అక్టోబర్ 24, 2021 న న్యూ ఢిల్లీలో భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా సంస్థ ప్రచురించిన 100వ తెలుగు గ్రంధాన్ని లాంఛనప్రాయంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 27 ఏళ్ళుగా తెలుగు భాష, సాహిత్యాలకి సేవలు అందిస్తూ వంగూరి ఫౌండేషన్ చేస్తున్న కృషి ముదావహమని, 100 పుస్తకాలను ప్రచురించడం గొప్ప ప్రయత్నమని తెలిపారు. దిగ్విజయంగా ఈ సదస్సు నిర్వహించిన వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, శ్రీ సాంస్కృతిక కళా సారధి (సింగపూర్), తెలుగు మల్లి (ఆస్ట్రేలియా), ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్ తెలుగు సమాఖ్య (ఇంగ్లండ్), దక్షిణ ఆఫ్రికా తెలుగు సాహిత్య వేదిక (జొహానెస్ బర్గ్) సంస్థలని అభినందించారు.
గత 27 ఏళ్లుగావంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా సాధించిన ప్రగతిని, సాహిత్య ప్రస్థానాన్ని పదిలపరిచిన వీడియో ప్రసారాన్ని ఉపరాష్ట్ఱపతి ఎంతో ఆసక్తితో వీక్షించి ప్రశంసించారు. ఈ అవిష్కరణ మహోత్సవానికి రాధిక మంగిపూడి వ్యాఖ్యాతగా నిర్వహించారు. 7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు ప్రధాన నిర్వాహకులు రత్నకుమార్ కవుటూరు (సింగపూర్), రావు కొంచాడ (మెల్ బర్న్), వంశీ రామరాజు (హైదరాబాద్), జొన్నలగెడ్డ మూర్తి (ఇంగ్లండ్), శాయి రాచకొండ లతో సహా ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలకు చెందిన ప్రవాసాంధ్రులు, తెలుగు భాషాభిమానులు, తెలుగు సాహితీవేత్తలు తదితరులు పాల్గొన్న ఈ కార్యక్రమానికి దక్షిణ ఆఫ్రికాకు చెందిన ప్రధాన నిర్వాహకులు రాపోలు సీతారామరాజు వందన సమర్పణ గావించారు.