Connect with us

Events

ఆకట్టుకున్న సినీ నటి ఐశ్వర్య రాజేష్ ప్రదర్శన, షడ్రుచుల భోజనం @ Washington Telugu Samithi ఉగాది ఉత్సవం

Published

on

ఏప్రిల్ 6, శనివారం సాయంత్రం, వాషింగ్టన్ తెలుగు సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన విశ్వావసు నామ సంవత్సర ఉగాది ఉత్సవం బోతెల్ (Bothell) లోని నార్త్‌షోర్ పెర్ఫార్మెన్స్ ఆర్ట్స్ సెంటర్ (Northshore Performance Arts Center) వేదికగా అంగరంగ వైభవంగా జరిగింది. వాషింగ్టన్ (Washington) నలుమూలల నుండి విచ్చేసిన సుమారు 1500 మంది తెలుగు ప్రజలతో వేదిక ఉత్సాహభరితంగా మారింది.

ఈ సంవత్సరం WATS (Washington Telugu Samithi) అధ్యక్షుడిగా రాజేష్ గూడవల్లి (Rajesh Gudavalli) గారు బాధ్యతలు చేపట్టి, బోర్డు సభ్యులు మధు రెడ్డి, ప్రకాష్ కొండూరు, రామ్ తమ్మినేని, హరిని దేశరాజు, శివ వెదురుపాటి, శ్రీరామ్ పాటిబండ్ల మరియు ఇతర కార్యకర్తలతో కలిసి, రెండు నెలల ప్రణాళికతో ఈ ఉత్సవాన్ని అత్యుత్తమంగా నిర్వహించారు.

వేదిక మొత్తం పూలతోరణాలు, సంప్రదాయ వస్తువులు, దీపాల వెలుగులతో శోభాయమానంగా అలంకరించబడింది. చిన్నారులు మరియు పెద్దలు సాంప్రదాయ దుస్తుల్లో పాల్గొనడం ఉత్సవానికి మరింత అందాన్ని తెచ్చిపెట్టింది. కార్యక్రమం బోర్డు సభ్యుల మరియు వారి కుటుంబ సభ్యులతో జ్యోతి వెలిగించడం ద్వారా ప్రారంభమైంది.

బోతెల్ తెలుగు పూజారి శ్రీ వాసుదేవ శర్మ గారు ఉగాది పంచాంగ శ్రవణం (Panchanga Sravanam) నిర్వహించి, విశ్వావసు నామ సంవత్సర రాశిఫలాలను వివరించారు. 300 మంది పాల్గొన్న డాన్స్ ప్రదర్శనలు, అలాగే సినీ నటి ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh) గారి నృత్య ప్రదర్శన వేదికపై ఉత్సవాన్ని మరింత ప్రత్యేకంగా నిలిపాయి.

చిన్నారులు వారి అనేక నృత్య ప్రదర్శనలతో ప్రేక్షకులను మంత్ర్ముగ్ధులను చేసారు. ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh) గారి నృత్య ప్రదర్శన కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కొన్ని జంటలు ఆమె నటించిన “సంక్రాంతికి వస్తున్నాం” చిత్రంలో సన్నివేశాన్ని నటించి ప్రేక్షకులను నవ్వులతో ముంచెత్తారు.

ఈ విశ్వావసు నామ సంవత్సర ఉగాది (Ugadi) కార్యక్రమాన్ని ఎంతో ఉత్సాహంగా, ఆనందంగా నడిపించడంలో హరిత సిస్తా, రవి దశిక, సాయిరాం దేశరాజు కీలక పాత్ర పోషించారు. వారి అద్భుతమైన ఏంకరింగుతో, ప్రతి దశలో ప్రేక్షకులను ఉత్సాహంగా ఉంచారు.

ఈ వేడుకలో ప్రధాన ఆకర్షణగా నిలిచినది భారతదేశం నుండి తెప్పించిన ప్రత్యేక వంటకాలు మరియు కర్రీ పాయింట్ రెస్టారెంట్ (Curry Point Restaurant) అందించిన షడ్రుచుల భోజనం. ఉగాది పచ్చడి మరియు పానకం తో సహా 25కి పైగా రుచికరమైన వంటకాలతో అరిటాకు బంతి భోజనాలు అందరినీ ముచ్చటెత్తించింది.

వాలంటీర్లు (Volunteers) సంప్రదాయ దుస్తుల్లో భోజనం అందించడం ద్వారా అందరికీ ప్రత్యేకమైన అనుభవాన్ని అందించారు. భోజనశాలలోనే సెలబ్రిటీ అతిథి ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh) గారు ప్రత్యక్షంగా వచ్చి, భోజనం ఆస్వాదించడమే కాకుండా, అనేక మంది అభిమానులతో సెల్ఫీలు తీసుకుంటూ, ప్రేక్షకుల్ని మరింత ఉత్సాహపరిచారు.

ఈ సందర్భంగా, అధ్యక్షుడు రాజేష్ గూడవల్లి గారు, వాషింగ్టన్ తెలుగు సమితి (Washington Telugu Samithi – WATS) ని గత పూర్వ అధ్యక్షులను వేదికపైకి ఆహ్వానించి, శాలువాలతో ఘనంగా సత్కరించారు. వారి ద్వారా స్థాపించబడిన పునాదుల పట్ల కృతజ్ఞతలు తెలిపారు.

వోట్ఆఫ్ థ్యాంక్స్ సందర్భంగా, రాజేష్ గూడవల్లి గారు ఈ కార్యక్రమం విజయవంతంగా జరగటానికి సహకరించిన వాలంటీర్లు, స్పాన్సర్లు, మరియు ప్రేక్షకులకు సాదరంగా ధన్యవాదాలు తెలిపారు. ప్రత్యేకంగా స్పాన్సర్లు మరియు వాలంటీర్ల సేవలను ప్రశంసించారు.

అదే విధంగా, తెలుగు సంస్కృతి మరియు సంప్రదాయాలను యువతీకి మరియు వాషింగ్టన్ తెలుగు కమ్యూనిటీ (Washington Telugu Community) కి చేరవేయడం కోసం ఈ సంవత్సరం తాము నిర్వహించే విభిన్న కార్యక్రమాలు గురించి వివరించి కార్యక్రమాన్ని ముగించారు.

error: NRI2NRI.COM copyright content is protected