Connect with us

Literary

Qatar రాజధాని Doha లో ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు, సభా విశేష సంచిక ఆవిష్కరణ

Published

on

Doha, Qatar: ఖతార్ దేశ రాజధాని దోహా (Doha) మహానగరంలో ప్రతిష్టాత్మకంగా 2024 నవంబర్లో జరిగిన “9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు” యొక్క సభా విశేష సంచిక అంతర్జాల మాధ్యమంలో ఆదివారం విజయవంతంగా ఆవిష్కరించబడింది. ‘వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా’ (Vanguri Foundation of America) మరియు ‘ఆంధ్ర కళా వేదిక – ఖతార్’ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడింది.

మధ్య ప్రాచ్య దేశాలలోనే తొలి సాహితీ సదస్సుగా రికార్డును సృష్టించిన ఈ ‘9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సులో పది దేశాల నుండి పాల్గొన్న వక్తలు, కవులు, రచయితలు ప్రసంగించిన అన్ని అంశాలను పొందుపరుస్తూ 380 పేజీల తో ఈ సభా విశేష సంచిక రూపొందించబడింది. ఈ ఉద్గ్రంధానికి సంపాదకులుగా రాధికా మంగిపూడి (Radhika Mangipudi), విక్రమ్ సుఖవాసి (Vikram Sukhavasi), వంగూరి చిట్టెన్ రాజు (Vanguri Chitten Raju), లక్ష్మి రాయవరపు, శాయి రాచకొండ వ్యవహరించారు.

సదస్సు నిర్వాహకవర్గము, సంచిక సంపాదకులు, సదస్సులో వివిధ దేశాల నుండి పాల్గొన్న వక్తలు, రచయితలు అందరి సమక్షంలో ఈ పుస్తక ఆవిష్కరణ జరగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకించి అంతర్జాల మాధ్యమంలో (Online) ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు.

వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా (Vanguri Foundation of America) వ్యవస్థాపకులు డా. వంగూరి చిట్టెన్ రాజు (Dr. Vanguri Chitten Raju), ఖతార్ (Qatar) ఆంధ్ర కళా వేదిక నుండి విక్రమ్ సుఖవాసి ప్రధాన నిర్వాహకులుగా, వారి అధ్యక్షతన, రాధిక మంగిపూడి సభానిర్వహణలో దాదాపు మూడు గంటల పాటు ఆదివారం సాయంత్రం నిర్వహింపబడిన ఈ కార్యక్రమంలో భారత్, ఖతార్, అమెరికా, సౌదీ అరేబియా, బహరైన్, యూఏఈ, సింగపూర్ తదితర దేశాలనుండి వక్తలు, తెలుగు సంస్థల ప్రతినిధులు, రచయితలు పాల్గొన్నారు.

అమెరికా నుండి చెరుకూరి రమాదేవి (Cherukuri Ramadevi), శాయి రాచకొండ (Sai Rachakonda), భారత్ నుండి డా. వంశీ రామరాజు, డా. అద్దంకి శ్రీనివాస్, డా. బులుసు అపర్ణ, ఆచార్య అయ్యగారి సీతారత్నం, ఆచార్య త్రివేణి వంగారి, కస్తూరి అలివేణి, డా. దేవులపల్లి పద్మజ తదితరులు, బహరైన్ నుండి మురళీకృష్ణ, సౌదీ అరేబియా నుండి కోనేరు ఉమామహేశ్వరరావు, చివుకుల పట్టాభిరామ శర్మ, సింగపూర్ నుండి కవుటూరు రత్నకుమార్, యూఏఈ నుండి షేక్ రఫీ, డా. తాడేపల్లి రామలక్ష్మి, ఖతార్ నుండి శ్రీసుధ, గోవర్ధన్ రెడ్డి, మనీష్, మాధవి లలిత, గౌరీ బొమ్మన తదితరులు ఆసక్తిగా పాల్గొని సదస్సు యొక్క జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.

సభా విశేష సంచికలో నిర్వాహక సంస్థల పరిచయాలు, అధ్యక్షుల, సంచాలకుల ముందుమాటలు, సదస్సు యొక్క ప్రకటనలు, వక్తలందరి ఫోటోలు, వ్యాసాలు, కథలు, కవితలతో పాటు, సదస్సు అనంతరం అందరూ అందించిన స్పందనలు కూడా జోడించబడడం, సమగ్రస్థాయిలో రూపొందింపబడటం చాలా ఆనందంగా ఉందని, జీవితంలో ఒక మధుర జ్ఞాపకంగా చరిత్రలో నిలిచిపోయే విధంగా సంచిక ఉందని అందరూ అభిప్రాయం వ్యక్తం చేస్తూ సంపాదకులను నిర్వాహకులను అభినందించారు.

డా. వంగూరి చిట్టెన్ రాజు మాట్లాడుతూ “మధ్యప్రాచ్య దేశాలలో తెలుగు సాహిత్య అభిమానులందరికీ ఈ సదస్సు కొత్త స్ఫూర్తిని అందించిందని,  సదస్సు యొక్క ప్రభావం వలన ఎంతోమంది సాహిత్యంపై చక్కటి ఆసక్తి పెంచుకోవడం, కొత్త రచయితలు జనించడం.. ఆనందదాయకమని తెలియజేశారు. ఇటువంటి సదస్సులు మరిన్ని జరగాలని, కొత్త రచయితలు యువతరం ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

విక్రమ్ సుఖవాసి ఆంధ్ర కళావేదిక తరపున మరొకసారి అందరికీ తమ దేశానికి విచ్చేసి కార్యక్రమంలో పాల్గొన్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ తొలిసారి ప్రపంచ సదస్సుకు సంచాలకునిగా మరియు ఈ సభా విశేష సంచికకు సహసంపాదకునిగా ఉండడం చాలా ఆనందంగా ఉందని తెలియజేశారు.

ఈ సంచికకు రూపకల్పన సహకారం అందించిన జేవి పబ్లికేషన్స్ అధినేత్రి జ్యోతి వలబోజు (Jyoti Valaboju) కూడా ఈ ఆవిష్కరణలో పాల్గొన్నారు. ఇతర మధ్యప్రాచ్య దేశాల సంస్థల ప్రతినిధులు మాట్లాడుతూ తమ దేశాలలో కూడా ఇటువంటి సాహిత్య సదస్సులు నిర్వహించడానికి తాము సిద్ధంగా ఉన్నామని 10వ ప్రపంచ సదస్సు జరపడానికి అవకాశం ఇమ్మని కోరుతూ తమ ఉత్సాహాన్ని వ్యక్తపరిచారు.

ఈ కార్యక్రమం వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా (Vanguri Foundation of America) యూట్యూబ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేయబడింది. పూర్తి కార్యక్రమాన్ని క్రింది యూ ట్యూబ్ లింక్ లో వీక్షించగలరు.

error: NRI2NRI.COM copyright content is protected