Vijayawada, Andhra Pradesh: రాష్ట్ర సాగునీటి సంఘాల కార్యాలయం నుండి ఈ రోజు సాయంత్రం ప్రపంచ నేల దినోత్సవం సందర్భంగా మట్టికి, రైతులకు సంబంధాన్ని వివరిస్తూ ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆళ్ళ వెంకట గోపాల కృష్ణారావు మాట్లాడుతూ.. మట్టికి, మనిషికి విడదీయరాని బంధం ఉందనీ, మట్టి.. రైతు చేతిలో వున్నంతకాలం భద్రంగా ఉంది. ఎప్పుడైతే కార్పొరేట్ వర్గాల చేతిలో పడిందో, మట్టికున్న సహజ పరిమళం పోయిందని అన్నారు.
1992 లో ఐక్యరాజ్య సమితిలో ఎఫ్.ఏ.ఓ సూచనల మేరకు జరిగిన ధరిత్రీ దినోత్సవం సందర్భంగా నేలను రక్షించాలనే విషయం గురించి చర్చ జరిగింది. జన్యుమార్పిడి విత్తనాలు, విపరీతంగా క్రిమి సంహారక మందుల వినియోగం, అడవుల క్షీణత తదితర కారణాల వల్ల నేలకున్న సహజ స్వభావం పోయింది. నేల కాలుష్యం వల్ల నీరు కూడా కలుషితం అవుతుందని అన్నారు.
గనుల తవ్వకం, సహజ వనరుల దోపిడి వల్ల గుట్టలు, కొండలు అదృశ్యమౌతున్నాయి. ఫలితంగా గాలిలో దుమ్ము, ధూళి బాగా పెరుగుతుంది. పంటల దిగుబడి తగ్గుతుంది. దీని వల్ల పేదవారికి సరైన ఆహారం లభించడం లేదు. నదులను, చెరువులను ఆక్రమించుకోవడం వల్ల కొద్దిపాటి వర్షాలకే లోతట్టు ప్రాంతాలు జలమయమౌవుతున్నాయి. పట్టణాల్లో వర్షా కాలంలో ఇటువంటి పరిస్థితులు ఎక్కువగా కన్పిస్తున్నాయన్నారు.
అకాల వర్షాల వల్ల వరదలు వచ్చి సారవంతమైన మట్టి కొట్టుకొని పోతుంది. మరోవైపు అనేక వ్యర్థ పదార్థాలు నేలలో కలవడం వల్ల మనిషితో పాటు ఇతర జీవరాశులకు ఇబ్బంది ఏర్పడి జీవ వైవిధ్యం లో మార్పులు వస్తున్నాయి. మట్టిని రక్షించు కోవడం మనందరి సామాజిక బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమం లో రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి కుర్రా నరేంద్ర, ప్రాజెక్ట్ కమిటీ మాజీ ఛైర్మెన్ లు యనమద్ది పుల్లయ్య చౌదరి, గుత్తా శివరామ కృష్ణా,మైనేని మురళీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.