ రంగాలకు పెద్దపీట వేస్తూ, అంతరించిపోతున్న జానపదాలు, నాటకాలు లాంటి వాటికి పునరుజ్జీవనం చేసే కార్యక్రమాలను, డిసి మెట్రో ప్రాంతానికి చెందిన తెలుగు వారందరికీ మరింత చేరువయ్యేలాంటి క్రీడ,సేవ, సాంస్కృతిక రంగాలలో వివిధ కార్యక్రమాలను, ప్రతీ నెలా చేపట్టేలా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామని సుధారాణి తెలియజేసారు. అంతేకాక రెండు తెలుగు రాష్ట్రాలలో చేస్తున్న సేవా కార్యక్రమాలను తమ పరిధిలో మరింత విస్తృత పరిచేలా తమ కార్యవర్గం నిర్ణయం తీసుకున్నారని తెలియజేసారు.