ఐశ్వర్యం అంటే నోట్ల కట్టలు లేక బ్యాంక్ లాకర్లలో దాచిన బంగారం కాదు. ఎవరు దొంగిలిస్తారో అని భయంతో దాచుకునే సంపద ఐశ్వర్యం కాదు. సంపద ఎప్పుడూ మనతోనే ఉంటుంది అనే ధైర్యం కూడా ఐశ్వర్యం కాదు. మరి ఐశ్వర్యం అంటే ఏంటి? ఐశ్వర్యం ఎలా ఉంటుంది?
బతికినన్ని రోజులు సంతోషంగా ఉంటే అదే ఐశ్వర్యం. తినడానికి సరిపడా ఉంటే ఐశ్వర్యం. టైంకి ఆకలి వేస్తే ఐశ్వర్యం. తిన్నది అరిగితే ఐశ్వర్యం. రోగాలు రాకుంటే ఐశ్వర్యం. టైంకి నిద్రపడితే ఐశ్వర్యం. మన పిల్లలకి మంచి బుద్ధులు అలవడితే ఐశ్వర్యం. మన చుట్టూ మనకోసం నలుగురు ఉంటే ఐశ్వర్యం. అవసరంలో ఆదరించే ప్రాణస్నేహితులు ఐశ్వర్యం. ఐశ్వర్యం అంటే ఇంకా ఏంటి?
పాల బుగ్గల చిన్నారుల చిరునవ్వు ఐశ్వర్యం. ఇంట్లో ఆడపిల్ల గజ్జల చప్పుడు ఐశ్వర్యం. ఇంటికి రాగానే చిరునవ్వుతో ఎదురొచ్చే భార్య ఐశ్వర్యం. ఎంత ఎదిగినా నాన్న తిట్టే తిట్లు ఐశ్వర్యం. అమ్మ చేతి భోజనం ఐశ్వర్యం. భార్య చూసే ఓర చూపు ఐశ్వర్యం.
పచ్చని చెట్లు, పంటపొలాలు ఐశ్వర్యం. వెచ్చని సూర్యుడు ఐశ్వర్యం. పౌర్ణమి నాడు జాబిల్లి ఐశ్వర్యం. మనచుట్టూ ఉన్న పంచభూతాలు ఐశ్వర్యం. ప్రకృతి అందం ఐశ్వర్యం. పెదాలు పండించే నవ్వు ఐశ్వర్యం. చాలామంది కన్నా ఉన్నతంగా ఉన్నామనుకునే తృప్తి ఐశ్వర్యం. పరులకు సాయంచేసే మనసు ఐశ్వర్యం. కళ్ళు చూపెట్టే ప్రపంచం ఐశ్వర్యం.