. 20 ఘనమైన వాట్స్ వసంతాలు
. సియాటిల్ బాలయ్య గా శ్రీనివాస్ అబ్బూరి టాక్ షో
. 8 గంటలపాటు సాంస్కృతిక కార్యక్రమాలు
. అలరించిన డి జె టిల్లు ఫేమ్ హీరోయిన్ నేహా శెట్టి డాన్సులు
. 2000 మందితో అంగరంగ వైభవంగా సంబరాలు
. సియాటిల్ సంఘ సేవకులకు సత్కారం
అక్టోబర్ 29 శనివారం సాయంత్రం వాషింగ్టన్ తెలుగు సమితి (Washington Telugu Samithi – WATS) నిర్వహించిన దీపావళి మరియు వాట్స్ 20 వ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా రెంటన్ ఐకియా పెర్ఫార్మన్స్ సెంటర్ లో నిర్వహించారు. ఇండియా నుంచి విచ్చేసిన తారలు మరియు వాషింగ్టన్ నలుమూలలు నుండి 2000 మందికి పైగా వాషింగ్టన్ లోని తెలుగు వీక్షకులులు, కళాకారులతో సర్వాంగ సుందరంగా అలంకరిచిన ఆడిటోరియం కళ కళ లాడింది.
అధక్షులు శ్రీనివాస్ (Srinivas Abburi) అబ్బూరి నాయకత్వంలో కార్య నిర్వాహక సభ్యులు రెండు నెలలుగా ఎంతో శ్రమించి వినూత్నంగా రూపొందించిన దీపావళి ప్రత్యేక కార్యక్రమాలు ఎనిమిది గంటల పాటు దాదాపు 79 సాంస్కృతిక కార్యక్రమాలతో ఉల్లాసంగా మరియు ఉత్సాహంగా సాగాయి. 180 కి పైగా చిన్నారులు, పెద్దలు చేసిన తెలుగు సాంస్కృతిక, చలన చిత్ర నృత్య ప్రదర్శనలు, పాడిన గీతాలు అందరినీ అలరించి ప్రతి ఒక్కరి హృదయాలను చూరగొన్నాయి.
ఆనందం అంతా ఇక్కడే ఉన్నదా అన్నట్టుగా తోరణాలు, బ్యానర్లు, పూదండలతో శోభాయమానంగా అలంకరించిన స్వాగత వేదిక వాషింగ్టన్ లోని తెలుగు ప్రేక్షకులని సాదరంగా ఆహ్వానించింది. సభ్యుల పరస్పర పలకరింపులతో, దీపావళి శుభాకాంక్షలతో, పిల్లల అల్లరి చేష్టలతో నిర్దేశించిన సమయాని కన్నా ముందే హాలు నిండిపోయింది.
అమెరికా హౌస్ ఆఫ్ కాంగ్రెస్ సభ్యులైన మంక దింగ్ర, వందన స్లాటర్, డెరెక్ స్టాన్ఫోర్డ్ విశేష అతిధులుగా విచ్చేసి తమ అభినందనలు తెలిపారు .వాషింగ్టన్ నలుమూలలు నుండి వచ్చిన చిన్నారుల అద్భుత ప్రదర్శనలతో ఆద్యంతం ఆకట్టుకున్నారు. ఇండియా నుండి విచ్చేసిన డి జె టిల్లు ఫేమ్ నేహా శెట్టి డాన్సులతో మరియు లావణ్య గూడూరు హుషారైన యాంకరింగ్ తో వేదిక ప్రాంగణం హోరు మన్నది.
ప్రెసిడెంట్ శ్రీనివాస్ అబ్బూరి చేసిన సియాటిల్ అన్ స్టాపబుల్ (Seattle Unstoppable) టాక్ షో తో స్టేజి ఈలలు చప్పట్లతో మార్మోగిపోయింది. సియాటిల్ బాలయ్య గా అబ్బూరి శ్రీనివాస్ ఆహార్యం, ఛలోక్తులు అతిధులను ఏంతో ఆకట్టుకున్నాయి. ఒక దశలో హీరోయిన్ నేహా శెట్టి కన్నా బాలయ్య గెటప్ లో ఉన్న అబ్బూరి గారితో సెల్ఫీ లు దిగటానికి పిల్లలు, పెద్దలు పోటీ పడ్డారు.
ప్రముఖ నాటక కళాకారులు శ్రీ దేవినేని రాజేంద్ర ప్రసాద్ గారి ఏక పాత్రాభినయం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. వాట్స్ 20 వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంగా పూర్వ ప్రెసిడెంట్స్ అందరితో చేసిన శుభాకాంక్షల వీడియో ఆహుతులను అలరించింది. నవరుచులతో ఏర్పాటు చేసిన దీపావళి విందు అందరినీ సంతృప్తి పరచింది.
చివరిగా ప్రెసిడెంట్ శ్రీనివాస్ అబ్బూరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆహ్వనితులకు మరియు ఇంతటి విజయవంతం కావటానికి సహకరించిన కార్యవర్గానికి, కార్యకర్తలకు పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. ఈసారి వినూత్నంగా స్పాన్సర్స్ కు మరియు ముఖ్యంగా తెలుగును ముందు తరాలకు తీసుకు వెళ్ళటం లో ముఖ్య భూమిక పోషిస్తున్న సియాటిల్ సంఘ సేవకులకు శాలువాలతో సత్కరించారు.
అనంతరం శ్రీనివాస్ అబ్బూరి అధ్యక్షులుగా తన ఈ సంవత్సర కార్యక్రమాలను వివరించారు. మన సంస్కృతీ, సంప్రదాయాల ఉద్దీపనకి, మన తెలుగు కమ్యునిటీ సంక్షేమానికి వాట్స్ చేస్తున్న కృషిని మరియు తాము భవిష్యత్తులో నిర్వహించబోయే కార్యక్రమాలను వివరించి కార్యక్రమాన్నిముగించారు.