అక్టోబర్ 13న అమెరికాలోని నాష్విల్ నగరంలో టెన్నెస్సీ తెలుగు సమితి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. సుమారు 700 మందికి పైగా పాల్గొన్న ఈ సంబరాలకు శ్రీ దీప్తి రెడ్డి దొడ్ల గారు నాయకత్వం వహించారు. ప్రపంచంలో ఎక్కడైనా సరే దేవుడిని పూలతో పూజిస్తారు కానీ ఆ పూలనే భగవంతుని రూపంలో అమ్మవారి ప్రతిరూపంగా బతుకమ్మని ఆరాధించడం ఈ బతుకమ్మ పండుగ గొప్ప విశేషం.
ముందుగా కొబ్బరికాయ కొట్టి అమ్మవారి పూజతో సంబరాలను ఘనంగా ప్రారంభించారు. మన గుళ్ళల్లో మాదిరిగా తులసి అమ్మవారి విగ్రహంతోపాటు బతుకమ్మ ముగ్గు వేసి మరీ చేసిన అలంకరణ మస్తుగున్నదనుకోండి. కొత్తబట్టలు మరియు ఆభరణాలతో విచ్చేసిన ఆడపడుచులు, పిల్లలు, పెద్దలు వేదిక ప్రాంగణానికి వన్నె తెచ్చారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ ఆటపాటలతో తమ కష్ట సుఖాలు, ప్రేమ, స్నేహం, బంధుత్వం, ఆప్యాయతలు, భక్తి, భయం, చరిత్ర, పురాణాలు మేళవిస్తూ ఎంగిలి పూల బతుకమ్మ, అటుకుల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నానే బియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ, అలిగిన బతుకమ్మ, వేపకాయల బతుకమ్మ, వెన్నముద్దల బతుకమ్మ మరియు సద్దుల బతుకమ్మ లను భక్తిశ్రద్దలతో కొలిచారు. అలాగే స్థానిక కళా నివేదనం, కోలాటం మరియు ధీంతానా గ్రూప్స్ వారు చేసిన నృత్యాలు అందరిని ఆకట్టుకున్నాయి. స్థానిక వ్యాపారాలు ఏర్పాటు చేసిన వెండర్ స్టాల్స్ లో అందరు కలియ తిరుగుతూ షాపింగ్ చేసారు. సభాప్రాంగణ సమర్పకులకు మరియు ఫుడ్ వాలంటీర్లకు సర్ప్రైజ్ రాఫుల్ బహుమతులు అందజేశారు. బతుకమ్మ పోటీలలో రెండు కేటగిరీస్ లోను రంగు రంగుల పూలతో ఎంతో అందంగా, క్రియేటివ్గా చూడ చక్కగా అలంకరించడంతో విజేతలను నిర్ణయించడానికి న్యాయనిర్ణేతలు ఎంతో కష్టపడ్డారనడంలో అతిశయోక్తి లేదు. విజేతలకు చీరలు బహుకరించారు. బతుకమ్మను తెచ్చినవారందరికి గుడీ బాగ్స్ అందజేశారు. అలాగే స్టెమ్ బిల్డర్స్ వారు సమర్పించిన రాఫుల్ బహుమతులు కూడా అందజేశారు. మహిళలకు ఆహ్వానంలో భాగంగా మల్లె పూలు, జాజి పూలు అలాగే తిరిగి ఇంటికి వెళ్లే సమయంలో తాంబూలం అందించడం విశేషం.
చివరిగా టెన్నెస్సీ తెలుగు సమితి బతుకమ్మ సంబరాలకు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నాష్విల్ వాసులందరికి, రుచికరమైన తేనీయ విందునందించిన అమరావతి రెస్టారంట్ మరియు పారడైజ్ బిర్యానీ రెస్టారంట్ వారికీ, ఈ కార్యక్రమ రూపకల్పనలో సహాయం చేసిన టెన్నెస్సీ తెలుగు సమితి కార్యవర్గ సభ్యులకు, యూత్ కమిటీ సభ్యులకు మరియు శ్రేయోభిలాషులకు శ్రీ దీప్తి రెడ్డి దొడ్ల గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసారు.