Connect with us

Education

యూనివర్సిటీ ఆఫ్ సిలికానాంధ్ర గ్రంధాలయ ప్రారంభోత్సవం, పద్మభూషణ్ డా. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ వేల పుస్తకాల వితరణ

Published

on

ఉత్తర కాలిఫోర్నియా లోని మిల్పిటాస్ నగరంలో మార్చి 25, శనివారం సాయంత్రం యూనివర్సిటీ ఆఫ్ సిలికానాంధ్ర వారి డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి భవనంలో గ్రంథాలయ ప్రారంభోత్సవం జరిగింది. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, ద్విభాషా పండితుడు, పూర్వ రాజ్యసభ సభ్యులు, పద్మశ్రీ, పద్మభూషణ్ బిరుదాంకితుడు డా. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ (YLP) తన జీవితంలో సమకూర్చుకున్న వేల పుస్తకాలను యూనివర్సిటీకి వితరణగా సమర్పించారు.

యూనివర్సిటీ ఆఫ్ సిలికానాంధ్ర వారి పేరుతో ప్రారంభిస్తున్న గ్రంధాలయాన్ని భారత కాన్సులేట్ జనరల్ ఆవిష్కరించారు. తొలుత సిలికానాంధ్ర కార్యవర్గం డా. లక్ష్మీ ప్రసాద్, సౌజన్య దంపతులను వారి విడిది నించి గుఱ్ఱపు బగ్గీలో విశ్వవిద్యాలయానికి వేడుకగా తీసుకురాగా, అక్కడనించి వేదాశీర్వచనాలతో, పూల వర్షం కురిపిస్తూ ఊరేగింపుగా భవనంలోకి తీసుకువచ్చారు.

సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం అధిపతి డా. కూచిభొట్ల ఆనంద్, చీఫ్ అకడమిక్ ఆఫీసర్ చమర్తి రాజు, SFO భారత కాన్సులేట్ కాన్సుల్ జనరల్ డా.టీ.వీ.నాగేంద్ర ప్రసాద్, మిల్పిటాస్ నగర వైస్ మేయర్ ఎవిలిన్ చూ వారిని సాదరంగా భవనంలోకి ఆహ్వానించారు. ముందుగా వైస్ మేయర్ ఎవెలిన్ గ్రంథాలయాన్ని లాంఛనంగా రిబ్బన్ కత్తిరించి ఆరంభించారు.

ఆ తరువాత కాన్సుల్ జనరల్ డా.టీ.వీ.నాగేంద్ర ప్రసాద్ మీటనొక్కి తెరను తీసి డా. యార్లగడ లక్ష్మీ ప్రసాద్ గ్రంథాలయం అన్న పేరును బహిర్గతం చేశారు. ఇదే సందర్భంలో భారత రాజ్యాంగ ప్రతిని డా. యార్లగడ తమ చేతుల మీదుగా యూనివర్సిటీ అకడమిక్ ఆఫీసర్ రాజు చమర్తికి అందించారు.

కాన్సుల్ జనరల్ ప్రవాసాంధ్రులకు ఉగాది శుభాకాంక్షలను తెలియజేస్తూ, ఒక్క తెలుగులోనే కాక హిందీలో కూడా PhD పట్టా పొందిన డా.యార్లగడ్డ సాహిత్య చరిత్రను, వారి దానశీలతను కొనియాడారు. ఆ తరువాత సిలికానాంధ్ర ప్రస్తుత, మరియు పూర్వ అధ్యక్షులు, ప్రస్తుత కార్యవర్గ సభ్యులందరూ, డా. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ దంపతులను వేదిక మీదకు తీసుకువచ్చి, ఘన సన్మానం చేసి, “సిలికానాంధ్ర గ్రంథ పయోనిధి” అన్న బిరుదును, సన్మాన పత్రాన్ని అందించారు.

డా. యార్లగడ్డ తమ జీవిత కాలంలో సేకరించిన 14,000 వేల పుస్తకాలన్నిటినీ యూనివర్సిటీ లైబ్రరీకి బహూకరించడమే కాక, వారి ఇద్దరు పిల్లలు యూనివర్సిటీకి చెరో $20,000 విరాళాన్ని కూడా ప్రకటించారు. సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షుడు డా.ఆనంద్ కూచిభొట్ల యార్లగడ్డ గారితో తన అనుబంధాన్ని పంచుకుంటూ, ఇటు సాహిత్యం, అటు రాజీకీయం రెంటినీ తమ ఒరలో అలవోకగా అమర్చుకున్న అరుదైన వ్యక్తిగా వారిని అభివర్ణించారు.

డా. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ అందరకీ ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ ఈ పుస్తకాలన్నిటినీ ఏమి చెయ్యాలో పాలుపోక గత కొద్దికాలంగా మదనపడుతున్నానని, చివరకు సిలికానాంధ్ర యూనివర్సిటీ వాటికి సరైన చోటని నిర్ణయించుకున్నానని, యూనివర్సిటీ యంత్రాంగం ఆమోదించడం తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్తూ తమ నిరాడంబరతని చాటుకున్నారు.

భారత సంప్రదాయంలో కవికి తాను రాసిన పుస్తకం కూతురుతో సమానమని, తండ్రిగా తను తగిన ఇంటికే వాటికి పంపుతున్నానన్న నమ్మకంతోనే యూనివర్సిటీ కి ఇస్తున్నానని పేర్కొన్నారు. మిల్పిటాస్ నగర మేయర్, వైస్ మేయర్, మరియు ఇతర నగరపాలక సంస్థ సభ్యులు నగరం తరపున యూనివర్సిటీకి ఒక కమెండేషన్ ను సమర్పించారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected