Published
10 minutes agoon
By
NRI2NRI.COM
తెలుగువారు జరుపుకునే అతి పెద్ద పండుగల్లో సంక్రాంతి (Sankranti) ముఖ్యమైనది. ఈ పండుగ సమయంలో సంక్రాంతి సంబరాలు, భోగి మంటలు, పిండి వంటలు, ఇంటింటా ముగ్గులతో తెలుగు లోగిళ్లన్నీ కళకళలాడుతాయి. మన తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్నాటకలోనూ సంక్రాంతి వేడుకలను ఘనంగా జరుపుకుంటారు. సూర్య భగవానుడు మకర రాశిలోకి ప్రవేశించే సమయాన్ని ‘మకర సంక్రాంతి’ అంటారు. ఈ పండుగకు ఒకరోజు ముందు ‘భోగి’ పండుగను జరుపుకుంటారు. భోగినాడు సూర్యుడు (Sun) ఉత్తర ఆయనం వైపు పయనం ప్రారంభిస్తారు. సూర్యుడు కొంత కాలం భూమధ్యరేఖ (Equator) కి దక్షిణం వైపు ప్రయాణించి ఆ తర్వాత దక్షిణం నుంచి దిశ మార్పుచుని ఉత్తరం వైపు ప్రయాణిస్తాడు. సూర్యుడు ప్రయాణించే దిక్కుని బట్టి.. దక్షిణం వైపు పయనిస్తే దక్షిణానయం.. ఉత్తరం వైపు పయనిస్తే ఉత్తరాయణం అంటారు.
మకర రాశిలోకి ప్రారంభ దశలో ఆ సూర్యని కాంతి సకల జీవరాశుల మీద పడడంతో మంచి జరుగుతుందని శాస్త్రం చెపుతోంది. సూర్యుడే ఆరోగ్యకారుడు ఆ ఆరోగ్యాన్ని ఇవ్వమని కోరుకునే పండుగ ఈ మకర సంక్రాంతి (Sankranti). ఇక భోగ భాగ్యాలను అందించే పండుగ భోగి అని పెద్దలు చెపుతున్నారు. భోగి అంటే సుఖం, ఆనందం. సంక్రాంతి పర్వదినాల ప్రారంభంగా జరుపుకునే ఈ పండుగ చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంది. భోగి రోజున పాత బట్టలు, చెత్త, పాడైన వస్తువులను భోగి మంటలో వేయడం ఆనవాయితీ. ఇది పాత సంవత్సరానికి వీడ్కోలు పలికి, కొత్త సంవత్సరాన్ని స్వాగతించడం వంటిది. భోగి మంటలో పాత వస్తువులను వేయడం వల్ల ఇల్లు శుభ్రంగా మారి, కొత్త శక్తిని పొందుతుందని నమ్మకం. ఇది కొత్త సంవత్సరానికి ఆరంభానికి ప్రతీక.
శ్రీ మహా విష్ణువుకు భోగి పండుగ అంటే ఎంతో ఇష్టం. ధనుర్మాసంలో గోదా దేవి నెలరోజుల పాటు చేసిన వ్రతానికి మెచ్చి శ్రీ విష్ణుమూర్తి స్వయంగా రంగనాథుడై భూలోకానికి వచ్చాడు. అందుకే భోగి రోజు తెల్లవారుజామునే నిద్ర లేచి, ఇంటి ముందు ముత్యాల ముగ్గులు వేసి, వాటి మధ్యలో గొబ్బెమ్మలు పెడతారు. శాస్త్రీయ కారణాల ప్రకారం, సూర్యుడు దక్షిణయానం కాలంలో భూమికి దూరంగా ఉండటంతో ఉష్ణోగ్రతలు తగ్గి చలి తీవ్రత పెరుగుతుంది. గజ గజ వణికించే ఈ వాతావరణాన్ని తట్టుకునేందుకు, చలి బాధలను తప్పించుకునేందుకు, దక్షిణయానంలో తాము పడిన కష్టాలు, బాధలను తట్టుకున్నందుకు.. ఉత్తరాయణ కాలంలో సుఖ సంతోషాలను ఆశిస్తూ భోగి మంటలను వేస్తారు. ఈ మంటల్లో ఆవు పిడకలు, ఇంట్లోని పాత బట్టలు, పాత చెక్క, పాత వస్తువులను వేస్తారు. మనలోని చెడును తగులబెట్టి, మంచి పెంచుకోవడమే ఈ భోగి మంటల అంతరార్థం.
