ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ నూతన అధ్యక్షులుగా ఎన్నికైన తర్వాత నిరంజన్ శృంగవరపు మొదటిసారిగా సేవా కార్యక్రమాల్లో పాల్గొనటానికి విజయవాడ (Vijayawada) విచ్చేసిన సందర్భంగా ఈరోజు ఉదయం విజయవాడ మొగల్ రాజపురంలోని మినర్వా హోటల్ లో సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ళ వెంకట గోపాలకృష్ణారావు నేతృత్వంలో ఒక ప్రతినిధి బృందం మర్యాదపూర్వకంగా నిరంజన్ శృంగవరపు ని కలిసి దృశ్యాలువాతో సత్కరించి పుష్ప గుచ్చం అందజేశారు.
ఈ సందర్భంగా నిరంజన్ శృంగవరపు మాట్లాడుతూ.. తానా (TANA) అమెరికా దేశంలోనే కాకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దాతల సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరాలు, క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాలు, కంటి వైద్య శిబిరాలు, రైతుల కు రక్షణ కిట్లు, పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు, మహిళలకు కుట్టు మిషన్ ల పంపిణీ, ఆడపిల్లలకు సైకిళ్ళ పంపిణీ, సాంస్కృతిక కార్యక్రమాలు, కళారాదన పేరుతో సీనియర్ నటీ నటులకు సన్మాన తదితర కార్యక్రమాలు నిర్వహిస్తుందని, రాబోయే రెండు సంవత్సరాల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని తెలియజేశారు.
సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ళ వెంకట గోపాలకృష్ణారావు మాట్లాడుతూ.. తానా (Telugu Association of North America) సభ్యులు తమ పుట్టిన గ్రామాలకు ఇప్పటికే పాఠశాలల అభివృద్ధికి, మినరల్ వాటర్ ప్లాంట్ల నిర్మాణం, గ్రామాల మౌలిక వసతులు అభివృద్ధికి కృషి చేయడం అభినందనీయమని, ఉమ్మడి కృష్ణా జిల్లాలో నిరంజన్ శృంగవరపు (Niranjan Srungavarapu) ఆధ్వర్యంలో రాబోయే రెండు సంవత్సరాల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) అధికార ప్రతినిధి గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్, ఎన్టీఆర్ (NTR) జిల్లా తెలుగుదేశం పార్టీ లీగల్ అధ్యక్షులు మోటేపల్లి సత్యనారాయణ, భారత స్వాభిమాన్ ట్రస్టు రాష్ట్ర ఉపాధ్యక్షులు డి. దుర్గారావు, పారిశ్రామికవేత్త పర్వతనేని ప్రేమ్ కుమార్, న్యాయవాది కొంగర సాయి, కె.ఎల్.సి.ఈ పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు సూరపనేని జనార్ధన్, యువత నాయకులు వెనిగళ్ళ జ్ఞాన శేఖర్ తదితరులు పాల్గొన్నారు.