ఫిబ్రవరి 2న అట్లాంటాలో ఎన్నారై తెలుగుదేశం ఆధ్వర్యంలో నిర్వహించిన నారా లోకేష్ సభ విజయవంతమైన సందర్భంగా ఫిబ్రవరి 18న స్థానిక పెర్సిస్ రెస్టారెంట్లో విజయోత్సవసభ నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిధిగా అట్లాంటా ఇండియన్ కాన్సులేట్ నుంచి కాన్సూల్ డి.వి. సింగ్ మరియు దాతలు, వాలంటీర్స్, తెలుగుదేశం పార్టీ అభిమానులు సుమారు 100 మందికి పైగా విచ్చేసారు.
ముందుగా మురళి బొడ్డు మాట్లాడుతూ సమాచార సాంకేతిక, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ అట్లాంటా పర్యటన విజయవంతం కావడానికి సహకరించిన దాతలు మరియు వాలంటీర్స్ కి కృతఘ్నతలు తెలియజేసారు. హితేష్ వడ్లమూడి, విజయ్ రావిళ్ల, సురేష్ కర్రోతు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నారా లోకేష్ చేస్తున్న కృషిని కొనియాడారు. అలాగే మరో ఇరువురు వాలంటీర్స్ మాట్లాడుతూ నారా లోకేష్ ప్రతి ఒక్కరితో రెండు గంటలపాటు ఫోటోలు దిగడం ఈసమకాలీన రాజకీయాల్లో గర్వించదగ్గ విషయమని అభినందించారు. ముందు ముందు ఎన్నారై తెలుగుదేశం అట్లాంటా టీం ఇలాంటి మంచి కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు.
చివరిగా మల్లిక్ మేదరమెట్ల కాన్సూల్ డి.వి. సింగ్ ని వేదికమీదకు ఆహ్వానించగా, అయన చంద్రబాబు సమైక్యాంధ్ర ముఖ్యమంత్రిగా చేసిన అభివృద్ధిని భారతదేశంలోని ఇతర రాష్ట్రాలలో కూడా అభినందించేవారని మననం చేసారు. తదనంతరం కాన్సూల్ డి.వి. సింగ్ ని అందరూ శాలువాతో సత్కరించగా, కేక్ కట్ చేసి విందు భోజనాలతో విజయోత్సవసభ ముగిసింది.