ఉమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ (WETA) ఝాన్సీ రెడ్డి గారి ఆధ్వర్యంలో న్యూ జెర్సీ సిటీ, మన్రో టౌన్‌షిప్ సాయి బాలాజీ దేవాలయంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటాయి. ముత్యాల పూల పులకరింతలు, మందార మకరందాలు, బంతి సింగారాలతో ముస్తాబై బతుకమ్మగా పూదొంతరల శిఖరాగ్రాన పూలతో అలంకరించిన 12 అడుగుల బతుకమ్మ మరియు అమ్మవారు విగ్రహం మధ్య కొలువుదీరిన గౌరమ్మ ను చూసి ఆడిపాడి దర్శించేందుకు దాదాపుగా 1000 మంది విచ్చేశారు.
మధ్యాహ్నం 4 గంటలకు లలితా సహస్ర నామ పూజతో కార్యక్రమం ప్రారంభమయింది. చాలా మంది వాలంటీర్స్ ఇందుకు గాను సహాయసహకారాలు అందించారు. భారత దేశం నుంచి తెప్పించిన సహజసిద్ధమైన పూలతో (Natural Flowers) బతుకమ్మను తంగేడు, కట్ల, గునుగు, బంతి, గుమ్మడి, బీర, అస్తెర్ మొదలగు పూలతో అందముగా అలంకరణ చేశారు.
‘ఉమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ (వేటా) స్థాపించినప్పటినుంచి ప్రతి ఏడాది ఈ బతుకమ్మ పండుగను వైభవంగా నిర్వహిస్తూ వస్తున్నారు. ప్రముఖ సినిమా తార, టీవీ యాంకర్ ఉదయ భాను ఆహుతులతో కలిసి ఆనందోత్సాహాల నడుమ బతుకమ్మ ఆడడమే కాకుండా వివిధ కార్యక్రమాలతో కార్యక్రమానికి వచ్చిన వారందరిని అలరించారు.
ఈ కార్యక్రమం విజయవంతం చేసిన వారందరికి WETA ప్రెసిడెంట్ ఝాన్సీ రెడ్డి హనుమాండ్ల, అడ్వైజరీ కౌన్సిల్ కో-చైర్ డా. అభితేజ కొండా, ప్రెసిడెంట్ ఎలెక్ట్ శైలజ కల్లూరి కృతఙ్ఞతలు తెలియచేశారు. ఈ కార్యక్రమం సుగుణ రెడ్డి, జయశ్రీ తెలుకుంట్ల, ప్రీతి రెడ్డి, చైతన్య పోలోజు పర్యవేక్షణలో జరిగింది.
వాలంటీర్లు ప్రత్యూష, మాధురి, చరణ్ తదితరులు సహాయపడ్డారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన సూర్యనారాయణ గారికి, రామకృష్ణ గారికి, రమేష్ గారికి, టిపి శ్రీనివాస్ గారికి, వంశీ గారికి, సలహాదారులు ప్రసాద్ గారికి, సుబ్బారావు గారికి మరియూ మహేష్ గారికి WETA టీం కృతజ్ఞతలు తెలుపుకున్నారు.