New York: న్యూయార్క్ లోని తెలుగు లిటరరీ & కల్చరల్ అసోసియేషన్ (Telugu Literary & Cultural Association – TLCA) 2025 కి గానూ నూతన కార్యవర్గం ఈ మధ్యనే ఎన్నికైన సంగతి తెలిసిందే. సుమంత్ రాంశెట్టి (Sumanth Ramsetti) అధ్యక్షతన మొట్టమొదటి ఈవెంట్ ‘భోగ భాగ్యాల సంక్రాంతి సంబరాలు & గణతంత్ర దినోత్సవ వేడుకలు’ ఈ నెల 25 శనివారం రోజున నిర్వహిస్తున్నారు.
ప్రముఖ కొరియోగ్రాఫర్ అనీ మాస్టర్ (Anee Master), గాయని హారిక నారాయణ్ (Harika Narayan), గాయకులు & యువ సంగీత దర్శకులు అనుదీప్ దేవ్ (Anudeep Dev) మరియు జబర్దస్త్ ఫేమ్ అవినాష్ (Jabardasth Avinash) ఆహ్వానితులను అలరించనున్నారు. న్యూయార్క్, ఫ్లషింగ్ (Flushing, New York) నగరంలోని స్థానిక హిందూ టెంపుల్ సొసైటీ ఆఫ్ నార్త్ అమెరికా ఈ కార్యక్రమానికి వేదిక.
తెలుగువారికి ఎంతో ముఖ్యమైన సంక్రాంతి (Sankranti Festival) పండుగని పురస్కరించుకొని జనవరి 25న నిర్వహించే ఈ వేడుకల్లో శనివారం మధ్యాహ్నం 3 గంటల నుండి సాంస్కృతిక కార్యక్రమాలు, తెలుగు సినీ పాటలు, నృత్యాలు, ర్యాఫుల్ బహుమతులు (Raffle Prizes), తెలుగు రుచులతో పసందైన విందు భోజనం హైలైట్స్ గా నిలవనున్నాయి.
ఇప్పటికే అనీ మాస్టర్ దగ్గిర డాన్స్ నేర్చుకొని ప్రదర్శన చేసేందుకు వయస్సుతో సంబంధం లేకుండా అందరూ రెడీ అవుతున్నారు. సింగర్ హారిక నారాయణ్ మ్యూజిక్ వర్క్ షాప్ నిర్వహిస్తున్నారు. గత వారాంతం ముగ్గుల పోటీలు (Rangoli), గాలిపటాల పోటీలు, వంటల పోటీలు బెత్పేజ్ (Bethpage, New York) పట్టణంలో కోలాహలంగా నిర్వహించారు.
ఈ పోటీలలో గెలిచిన వారికి తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం (Telugu Literary & Cultural Association – TLCA) వారు జనవరి 25న ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న భోగ భాగ్యాల సంక్రాంతి సంబరాలు మరియు గణతంత్ర దినోత్సవ (Republic Day) వేడుకలలో బహుమతులు అందించనున్నారు.
భారత గణతంత్ర దినోత్సవ (India Republic Day) థీమ్ తో చిన్నారుల ప్రత్యేక ప్రదర్శనలు దేశభక్తిని పెంపొందించేలా ప్రణాళిక రచిస్తున్నారు. ఎప్పటిలానే మద్దిపట్ల ఫౌండేషన్ (Maddipatla Foundation) వారు ర్యాఫుల్ బహుమతులు అందించనున్నారు.