అంతర్జాలం వేదికగా అమెరికా తెలుగు సంఘం (American Telugu Association) ఆదివారం అక్టోబర్ 1, 2023 న జానపదుల గుండె చప్పుడే జానపదం అంటూ నిర్వహించిన తెలంగాణ జానపద సాహిత్యం అంశంపై జానపద గీతాల విశ్లేషణాత్మకమైన కార్యక్రమం శ్రోతలను మరియు వీక్షకులను అలరించింది.
సాహిత్య (Literary) విభాగం అధిపతి మరియు పాలకమండలి సభ్యురాలు శారద సింగిరెడ్డి (Sharada Singireddy) అధ్యక్షతన జరిగిన అత్యంత అద్భుతమైన ఈ కార్యక్రమానికి ఆటా సాహిత్య వేదిక సభ్యులు శ్రీమతి మాధవి దాస్యం స్వాగత ప్రసంగం చేయగా, శ్రీ రవి తుపురాని మరియు శ్రీ వీరన్న పంజాల గాయని గాయకులను సభకు పరిచయం చేసారు.
కార్యక్రమానికి సంచాలకత్వం వహించిన వాగ్భూషణ పురస్కార గ్రహీత,సంస్కృతాంధ్ర పండితులు శ్రీ నంది శ్రీనివాస్ గారు మాట్లాడుతూ సామాజిక బాధ్యత గల సంస్థగా, విస్తృతమైన సాంస్కృతిక మరియు సాహిత్య కార్యకలాపాలను నిర్వహిస్తూ, వివిధ కళారూపాలను వెలికితీయడంలోను, యువ కళాకారుల ప్రతిభను వెలికితీయడంలోను ముందుండే అమెరికా తెలుగు సంఘం (ఆటా) తెలుగు సాహిత్యానికి చేస్తున్న సేవలు అనుపమానం అని కొనియాడారు.
సంగీతంలోని సప్తస్వరాలు ప్రకృతిలో నుండే గ్రహించారని, ప్రకృతిని, మానవ జీవితాన్ని వినిపించే జానపదుల గుండె చప్పుడే జానపదం అని అలాంటి జానపద గీతాలతో ఆలపించిన యువ జానపద కళాకారులు శ్రీ బొడ్డు దిలీప్ కుమార్, శ్రీ నక్క శ్రీకాంత్, మరియు కుమారి ముకుందలు అభినందనీయులు అన్నారు. ప్రతీ జానపద గేయం అర్ధం పరమార్ధం వివరించారు.
తదనంతరం ఈ కార్యక్రమంలొ ఆటా (ATA) అధ్యక్షురాలు శ్రీమతి మధు బొమ్మినేని గారు మాట్లాడుతూ.. ప్రతి భాషకు, సాహిత్యానికి మూలం జానపద సాహిత్యమని, ఇది మౌఖిక మరియు సదాచార సాహిత్యంగా పల్లెలందు ఈనాటికి మిగిలి ఉందని, తెలుగు జానపదాలు ముఖ్యంగా తెలంగాణా జానపదాలు సరళమైన భాషా సంవిధానంతో సామాన్య జీవుల శ్రమైక జీవన విధానం నుండి, వివిధ జాతుల సామాజిక, సాంస్కృతిక జీవన శైలి నుండి పుట్టాయి.
గేయాలుగా, కథలు, పొడుపు కథలు, కళారూపాలుగా, సామెతలు జానపద వాఙ్మయము ఒకరి నోటి నుండి మరొకరికి ఒక తరం నుండి మరొక తరానికి విస్తరించబడుతూ వస్తున్నదని ఆటా అధ్యక్షురాలు శ్రీమతి మధు బొమ్మినేని (Madhu Bommineni) గారు తెలియజేసారు.