New Jersey: భాషే సాంస్కృతిక వారధి అని తెలుగు కళా సమితి (TFAS) అధ్యక్షులు మధు అన్నా పేర్కొన్నారు. అమెరికాలోని న్యూజెర్సీలో TFAS 40 వసంతాల వేడుకలు మరియు దీపావళి (Diwali) సంబరాలు ఘనంగా జరిగాయి. అనంతరం తెలుగుజ్యోతి సంచికను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమానికి మన్నవ సుబ్బారావు (Mannava Subbarao), ఉపేంద్ర చివుకుల (Upendra Chivukula), బ్రిడ్జ్ వాటర్ టెంపుల్ అధ్యక్షులు మోహన్ రావు మైనేని (Mohan Rao Myneni), శంకరమంచి రఘుశర్మ (Shankaramanchi Raghu Sharma), స్వాతి అట్లూరి (Swathi Atluri) ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాలు ప్రారంభించారు.
తెలుగువారి సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబించేలా వివిధ సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. మ్యూజికల్ నైట్ (Musical Night), ఫ్యాషన్ షో, సాహిత్య పోటీలు జరిగాయి. క్రికెట్, వాలీబాల్, టెన్నీస్ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు.
ప్రముఖ కమెడియన్ శివారెడ్డి (Siva Reddy) మిమిక్రీ ప్రదర్శనతో పాటు సింగర్లు భరద్వాజ్(Bharadwaj), సంగీత దర్శకుడు శ్రీ చరణ్ పాకాల (Sricharan Pakala) లైవ్ ప్రోగ్రాం ఆకట్టుకుంది. ఈ సందర్భంగా మధు అన్నా మాట్లాడుతూ.. ఒక జాతి అస్తిత్వాన్ని, ప్రత్యేకతను చాటిచెప్పేది మాతృభాషేనని గుర్తించాలి. మాతృభాషను విస్మరించిన ఏ జాతి మనుగడ సాగించలేదు.
తెలుగు సంస్కృతి, వారసత్వాన్ని ఇక్కడి పిల్లలకు అందించడమే మా సంస్థ ప్రధాన లక్ష్యం. అందుకే అక్కడి సంస్కృతి, సాంప్రదాయాలను, కళలను (Arts) ఇక్కడ పిల్లలకు నేర్పిస్తున్నాం. మా పిల్లలు ఏ భాషలో చదువుకున్నా వారికి చక్కటి తెలుగు నేర్పిస్తున్నాం. తెలుగువారి సంస్కృతి, సాంప్రదాయాలు, వివిధ రంగాల్లో పేరు ప్రఖ్యాతలున్న వారి సమాచారాన్ని తెలుగుజ్యోతి సంచిక ద్వారా తెలియజేస్తామన్నారు.
మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ… అక్కడ కంటే కూడా ఇక్కడే పండగులను (Festivals), ఇతర వేడుకలను క్రమం తప్పకుండా జరుపుతున్నారు. తెలుగుతనాన్ని మొత్తాన్ని ఒక వేదికపైకి తీసుకువచ్చి తెలుగుభాషకు, తెలుగుజాతికి గుర్తింపు తెస్తున్నారు. భాషను చంపేసే తరంగా మనం మిగలకూడదని తెలిపారు.
మాతృభాష మృతభాష కాకుడదని TFAS (Telugu Fine Arts Society) సంస్థ బాగా కృషిచేస్తోందన్నారు. ఉపేంద్ర చివుకుల మాట్లాడుతూ.. భాష, ఆచార వ్యవహారాలను పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. TFAS వారు చేస్తున్న సామాజిక, సాంస్కృతిక (Cultural) సేవను అభినందించారు.
ఈ కార్యక్రమంలో శేషగిరి కంభంమెట్టు, ప్రసాద్ వూటుకూరి, వాణి కూనిశెట్టి, లత మాడిశెట్టి, దాము గేదెల, వాసిరెడ్డి రామకృష్ణ, మందాడి శ్రీహరి, భీమినేని శ్రీనివాస్, భాను మాగులూరి, రమేష్ అవిర్నేని, లోకేందర్ గిర్కాల, అరుంధతి శాకవల్లి, వెంకట సత్య తాతా, వరలక్ష్మి రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ వేడుకలో వెయ్యిమందికి పైగా పాల్గొన్నారు. పసందైన విందుతో కార్యక్రమం (Event) ముగిసింది.