Connect with us

Devotional

చాగంటి కోటేశ్వర రావు ప్రసంగం @ కళాతపస్వి, దర్శకులు K. Viswanath దంపతుల సంస్మరణ సభ – Hyderabad

Published

on

Hyderabad, Telangana: ది. 22.08.2025, శుకృవారం, సాయంత్రం ఆరు గంటలకు, శ్రీనగర్ కాలనీ, శ్రీ సత్యసాయి నిగమాగమమ్ ఆడిటోరియంలో, కళాతపస్వి కాశీనాధుని విశ్వనాధ్ గారు జయలక్ష్మి గారల సంస్మరణ సభ, వారి కుమారులు, కుమార్తె, మరియు కుటుంబసభ్యులచే నిర్వహించబడినది.

బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు (Chaganti Koteswara Rao) సంగీతము-విశ్వనాధ్ గారు అనే అంశంపైన ప్రధాన ప్రసంగం చేశారు. దాదాపు గంటకు పైగా సాగిన చాగంటివారి ప్రసంగము శ్రోతలను తన్మయులను గావించినది. విశాలమైన శ్రీ సత్యసాయి ఆడిటోరియం విశ్వనాధ్ గారి అభిమానులతో నిండిపోయింది.

మానవ జీవితములను మాత్రమే గాక పశుపక్ష్యాదులను సైతం సంగీతము ఎలా ప్రభావితం చేయగలదో సోదాహరణంగా వివరిస్తూ, విశ్వనాధ్ (K Viswanath) ఎంతగా సంగీత నృత్య కళల ప్రభావం ఆస్వాదించి, అనుభవించి సినిమా మాధ్యమంద్వారా పండిత పామరులను మెప్పించినారో సోదాహరణంగా వివరించారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు.

అనేకమంది ప్రముఖులు ఈ సభకు హాజరై విశ్వనాధ్ (K. Viswanath) గారిపట్ల తమ గౌరవమును పాటించారు. శ్రీ యల్ వి సుబ్రహ్మణ్యమ్, శ్రీ జె డి లక్ష్మీనారాయణ (JD Lakshminarayana), శ్రీ తనికెళ్ళ భరణి (Tanikella Bharani), శ్రీ పార్ధసారధి మొదలగు వారు సభను అలంకరించారు.

చాగంటి కోటేశ్వర రావు త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రి గారల గురించి తెలుపుతూ, తెలుగు నేలలపై శాస్త్రీయ సంగీతమును అధ్యయనము చేసి తరించిన రామయ్యవారు, వేంకట రమణయ్య వారు, మంగళంపల్లివారు, హరి నాగభూషణం, పారుపల్లి వారు, ఇలా అనేకమంది సంగీతజ్ఞులను ఉంటంకిస్తూ, తెలుగు నేలలపై మాత్రమే కాక, తమిళ, కన్నడ నాడులయందునూ వారి పేరు ప్రఖ్యాతులను గురించి విశదీకరించారు.

అలాగే శాస్త్రీయసంగీతముతో విశ్వనాధ్ ఎన్నెన్ని భావాలను పలికించి రసజ్ఞులను అలరించారో, వారి సినిమాలలోని కొన్ని పాటలను తెరపై చూపిస్తూ దర్శకుని అంతరంగాన్ని విపులీకరించినప్పుడు, ఆహా, విశ్వనాధ్ సంగీతంలో ఇంత పరిశోధన చేశారా, వేటూరి వంటి సినీగేయ రచయితల ప్రతిభను ఇంత గొప్పగా చిత్రీకరిచినారా అని ఆశ్చర్యం కలిగినది.

ఎన్నో సార్లు విన్న పాటలే. కానీ చాగంటివారి పరిశీలనలు అద్భుతమైన క్రొత్త కోణాలను ఆ పాటలలో ఆవిష్కరించినాయి. ఈ సభకు హాజరైన అభిమానులు ఎంతో ఉద్వేగానికి లోనయ్యారు. వారి హృదయాలు విశ్వనాధ్ గురించిన చాగంటి (Chaganti Koteswara Rao) వారి ప్రసంగములో తడిసి ముద్దలయినాయి.

కాశీనాధుని విశ్వనాధ్ (Kasinadhuni Viswanath) మన కాలములో ఉన్నందుకు, వారి ఉన్నత సంస్కారముల ప్రేరణతో తీయబడిన చలనచిత్రములు చూసే భాగ్యము కలిగినందుకు తెలుగువారు గర్వపడతారనడంలో అతిశయోక్తి లేదు.

error: NRI2NRI.COM copyright content is protected