దోహా (Doha) లో వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా & ఆంధ్ర కళా వేదిక సంయుక్త నిర్వహణలో ఖతార్ (Qatar) దేశ రాజధాని దోహా (Doha) లో నవంబర్ 22-23, 2024 తేదీలలో జరిగిన 9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు (Telugu Literature Conference) అఖండ విజయం సాధించి, మధ్య ప్రాచ్య దేశాలలో జరిగిన తొలి తెలుగు సాహితీ సదస్సుగా ‘తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్’ లో స్థానం సంపాదించుకుంది.
మధ్యప్రాచ్య దేశాల నుండి 9 తెలుగు సంస్థల సహకారంతో నిర్వహింపబడిన ఈ చారిత్రాత్మక సదస్సుకు ప్రధాన అతిధిగా భారత పూర్వ ఉపరాష్ట్రపతి (Former Vice President of India) గౌ. వెంకయ్య నాయుడు (Venkaiah Naidu) గారు విచ్చేశారు. ఖతార్ లో భారతదేశ రాయబారి (Ambassador of India) శ్రీ విపుల్ (Vipul) కూడా సదస్సుకు హాజరై నిర్వాహకులను అభినందించారు.
అమెరికా (USA), భారత దేశం, ఉగాండా, స్థానిక ఆరబ్ దేశాలతో సహా 10 దేశాల నుంచి రెండు రోజుల పాటు సుమారు 200 మంది తెలుగు భాషా, సాహిత్యాభిమానులు ఈ సదస్సులో పాల్గొని తెలుగు భాష (Telugu Language) సాహిత్యానందంతో జీవిత కాలం గుర్తుంచుకునే అనుభూతి పొందారు.
సుమారు 18 గంటల సేపు 60 కి పైగా సాహిత్య ప్రసంగాలు, 30 మంది స్వీయ కవిత, కథా పఠనం, 34 నూతన తెలుగు గ్రంధాల ఆవిష్కరణ, మధ్యప్రాచ్య దేశాలలో తెలుగు ఉపాధ్యాయులకు సత్కారం, సినీ సంగీత విభావరి, స్థానిక దోహా కళాకారులు, చిన్నారుల నృత్య ప్రదర్శనలతో అందరినీ ఆకట్టుకున్న ఈ దోహా (Doha) సదస్సులో స్థానిక నిర్వాహక సంస్థ అంధ్ర కళా వేదిక వారి ఆతిధ్యం ‘న భూతో న భవిష్యతి’ అని అందరి మన్ననలూ పొందింది.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖా మంత్రి శ్రీ కందుల దుర్గేష్ (Kandula Durgesh) గారు మరియు MSME, SERP & NRI సాధికారత శాఖామంత్రి శ్రీ కొండపల్లి శ్రీనివాస్ (Kondapalli Srinivas) గారు సదస్సుకు ప్రత్యేక అభినందనలు వీడియో సందేశం రూపంలో తెలియజేశారు.“మన తెలుగు సారస్వత సంపదని సృష్టిస్తూ, పెంపొందిస్తూ, భాషకీ, సంస్కృతికీ మధ్య వెన్నెముకలా నిలిచే తెలుగు రచయిత ఎవరో చెప్తే రచనావ్యాసంగం చేపట్టిన వారు కాదు అనీ, రచయితలు స్వయంభువులు, అనగా దైవ స్వరూపులు అనీ, వారిని గౌరవించడమే ఈ సదస్సు ప్రధాన ఉద్దేశ్యం” అని వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా అధ్యక్షులు వంగూరి చిట్టెన్ రాజు తన స్వాగత సందేశంలో వినిపించారు.
“మాతృమూర్తి, మాతృభూమి, మాతృభాషలే మన ఆస్తిత్వం. ఒక దేశ సౌరభాన్ని అక్కడి సాహిత్యం ప్రతిబింబిస్తుంది. అందువలన సృజనాత్మకత, మానవీయ విలువలు, సామాజిక చైతన్యానికి పెద్ద పీట వేసే రచనలు రావాలి” అని ఉత్తేజకరమైన తన ప్రధాన ఉపన్యాసంలో గౌ. వెంకయ్య నాయుడు (Venkaiah Naidu) గారు పిలుపునిచ్చారు.
