తెలంగాణ క్రీడాకారిణి త్రిష గొంగడి (Trisha Gongadi) 2023 ICC అండర్ 19 ప్రపంచ మహిళా టీ20 క్రికెట్ కప్ గెలిచిన భారత జట్టులో ఆడిన సంగతి అందరికీ తెలిసిందే. చిన్న వయస్సులో 17 ఏళ్లకే ఈ ప్రపంచ కప్ (World Cup) లో ఆడేందుకు ఎంపికవడమే కాకుండా జట్టుని విజయతీరాలకు చేర్చడంలో ముందుండడం విశేషం.
పేద కుటుంబానికి చెందిన త్రిష క్రికెట్ ట్రైనింగ్, ఫిట్నెస్ తదితర అవసరాల కోసం కుటుంబం హైదరాబాద్ కి మూవ్ అయ్యారు. కానీ క్రికెట్ (Cricket) కోచింగ్, ఆట పరికరాలు, ఆరోగ్యం తదితర అవసరాలకు ఖర్చులు విపరీతంగా పెరగడంతో ఇబ్బందులు ఎదుర్కొంటుంది త్రిష.
చిన్నతనం నుంచే క్రికెట్ పై మక్కువ పెంచుకున్న త్రిష ఎన్నో క్రికెట్ టౌర్నమెంట్స్ ఆడడమే కాకుండా మరెన్నో అవార్డ్స్ (Awards) కూడా గెలుచుకుంది. అలాగే ప్రాంతీయ క్రికెట్లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది. కాబట్టి క్రికెట్ పై ఇష్టాన్ని చంపుకోలేక ఆర్ధిక సహాయం కోసం తానా (TANA) క్రీడాకార్యదర్శి శశాంక్ యార్లగడ్డ ని సంప్రదించారు.
స్వతహాగా శశాంక్ (Shashank Yarlagadda) కూడా స్పోర్ట్స్ పర్సన్ అవ్వడంతో విషయం అర్ధం చేసుకున్న శశాంక్ త్రిష కి సహాయం చేయడానికి నడుం కట్టారు. అనుకున్నదే తడవుగా ఉత్తర అమెరికా తెలుగు సంఘం (Telugu Association of North America) తానా తరపున ఫండ్రైజర్ మొదలు పెట్టి నిధుల సమీకరణకు ముందుకు వచ్చారు.
తెలంగాణ రాష్ట్రం, భద్రాచలానికి చెందిన త్రిష గొంగడి (Trisha Gongadi) క్రికెట్ లో ముందు ముందు మరింత ఎత్తుకు ఎదిగేలా ప్రవాస తెలుగువారందరూ ముందుకు వచ్చి ఆర్ధికంగా తోడ్పడాలని కోరుతున్నారు తానా క్రీడాకార్యదర్శి శశాంక్ యార్లగడ్డ. శశాంక్ తోపాటు అందరూ తలా ఒక చేయి వేసి సహాయం చేయండి.