. 300 మందికి పైగా మేము సైతం అన్న వైనం . కార్యదర్శిగా సతీష్ తుమ్మల . కోశాధికారిగా భరత్ మద్దినేని . ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా రవి మందలపు . ఇండియా వ్యవహారాల డైరెక్టర్ గా వంశీ కోట . జాయింట్ సెక్రెటరీగా శ్రీనివాస్ కూకట్ల . మొత్తంగా 30కి పైగా కమిటీల ప్రకటన
ప్రవాస తెలుగు సంఘాల్లో ప్రథమ సంస్థ ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలు, ద్వైవార్షిక మహాసభల గురించి తెలుగువారికి ప్రత్యేకంగా ప్రస్తావించనవసరం లేదు. తెలుగు జాతి ఖ్యాతి, సంస్కృతి, సంప్రదాయాలను ఉత్తర అమెరికా తెలుగు ప్రజల ముంగిటకు తెచ్చే ప్రవాస తెలుగువారి పండగ తానా మహాసభలు.
ప్రతి రెండేళ్ల కొకసారి అంగరంగ వైభవంగా జరిగే తానా ప్రపంచాన్ని కుదిపేసిన కోవిడ్ మహమ్మారి కారణంగా 2021లో అంతరాయం ఏర్పడడంతో, ఈ సంవత్సరం జులై 7 నుండి 9 వ తేదీ వరకు ఫిలడెల్ఫియా నగరంలో జరగబోయే తానా మహాసభల కోసం ఇటు ఉత్తర అమెరికాలో అటు భారతదేశంలోని తెలుగు ప్రజలంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
23వ తానా మహాసభల కోసం అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రం, కాలేజీవిల్ నగరంలోని కమ్యూనిటీ మ్యూజిక్ స్కూల్ ఆడిటోరియంలో ఆదివారం జనవరి 22వ తేదీన తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి శంఖం పూరించగా, మహాసభల సమన్వయకర్త రవి పొట్లూరి నేతృత్వంలో ప్రతిష్టాత్మక 23వ తానా మహాసభల సమన్వయ కమిటీల నియామకాలకు విశేష స్పందన లభించింది.
తెలుగు బాష, సంస్కృతిపై, మాతృభూమిపై మక్కువ ఉన్న మూడు వందల మందికి పైగా తానా సభ్యులు మేము సైతం అమ్మలాంటి తానా కోసం అని స్వచ్ఛందంగా ముందుకు వచ్చి జులై 7, 8, 9వ తేదీలలో ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్లో జరగబోయే తానా మహాసభలను జయప్రదం చేసేందుకు తమ తమ పేర్లను నమోదు చేసుకున్నారు.
23వ తానా మహాసభలను విజయవంతంగా నిర్వహించడానికి తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు మరియు సమన్వయకర్త రవి పొట్లూరి మహాసభల ముఖ్య కమిటీల గురించి వివరించి, బాధ్యులను ప్రకటించి ఆసక్తిగల వారి వివరాలు నమోదు చేసుకుని వారికి కూడా బాధ్యతలు అప్పగించారు.
మహాసభల కార్యదర్శిగా సతీష్ తుమ్మల, కోశాధికారిగా భరత్ మద్దినేని, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా రవి మందలపు, ఇండియా వ్యవహారాల డైరెక్టర్ గా వంశీ కోట, జాయింట్ సెక్రెటరీగా శ్రీనివాస్ కూకట్లకు భాద్యతలు అప్పగించారు. తానా మహాసభలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ముప్పైకు పైగా కమిటీలను ప్రకటించారు.
ఈ సందర్బంగా అక్కడకి విచ్చేసిన తెలుగువారిలో కొందరు ఫిలడెల్ఫియాలో 2001 లో జరిగిన 13వ తానా మహాసభల గతానుభూతులను నెమరువేసుకున్నారు. ఈ కార్యక్రమంలో తానా కమ్యూనిటీ సర్వీసెస్ కోఆర్డినేటర్ రాజా కసుకుర్తి, తానా ఫౌండేషన్ ట్రస్టీ విద్యాధర్ గారపాటి, రీజినల్ కోఆర్డినేటర్లు సునీల్ కోగంటి, వంశీ వాసిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.