దోహా (Doha) లో ఇటువంటి ప్రతిష్ఠాత్మకమైన సదస్సు నిర్వహించడం తమ సంస్థ అదృష్టం అని ఆంధ్ర కళా వేదిక అధ్యక్షులు వెంకప్ప భాగవతుల సభాసదులకి స్వాగతం పలికారు.రాధిక మంగిపూడి (Mumbai), విక్రమ్ సుఖవాసి (Doha) ప్రధాన నిర్వాహకులుగా, శాయి రాచకొండ (Houston), వంశీ రామరాజు (Hyderabad) దోహా ఆంధ్ర కళా వేదిక కార్యవర్గ సభ్యులైన సాయి రమేశ్ నాగుల, దాసరి రమేశ్, శేఖరం.ఎస్. రావు, గోవర్ధన్ అమూరు, ఆరోస్ మనీష్ మొదలైనవారు, శ్రీ సుధ బాసంగి, శిరీష్ రామ్ బవిరెడ్డి, రజని తుమ్మల, చూడామణి ఫణిహారం మొదలైన వ్యాఖ్యాతలు 14 ప్రసంగ వేదికలను సమర్ధవంతంగా నిర్వహించారు.
ప్రముఖ సాహితీవేత్తలు డా. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ (Yarlagadda Lakshmi Prasad), కవి జొన్నవిత్తుల, వామరాజు సత్యమూర్తి, అద్దంకి శ్రీనివాస్, కవి మౌనశ్రీ మల్లిక్, రాజ్యశ్రీ కేతవరపు, అత్తలూరి విజయలక్ష్మి, చెరుకూరి రమాదేవి, కలశపూడి శ్రీనివాస రావు, గంటి భానుమతి, గరికిపాటి వెంకట ప్రభాకర్, బి.వి. రమణ, ప్రభల జానకి, విశ్వవిద్యాలయ ఆచార్యులు అయ్యగారి సీతారత్నం, శరత్ జ్యోత్స్నా రాణి, త్రివేణి వంగారి, దేవీ ప్రసాద్ జువ్వాడి, కట్టా నరసింహా రెడ్డి, సినీ నిర్మాతలు వై.వి. ఎస్. చౌదరి (Y. V. S. Chowdary), మీర్ అబ్దుల్లా, నాట్య గురువు ఎస్.పి. భారతి మొదలైన వక్తలు, కవులు వైవిధ్యమైన అంశాల మీద తమ సాహిత్య ప్రసంగాలను, స్వీయ రచనలను వినిపించారు.
వరంగల్ కి చెందిన ప్రొ. రామా చంద్రమౌళి గారికి వంగూరి ఫౌండేషన్ జీవన సాఫల్య పురస్కారంతో సత్కరించింది, సదస్సులో భాగంగా శ్రీమతి బులుసు అపర్ణ (Bulusu Aparna) చేసిన అష్టావధానం అందరినీ ప్రత్యేకంగా అలరించడమే కాకుండా, మధ్య ప్రాచ్య దేశాలలోనే జరిగిన తొలి అష్టావధానంగా రికార్డ్ ను సృష్టించింది.
రెండవ రోజు సాయంత్రం జరిగిన ముగింపు సభలో నిర్వాహకుల తరఫున వందన సమర్పణ కార్యక్రమంలో వదాన్యులకు ధన్యవాదాలు తెలియజేశారు. దుబై (Dubai), అబుదాబి (Abu Dhabi), బెహ్రైన్ (Bahrain), ఒమాన్ (Oman), ఖతార్ (Qatar) తదితర ప్రాంతాల తెలుగు సంఘాల అధ్యక్షులు తెలుగు భాషా, సాహిత్యాల పెంపుదలకి తమ వంతు కృషి చేస్తామని వివరించారు.