26 జనవరి 2022న అట్లాంటా తెలుగు సంఘం ‘తామా’ తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా కార్యాలయంలో భారత 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. చల్లటి వాతావరణం, కోవిడ్ వంటి వాటి వల్ల పరిస్థితులు అంత బాగా లేనప్పటికీ సుమారు 50 మందికి పైగా అట్లాంటావాసులు ఈ కార్యక్రమానికి విచ్చేసి తమ దేశభక్తిని చాటారు.
ముందుగా తామా ఉపాధ్యక్షులు సాయిరామ్ కారుమంచి అందరినీ సగౌరవంగా ఆహ్వానించారు. తరువాత ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఆంధ్ర రాష్ట్ర సెక్రెటేరియట్ విద్యా విభాగంలో ఆఫీసర్ గా పనిచేసిన సత్యనారాయణ నాయుడు, జాన్స్ క్రీక్ సిటీ కౌన్సిల్ సభ్యులు బాబ్ ఎర్రమిల్లి, ప్రముఖ స్ట్రక్చరల్ ఇంజనీర్ అరుణ శాస్త్రి, సేవా తత్పరతతో ఎన్నో మంచి కార్యక్రమాలు చేసే శ్రీదేవి నాయుడు విచ్చేసి జండా వందనం గావించారు. అందరూ జాతీయగీతం ఆలపించి భారతావనిపై తమకున్న గౌరవాభిమానాలను తెలియజెప్పారు. అతిథులు గణతంత్ర దినోత్సవం ప్రాధాన్యత గురించి వివరిస్తూ, ముఖ్యంగా చిన్న పిల్లలు తెలుసుకోవలసిన విషయాలు విపులీకరించారు. జైహింద్, భారత్ మాతా కీ జై వంటి నినాదాలు అందరిచేతా చెప్పించారు. తామా అధ్యక్షులు రవి కల్లి మాట్లాడుతూ 2012 నుంచి తామా జాతీయ పండుగలు క్రమం తప్పకుండా చేస్తోందని తెలిపారు. విపరీతమైన చలి ఉన్నప్పటికీ ఈ మహోన్నత కార్యక్రమానికి వచ్చినందుకు అందరికీ కృతజ్ఞతాభినందనలు తెలియజేశారు.
ఈ వేడుకల సందర్భంగా తామా కార్యాలయాన్ని దేశ నాయకుల చిత్రపటాలతో, జెండాలతో, మువ్వన్నెల తోరణాలతో అందంగా అలంకరించారు. ఇంతమంది కలిసి ఇలా మన జాతీయ పండుగను చేసుకోవటం ప్రశంసనీయమనీ, ఈ కార్యక్రమం భారత దేశంలో చిన్నప్పుడు తమ బడులలో జరిగినట్లు ఉందనీ, ఆ రోజులను తామా వారు తమకు గుర్తుచేసినందుకు వచ్చినవారు చాలా ఆనందపడ్డారు. ఎంతో మంది చిన్నపిల్లలు పాల్గొనడం, రిపబ్లిక్ డే అంటే ఏంటి అని తెలుసుకోవడం గమనార్హం. గణతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా తామా వారు అందరికీ అల్పాహారం, తేనీరు మరియు మిఠాయిలు అందజేశారు. చివరిగా ఈ కార్యక్రమాన్నివిజయవంతం చేసిన ఆహుతులందరికీ, తామా జట్టుకీ, సహాయం చేసినవారికీ తామా కమ్యూనిటీ సెక్రెటరీ హర్ష కొప్పుల ధన్యవాదాలు తెలియజేసి ముగించారు.