తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా ‘తానా’ 23వ మహాసభలు ఫిలడెల్ఫియా మహానగరంలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్లో 2023 జులై 7, 8, 9 తేదీలలో అంజయ్య చౌదరి లావు అధ్యక్షతన, రవి పొట్లూరి కన్వీనర్ గా నిర్వహిస్తున్న విషయం అందరికీ తెలిసిందే.
ఇప్పటికే ఇండియాలో రెండు తెలుగు రాష్ట్రాలలోని వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులను తానా (Telugu Association of North America) నాయకులు ముఖాముఖీగా కలిసి ఆహ్వానపత్రాలు అందజేశారు. టాలీవుడ్, రాజకీయ, సాహిత్య, విద్యా రంగాలకు చెందిన పలువురు సెలబ్రిటీలు తానా మహాసభలకు వస్తున్నారంటున్నారు.
ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ లీడర్షిప్ ఇప్పటివరకు చెప్పినవారిలో నిజంగా కన్వెన్షన్ కి ఎవరు వస్తున్నారు, ఎవరు రావడం లేదు? అనే ప్రశ్న కొందరి మనస్సులో మెదులుతుంది. ఈ ప్రశ్నలకు సమాధానం వెతికే పనిలో బుర్రకి కొంచెం పని పెట్టి ఆలోచిద్దాం.
ఇప్పటి వరకు రిలీజ్ చేసిన వారిలో ముఖ్యమైన వారికి ఒక్కొక్కరికి ప్రత్యేక ఫ్లయర్ రిలీజ్ చేశారు. మ్యూజికల్ కాన్సర్ట్స్ విషయానికొస్తే దక్షిణ భారత నైటింగేల్‌గా పిలిచే పద్మభూషణ్ కె.ఎస్. చిత్ర జులై 7న బాంక్వెట్ డిన్నర్ లో, టాలీవుడ్ ట్రెండీ రాక్ స్టార్ సంగీత దర్శకులు దేవిశ్రీ ప్రసాద్ జులై 8న, పద్మవిభూషణ్ మేయిస్ట్రో ఇళయరాజా జులై 9న ఇలా మూడు రోజుల కన్వెన్షన్ లో ప్రతిరోజూ దుమ్ము రేపెలా ప్లాన్ చేశారు.
అలాగే ప్రముఖ ధ్యాన గురువులు, ప్రకృతి ప్రేమికులు అయినటువంటి పద్మవిభూషణ్ సద్గురు జులై 8న, పద్మభూషణ్ దాజీ గా పిలిచే కమలేశ్ డి. పటేల్ జులై 9న ఆధ్యాత్మికతను పెంపొందించనున్నారు. ఇక తానా కన్వెన్షన్ మొత్తానికే క్రేజ్ తెచ్చిన బాక్స్ ఆఫీస్ బొనాంజా, అన్స్టాపబుల్ నందమూరి బాలక్రిష్ణ, గౌరవనీయ భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు కన్వెన్షన్ ఆసాంతం పాల్గొననున్నారు.
ప్రస్తుతం మంచి హిట్ సినిమాలతో ఊపులో ఉన్న హీరోయిన్ శ్రీలీల, టాలీవుడ్ యూత్ హీరో నిఖిల్ మరియు కాప్రీషియో బ్యాండ్ జులై 7న యూత్ కన్వెన్షన్ లో పాల్గొంటున్నారు. ఇకపోతే మురళీమోహన్, రాజేంద్రప్రసాద్, యాంకర్ అనసూయ, పలువురు గాయనీగాయకులు, జబర్దస్ టీం తదితరులు అందరూ వస్తున్నారు.
ఇక మిగిలిన అత్యంత ముఖ్యమైన వారిలో తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఉన్నారు. తనకి స్వయంగా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు సారధ్యంలోని తానా బృందం ప్రత్యేకంగా కలిసి ఆహ్వానించిన సంగతి తెలిసిందే.
కాకపోతే చంద్రబాబు నాయుడు వస్తున్నట్లు, వస్తే ఏరోజు వస్తున్నట్లు అని ప్రత్యేక ఫ్లయర్ ఏమీ రిలీజ్ చెయ్యలేదు. మెయిన్ ఫ్లయర్లో కూడా లేరు కనుక, అందునా రాబోయే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ కి సంబంధించి బిజీగా ఉంటున్న చంద్రబాబు నాయుడు రానట్టే అనుకోవాలి. నిజంగా వస్తే పుబ్లిసీటీ ఈపాటికి ఇంకోలా ఉండేది.
అయినా తానా వారు కూడా చంద్రబాబు ని ఆహ్వానించామని చెప్పారేకానీ, వస్తున్నారని ఎక్కడా చెప్పలేదు. ఇవన్నీ గమనిస్తే ఒక్క నారా చంద్రబాబు నాయుడు తప్ప ఫ్లయర్స్లో ఉన్న ప్రతి ఒక్క సెలెబ్రిటీ ఈ తానా 23వ మహాసభలకు వస్తున్నారు. కాబట్టి ఎక్కువగా ఆలోచించకుండా అందరూ త్వరగా డిస్కౌంట్ రేటులో జూన్ 9 లోపు టికెట్స్ కొనుక్కోవలసిందిగా తానా మహాసభల నిర్వాహకులు కోరుతున్నారు.