సంక్రాంతి (Sankranti) నుంచి సూర్యుడు ఉత్తరాయణంలోకి వస్తాడు. ఎండ వేడి పెరగడం ప్రారంభం అవుతుంది. భోగి మంటలు వేయడంతో వేడి తట్టుకునేలా శరీరం అలవాటు పడుతుంది. హోమాన్ని ఎంత పవిత్రంగా వేస్తామో భోగి మంటలు కూడా అంతే నిష్టగా వేయాలి. సూర్యోదయానికి ముందే లేచి, స్నానం చేయాలి. కొత్త బట్టలు ధరించాలి. శుచిగా ఉన్న వ్యక్తి భోగి మంటలను వెలిగించాలి. కర్పూరంతో వెలిగిస్తే మంచిదని చెబుతుంటారు. పిడకల మీద ఆవు నెయ్యితో మంటలు వేస్తే మంచిదని చెబుతారు. ఆ మంటలతో ఔషధ గుణాలు ఉంటాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. భుగ్ అనే సంస్కృత పదం నుంచి భోగి అనే పదం వచ్చిందని చరిత్ర ద్వారా తెలుస్తోంది. భోగం అంటే సుఖం.
పూర్వం ఈ దినమే శ్రీ రంగనధాస్వామి లో గోదాదేవి లీనమై భొగాన్ని పొందిందని దీని సంకేతంగా భోగి పండగ ఆచరణలోకి వచ్చిందనేది మన పురాణ గాద.. శ్రీ మహా విష్ణువు వామన అవతారం లో బలి చక్రవర్తిని పాతాళం లోకి తొక్కిన పురాణ గాద మనందరికీ తెలిసిందే అయితే తరువాత బలి చక్రవర్తికి పాతాళ రాజుగా ఉండమని, ప్రతి సంక్రాంతి (Sankranti) కి ముందు రోజున పాతాళం నుండి భూలోకానికి వచ్చి ప్రజల్ని ఆశిర్వదించమని వరమివ్వడం జరిగిందట. బలిచక్రవర్తి రాకను ఆహ్వానించడానికి భోగి మంటలు వేస్తారని మన పురాణాలలో చెప్పబడింది. కృష్ణుడు ఇంద్రుడికి ఒక పాఠం నేర్పుతు గోవర్ధన పర్వతం ఎత్తిన పవిత్రమైన రొజు ఇదే. శాపవశంగా పరమేశ్వరుని వాహనమయిన బసవన్నని భూమికి పంపించి రైతుల పాలిట దైవాన్ని భూమికి దిగి వచ్చిన రొజు ఇదే అనేవి కూడా పురాణాల గాద.
పురాణాల ప్రకారం, శ్రీ రంగనాథ స్వామిలో గోదా దేవి లీనమై భోగాన్ని పొందిందని పండితులు చెబుతారు. మరో కథనం మేరకు.. శ్రీ మహావిష్ణువు వామనుడి అవతారంలో వచ్చి బలి చక్రవర్తిని పాతాళంలోకి తొక్కింది కూడా భోగి నాడే. ఇంకోవైపు ఇంద్రుడి పొగరును అణచివేస్తూ గోవర్ధన పర్వతం ఎత్తిన పవిత్రమైన రోజు కూడా భోగి రోజే అని పెద్దలు చెబుతారు. అన్నదాతల (Farmers) కోసం ఈశ్వరుడు నందిని భూమికి పంపింది భోగి నాడే. ఇన్ని విశేషాలున్న ఈరోజును భోగి పండుగగా జరుపుకుంటారు. భోగి మంటలనేవి కేవలం చలి తీవ్రత నుంచి తప్పించుకునేందుకు మాత్రమే కాదు. ఆరోగ్య ప్రయోజనాల కోసం కూడా వేస్తారు. నిజానికి భోగి మంటలు వెచ్చదనం కోసం మాత్రమే కాదు, ఆరోగ్యం కోసం కూడా. ధనుర్మాసం నెలంతా ఇంటి ముందు పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేస్తారు. వాటినే ఈ భోగి మంటలలో వాడుతారు. ఆవు పేడ పిడకలని కాల్చడం వలన గాలి శుద్ధి అవుతుంది. సుక్ష్మక్రిములు నశిస్తాయి. ప్రాణవాయువు గాలిలోకి అధికంగా విడుదల అవుతుంది. దాని గాలి పీల్చడం ఆరోగ్యానికి మంచిది.
