Washington DC, USA: అంతర్జాతీయ వేదికపై తెలుగింటి మహిళకు అరుదైన సత్కారం.. అమెరికా రాజధాని వేదికగా అమెరికన్ మల్టీ ఎత్నిక్ కమీషన్.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తించిన పలు విభాగాలకు చెందిన 20 మంది అత్యంత ప్రతిభావంతులైన మహిళలలో ఒకరు తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) జాతీయ అధికార ప్రతినిధి, ప్రొఫెసర్ డాక్టర్ జ్యోత్స్న తిరునగరి.
మార్చి 12 వ తారీఖున పలు దేశాల ప్రతినిధులు పాల్గొన్న సభలో సత్కరించి ఈ పురస్కారం అందించారు. ఇది ఉభయ తెలుగు రాష్ట్రాల మహిళామణులకు గర్వకారణం అని సాయంత్రం ఈ సందర్భంగా ప్రవాస తెలుగు మహిళలు రాజధాని (Washington DC) ప్రాంతంలో ఏర్పాటు చేసిన సన్మాన సభలో జ్యోత్స్న (Dr. Jyothsna Tirunagari)ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.
డాక్టర్ జ్యోత్స్న తిరునగరి మాట్లాడుతూ… మాతృదేవోభవ అన్న భారతీయ సంస్కృతి ప్రపంచానికే ఆదర్శనీయమని, సామాన్య మధ్య తరగతి కుటుంబం నుండి మొదలైన తన జీవితం పలు రంగాలలో మహిళా స్వీయ సాధికారత (Women Empowerment) కోసం నిరంతరంగా పనిచేస్తూ ఈనాడు తెలుగు మహిళల సమున్నత వేదిక అయిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా విధులు నిర్వహిస్తున్నామన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా మహిళలు ఈనాడు అన్ని రంగాలలో ముందున్నారని, కుటుంబ భాద్యతలను మోస్తూ సామాజిక బాధ్యతతో, సంఘ పరంగా అద్భుత ప్రగతి సాధిస్తున్నారన్నారు. ఇంటిని, సమాజాన్ని తీర్చిదిద్దటంలో మహిళల పాత్ర అద్వితీయమన్నారు. ప్రవాసులు ఎల్లప్పుడూ కష్టపడుతూ, జన్మభూమి ప్రగతికి కట్టుబడి ఉన్నారన్నారు డాక్టర్ జ్యోత్స్నా తిరునగరి (Dr. Jyothsna Tirunagari).
మహిళలు అవకాశాలను అందిపుచ్చుకొని ఎదగాలని, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) సైతం మహిళలకు పార్టీలో పెద్ద పీట వేస్తున్నారని, దేశం కానీ దేశంలో తమ ఇంటి ఆడపడుచుగా భావించి సత్కరించిన తెలుగు మహిళలందరికీ ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని భాను మాగులూరి (Bhanu Maguluri) మరియు కిషోర్ కంచర్ల (Kishore Kancharla) సమన్వయపరిచారు.