కృష్ణకుమారి వర్ధంతి సందర్భంగా ప్రత్యేక వ్యాసం. సుమారు 150 సినిమాలలో నటించిన కృష్ణకుమారి పశ్చిమ బెంగాల్ లోని నౌహతిలో 1933 మార్చి 6న జన్మించింది. తండ్రి వెంకోజీరావుది ఆంధ్రప్రదేశ్ లోని రాజమహేంద్రవరం. మరో ప్రముఖ వెటరన్ నటి షావుకారు జానకి ఈమెకు పెద్దక్క. నాన్న ఉద్యోగరీత్యా ఈమె విద్యాభ్యాసం రాజమండ్రి, చెన్నై, అస్సాం, కలకత్తా మొదలైన ప్రదేశాలలో జరిగింది.
1951లో నిర్మించిన నవ్వితే నవరత్నాలు సినిమా ద్వారా తెలుగు సినిమా తెరకు పరిచయం అయ్యారు. కానీ దానికంటే ముందు మంత్రదండం అనే సినిమా విడుదలవడం, తొలి చిత్రంలో నటిస్తుండగానే ఆమెకు 14 సినిమాల్లో అవకాశాలు రావడం విశేషం. తర్వాత 1953లో తాతినేని ప్రకాశరావు పిచ్చి పుల్లయ్యలో కథానాయిక వేషం వేయించారు. అందులో మంచి నటన ప్రదర్శించిన కృష్ణకుమారికి పినిశెట్టిగారి పల్లె పడుచు, బంగారు పాప వంటి మంచి చిత్రాలతో పరిశ్రమలో మంచి గుర్తింపు వచ్చింది.
లక్షాధికారి సినిమా షూటింగులో మబ్బులో ఏముంది అనే పాటను సముద్రపు అలల మధ్యన చిత్రీకరిస్తుండగా, ఒక పెద్ద అల వచ్చి కృష్ణకుమారితోబాటు ఎన్టీఆర్‌ను కూడా లోపలకు ఈడ్చుకెళ్లిందట. నీళ్లు తాగేసిన ఆమె చేతిని ఎన్టీఆర్ గట్టిగా పట్టుకొని ఇవతలకు లాగేయడంతో పెను ప్రమాదం తప్పిందట.
కృష్ణకుమారి బెంగళూరుకు చెందిన రాజస్థానీ వ్యాపారవేత్త అజయ్ మోహన్‌ను పెండ్లాడింది. స్నేహితుల ద్వారా పరిచయమై అది 1969లో వివాహబంధంగా మారింది. తన 85వ ఏట క్యాన్సర్ మహమ్మారి బారినపడి 2018, జనవరి 24న బెంగుళూరులో మరణించడం విషాదం.