చలికాలం లో అనేక వ్యాదులు వ్యాపిస్తాయి. ముఖ్యంగా శ్వాసకు సంబంధించిన అనేక రోగాలు పట్టి పిడిస్తాయి. వాటికి ఔషదంగా ఇది పని చేస్తుంది. భోగి మంటలు పెద్దవిగా రావడానికి అందులో రవి, మామిడి, మేడి మొదలైన ఔషద చెట్ల బెరడ్లు వేస్తారు. అవి కాలడానికి ఆవు నెయ్యని వేస్తారు. అగ్ని హోత్రంలో వేయబడిన ప్రతి 10 గ్రాముల దేశి ఆవు నెయ్యి నుంచి 1 టన్ను ప్రాణవాయువు (Oxygen) ను విడుదల చేస్తుంది. ఈ ఔషద మూలికలు ఆవు నెయ్యి, ఆవు పిడకలని కలిపి కాల్చడం వలన విడుదల అయ్యే గాలి అతి శక్తివంతమైంది. మన శరీరం లోని 72,000 నడులలోకి ప్రవేశించి శరీరాన్ని శుభ్ర పరుస్తుంది. ఒకరికి రోగం వస్తే దానికి తగిన ఔషదం ఇవ్వవచ్చు, అదే అందరికి వస్తే అందరికి ఔషదం సమకూర్చడం దాదాపు అసాధ్యం. అందులో కొందరు వైద్యం చెయించుకొలేని పేదలు కూడా ఉండవచ్చు. ఇదంతా ఆలోచించిన మన పెద్దలు అందరు కలిసి భోగి మంటల్లో పాల్గొనే సంప్రదాయాన్ని తెచ్చారు. దాని నుండి వచ్చే గాలి అందరికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. కులాలకు అతీతంగా అందరు ఒక చోట చేరడం ప్రజల మద్యన దూరాలను తగ్గిస్తుంది, ఐక్యమత్యాని పెంచుతుంది. ఇది ఒకరకంగా అగ్ని దేవుడికి ఆరాధనా, మరోరకంగా గాలిని శుద్ధి చేస్తూ వాయుదేవునికి ఇచ్చే గౌరవం కూడా.
ఇక్కడ మనం చరిత్రకి సంబంధించిన ఒక విషయం గుర్తుకు తెచుకోవాలి. మన భారతదేశం లో ఉన్న జ్ఞాన సంపదను నాశనం చేస్తే కాని భారతదేశాన్ని ఆక్రమించుకోలేమనుకున్న బ్రిటీషు దుండగులు, భోగి మంటల్లో పాత సామాన్లు తగల బెట్టాలనే నెపంతో అమాయక ప్రజలు ఎన్నో వందల సంవత్సరాలుగా వారసత్వంగా కాపాడుకుంటూ వస్తున్నఅతి ప్రాచిన తాళపత్ర గ్రంధాలను భోగి మంటల్లో వేసి కాల్పించేశారు. నిజానికి భోగి మంటల్లో కాల్చాల్సింది పాత వస్తువులని కాదు, మనలోని పనికి రాని అలవాట్లు, చెడు లక్షణాలు. అప్పుడే మనకున్న పీడ పోయి మానసిక ఆరోగ్యం, విజయాలు వస్తాయి. సంక్రాంతి (Sankranti) పండక్కి సరిగ్గా నెల రోజుల ముందు ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో ఇంటి ముందు పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేస్తారు. వాటినే భోగి మంటల్లో వేస్తారుఅంతేకాదు ఊళ్లో ఉండే వారందరినీ కులాలకతీతంగా అందరినీ ఒకే చోట చేర్చి, ఐక్యమత్యం పెంచడంలో కూడా భోగి పండుగ ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఇదే రోజున చిన్నారుల తలపై భోగి పళ్లను పోస్తారు. చిన్న పిల్లలకు భోగి పళ్లు పోస్తుంటారు. రేగు పళ్లను తల మీద పోసి దీవిస్తారు. పిల్లల మీద ఉన్న చెడు దృష్టి తొలగిపోతుందని భావిస్తారు. ఆ నారాయణుడి అనుగ్రహం లభిస్తుందని విశ్వసిస్తారు. తల పైభాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది. భోగి పళ్లను పోసి ప్రేరేపిస్తే పిల్లల్లో జ్ఞానం పెరుగుతుందని విశ్వసిస్తారు. రేగు పళ్లు, చెరకు గడలు, బంతిపూలు, చిల్లర నాణేలను భోగి పండ్లను వాడతారు. రేగు పళ్లను బదరీఫలాలని అంటారు. శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి నర, నారాయణులు బదరికావనంలో తపస్సు చేస్తారు. వారి తలల మీద దేవతలు బదరీ ఫలాలను కురిపించారని పురాణాల్లో రాసి ఉంది. ఆ ఘటనకు ప్రతీకగా పిల్లలను నారాయణుడిగా భావించి భోగి పళ్లను పోస్తుంటారు. రేగు పళ్లు ఎరుపు రంగులో ఉంటాయి. వాటిని సూర్యుడికి ప్రతీకగా భావిస్తారు. సూర్య భగవానుడి (Sun) ఆశీస్సులు కూడా లభిస్తాయని భోగి పళ్లను పోస్తుంటారు.
మన బాహ్య నేత్రాలకి కనిపించని బ్రహ్మ రంద్రం మన తల పై భాగంలో ