Frankfurt, Germany: తెలుగు వెలుగు జర్మనీ (Telugu Velugu Germany) సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు (Ugadi Celebrations) ఏప్రిల్ 8న ఫ్రాంక్‌ఫర్ట్ నగరంలో ఘనంగా జరిగాయి. ఫ్రాంక్‌ఫర్ట్ (Frankfurt), పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తెలుగు కుటుంబాలవారు పాల్గొన్నారు. సంగీతం, నృత్యం, సంప్రదాయ ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు.
ముందుగా సంఘం వ్యవస్థాపకులు సాయి రెడ్డి గారికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సంఘం జనరల్ సెక్రటరీ సూర్యప్రకాష్ వెలగా (Surya Prakash Velaga) మాట్లాడుతూ.. తెలుగు కమ్యూనిటీ ఇటీవల వేగంగా ఎదుగుతోందని, కొత్తగా చేరిన కుటుంబాలను మన తెలుగు వెలుగు కుటుంబంగా హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు.
తెలుగు భాష, సంస్కృతి, ఐక్యతకు ఈ వేడుక ప్రతీకగా నిలిచిందన్నారు. సాయిరెడ్డి గారి ఆశయ సాధనకు కృషిచేస్తామని తెలిపారు. ఈ వేడుకకు ఫ్రాంక్‌ఫర్ట్ బర్గర్ మాస్టర్ శ్రీమతి నసరిన్ ఎస్కందారి-గ్ర్యూన్‌బర్గ్ (Nargess Eskandari-Grünberg) ముఖ్య అతిథిగా హాజరై జర్మనీ (Germany) లో తెలుగు సమాజానికి ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ ఉగాది పండుగ సంబరాల్లో చిన్నారులు, యువత, కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు (Cultural Programs) ప్రతి ఒక్కరినీ అలరించాయి. ఈ కార్యక్రమాన్ని ప్రీతం బొడా విట్టల్ (Pritam Boda Vittal), ఆదర్శ్ వంగల (Adarsh Vangala) సమన్వయపరిచారు.