మూడు రోజుల TTA మెగా కన్వెన్షన్ నిన్న మే 24 శుక్రవారం రోజున ఘనంగా మొదలైంది. మెగా స్థాయిలో ఏర్పాట్లు చేసిన కన్వెన్షన్ మొదటిరోజు బాంక్వెట్ డిన్నర్ విజయవంతంగా ముగిసింది. అమెరికా నలుమూలల నుండి TTA నాయకులు, సభ్యులు, ప్రవాస తెలుగువారు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
మొట్టమొదటిసారి సియాటిల్ (Seattle, Washington) లో నిర్వహిస్తున్న తెలుగు కన్వెన్షన్ అవ్వడంతో అందరూ ఆతృతగా ఎదురు చూశారు. అందరి అంచనాలను దాటి ఇటు ఎయిర్పోర్ట్ పికప్స్ దగ్గిర నుండి, హోటల్ అకామడేషన్, రెజిస్ట్రేషన్, టికెట్స్ వరకు ఒక పద్దతి ప్రకారం నీటుగా చేశారు.
బాంక్వెట్ డిన్నర్ (Banquet Dinner) కార్యక్రమంలో ముందుగా TTA నాయకుల ఏవీలు ప్రదర్శించి, వేదిక మీదకు ఆహ్వానించారు. ఇండియా (India) నుంచి విచ్చేసిన అతిథులతో కలిసి జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని షురూ చేశారు. అనంతరం కన్వెన్షన్ సావనీర్ (Souvenir) ఆవిష్కరించారు.
ఇండియా నుంచి వచ్చిన వారిలో తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy, మాజీ మంత్రి మల్లారెడ్డి, శాసన మండలి సభ్యులు మదన్మోహనరావు, యాంకర్ సుమ (Suma Kanakala) తదిరతులు ఉన్నారు. సమాంతరంగా పలు స్టేషన్స్ పెట్టి వెయిటింగ్ లేకుండా భోజనాల ఏర్పాట్లు చేశారు.
వ్యాపార, ఆరోగ్య, క్రీడలు, సామాజికసేవ, టెక్నాలజీ వంటి వివిధ రంగాలలో TTA Awards అందజేశారు. మధ్యమధ్యలో ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు (Cultural Programs), మెడ్లి డాన్సులు చూడచక్కగా ఉన్నాయి. తర్వాత కన్వెన్షన్ కమిటీ సభ్యుల ఏవీ ప్రదర్శించి ఘనంగా సత్కరించారు.
ఆపై TTA మెగా కన్వెన్షన్ కి 10 వేల డాలర్లు డొనేట్ చేసిన డోనార్స్ ని, ఇతర జాతీయ తెలుగు సంఘాల నేతలను (Telugu Associations Leaders) శాలువా, పుష్పగుచ్ఛాలతో సన్మానించారు. ఈ మొత్తం బాంక్వెట్ డిన్నర్ కి మూల స్తంభాలైన బాంక్వెట్ కమిటీని వేదిక మీదకు ఆహ్వానించి అభినందించారు.
టాలీవుడ్ సెలెబ్రిటీస్ (Tollywood Celebrities) తో యూత్ కోసం ప్రత్యేకంగా నిర్వహించిన క్రూజ్ పార్టీకి చక్కని స్పందన వచ్చింది. వివిధ ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలతోపాటు డిన్నర్, డ్రింక్స్, డీజే, మోడల్స్, హెయిర్ & మేకప్ ఆర్టిస్ట్స్, ఫన్ యాక్టివిటీస్ తో కుర్రకారు ఉర్రూతలూగారు. టాలీవుడ్ హీరోయిన్ మెహ్రీన్ (Mehreen Pirzada), యాంకర్ రవి, బిగ్ బాస్ విజేత కౌశల్ (Kaushal Manda) యూత్ ని అలరించారు.
వందేమాతరం శ్రీనివాస్ (Kanneboina Srinivasa Rao Yadav) సారధ్యంలో గాయనీగాయకులు మాధురి, జనార్దన్, శ్రీస్టీ, సుస్వర, అష్ట గంగాధర్ లతో తెలంగాణ జోరు – పాటల హోరు అంటూ పాటలు పాడి అందరినీ మెప్పించారు. భక్తి పాటతో ప్రారంభించి, మాంచి స్పీడ్ ఉన్న పాటలు కూడా మిక్స్ చేసి అలరించారు.
Telangana American Telugu Association (TTA) లాంటి చక్కని ప్లాట్ ఫామ్ ని ఏర్పాటుచేసిన వ్యవస్థాపకులు డా. పైళ్ల మల్లారెడ్డి (Dr. Pailla Malla Reddy), అడ్వైజరీ కౌన్సిల్ ఛైర్ డా. విజయపాల్ రెడ్డి, కోఛైర్ డా. మోహన్ రెడ్డి పటలోళ్ళ, సభ్యులు భరత్ రెడ్డి మాదాడి దిశానిర్దేశం చేసినట్లున్నారు.
TTA (Telangana American Telugu Association) అధ్యక్షులు వంశీ రెడ్డి కంచరకుంట్ల (Vamshi Reddy Kancharakuntla), ప్రెసిడెంట్ ఎలెక్ట్ నవీన్ రెడ్డి మల్లిపెద్ది, కన్వీనర్ చంద్రసేన శ్రీరామోజు మరియు అన్ని కమిటీల సమన్వయంతో ఆధ్వరంలో కన్వెన్షన్ (TTA Mega Convention) మొదటిరోజుని విజయవంతంగా ముగించారు.
కార్యక్రమం ఆసాంతం ప్రముఖ టీవీ యాంకర్ సుమ కనకాల తనదైన శైలి వ్యాఖ్యానంతో నవ్వులు పూయించారు. TTA కార్యదర్శి కవితారెడ్డి వందన సమర్పణలో భాగంగా డోనార్స్ కి, స్పాన్సర్స్ కి, అతిథులకి, ఆహ్వానితులకి, వాలంటీర్స్ కి ఇలా ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశారు.