Connect with us

Literary

సినీగీతాల ధ్రువతారలకు అక్షరాంజలి పేరిట విశ్లేషణ విజయవంతం @ TANA ప్రపంచ సాహిత్య వేదిక

Published

on

Dallas, Texas: తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో – ప్రతి నెలా ఆఖరి ఆదివారం నిర్వహిస్తున్న “నెల నెలా తెలుగు వెలుగు” సాహిత్య కార్యక్రమం – 70వ అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశం గత శనివారం, ఆదివారం రెండు రోజుల ప్రత్యేక కార్యక్రమంగా ఘనంగా జరిగింది. “సినీగీతాల ధ్రువతారలకు అక్షరాంజలి” అనే పేరున నిర్వహించిన ఈ తానా (TANA) కార్యక్రమంలో లబ్ధప్రతిష్టులైన పాతికమందికి పైగా సినీగీత రచయితలు సృష్టించిన సాహిత్యంపై చాలామంది ప్రముఖులు హాజరై విశ్లేషణ చేశారు.

తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ.. “ప్రపంచంలోనే మొట్టమొదటి ఆంగ్లశబ్ద చిత్రం “ద జాజ్ సింగర్” అని, మొదటి భారతీయ హిందీ శబ్దచిత్రం “ఆలం ఆరా” అని, మొట్టమొదటి తెలుగు శబ్దచిత్రం “భక్త ప్రహ్లాద” అని పేర్కొంటూ ఆయా చిత్రాల విశేషాలు, వాటిలోని పాటల వివరాలను పంచుకున్నారు.

డా. తోటకూర (Dr. Prasad Thotakura) ముఖ్యఅతిథిగా పాల్గొన్న వి.ఏ.కె రంగారావు గార్ని సభకు పరిచయం చేస్తూ.. వివిధ తెలుగు, ఆంగ్ల పత్రికలలో సినిమాలపై ఎన్నో వ్యాసాలు రాసిన రచయిత, ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో 52 వేలకు పైగా ‘78 ఆర్ పి మ్’ రికార్డ్లు సేకరించిన వారు, ప్రపంచంలోని వివిధ భాషల్లో లక్షా పాతిక వేల వరకు ట్రాక్స్ కల్గిఉన్న వ్యక్తి, సినీ సంగీత, సాహిత్యాలపై విశేషమైన ప్రతిభ, లోతైన అవగాహన కల్గిన విశ్లేషకుడు, రచయిత, కాలమిస్ట్, నాట్యకారుడు, రికార్డ్ కలక్టర్, జంతు ప్రేమికుడు, ఒక విజ్ఞాన భాండాగారం వి.ఏ.కె అంటూ అభివర్ణించారు.

ముఖ్యఅతిథిగా ప్రముఖ రచయిత, సుప్రసిద్ధ సినీ సంగీత, సాహిత్య విశ్లేషకులు శ్రీ వేంకట ఆనంద కుమార కృష్ణ (వి.ఏ.కె) రంగారావు, చెన్నై నుండి హాజరై సినిమా పాటలు ముఖ్యంగా పాత పాటలు ఇప్పటికీ సజీవంగా ఉంటూ మనం ఎప్పుడు విన్నా మన మనసుకు ఆహ్లాదం కల్గిస్తున్నాయి అంటే అది కేవలం అంత గొప్ప సాహిత్యం (Literature) సృష్టించిన గీతరచయితల గొప్పదనమే అన్నారు. తన మనసుకు బాగా నచ్చిన చిత్రాలు, పాటలపై సోదాహరణ ప్రసంగం చేసి అందరిని ఆకట్టుకున్నారు.

జులై 27, శనివారం విశిష్టఅతిథులుగా పాల్గొన్న  – రోచిష్మాన్ (చెన్నై) – “తెలుగు సినిమా పాట విశేషం”పై ప్రసంగించగా;  డా. శ్రీదేవి శ్రీకాంత్ (బోట్స్వానా, ఆఫ్రికా) – తొలి సినీగీత రచయిత చందాల కేశవదాసు; ఆవాల శారద (విజయవాడ) – పద్మభూషణ్ దేవులపల్లి కృష్ణశాస్త్రి; జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు (హైదరాబాద్) – దైతా గోపాలం; డా. వి. వి. రామారావు (హైదరాబాద్) – పింగళి నాగేంద్రరావు; పి.వి శేషారత్నం (విశాఖపట్నం) – వెంపటి సదాశివ బ్రహ్మం; డా. వోలేటి పార్వతీశం (హైదరాబాద్) – మల్లాది రామకృష్ణశాస్త్రి;  మద్దుకూరి విజయ చంద్రహాస్ (డాలస్) – కొసరాజు రాఘవయ్య చౌదరి;  లెనిన్ బాబు వేముల (డాలస్) – శ్రీరంగం శ్రీనివాసరావు (శ్రీ శ్రీ);  డా. ఇండ్ల రామసుబ్బారెడ్డి (విజయవాడ) – ఆచార్య ఆత్రేయ; డా. రెంటాల జయదేవ (హైదరాబాద్) – సముద్రాల (జూనియర్) రామానుజాచార్య; చెన్నూరి సీతారాంబాబు (హైదరాబాద్) – మైలవరపు గోపీకృష్ణ లు సృష్టించిన సాహిత్యంపై విశ్లేషణాత్మక ప్రసంగాలు చేశారు.

ఆదివారం, జులై 28 విశిష్టఅతిథులుగా పాల్గొన్న ఎస్. వి రామారావు (హైదరాబాద్) – సముద్రాల (సీనియర్) వేంకట రాఘవాచార్యులు; మహాకవి దాశరథి గారి తనయుడు దాశరథి లక్ష్మణ్ (హైదరాబాద్) – దాశరథి కృష్ణమాచార్య; శారద ఆకునూరి (హ్యుస్టన్) – ఆరుద్ర; గజగౌరి (చెన్నై) – వీటూరి; రాజశ్రీగారి తనయుడు, రాజశ్రీ సుధాకర్ (చెన్నై) – రాజశ్రీ; ఎస్.పి వసంత (చెన్నై) – అనిసెట్టి సుబ్బారావు; తుర్లపాటి నాగభూషణ రావు (హైదరాబాద్) –  ఆచార్య డా. సింగిరెడ్డి నారాయణరెడ్డి; జాలాదిగారి కుమార్తె, డా. జాలాది విజయ (విశాఖపట్నం) – డా. జాలాది రాజారావు; వేటూరి గారి తనయులు, వేటూరి రవిప్రకాష్ (హైదరాబాద్) – వేటూరి సుందర రామమూర్తి; కలగా కృష్ణమోహన్ (హైదరాబాద్) – ఇంద్రగంటి శ్రీకాంత శర్మ; వేదవ్యాస రంగభట్టర్ గారి సహోదరులు జె.కె భారవి (హైదరాబాద్) – వేదవ్యాస రంగభట్టర్; సిరివెన్నెల గారి సోదరులు చేంబోలు వెంకట్రామశాస్త్రి (విశాఖపట్నం) – పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి; వెన్నెలకంటి గారి తనయుడు, శశాంక్ వెన్నెలకంటి (హైదరాబాద్) – వెన్నెలకంటి గార్ల సినీ సాహిత్యంపై ఎంతో లోతైన, ఆసక్తిదాయకమైన చేసిన విశ్లేషణ అందరినీ అలరించింది.

తానా (Telugu Association of North America) ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ (Chigurumalla Srinivas) సభలో పాల్గొన్న అందరికీ, విజయవంతంగావడానికి సహకరించిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సినీ సాహితీ చరిత్రలో ఈ సాహిత్యసభ ఒక చరిత్ర అన్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected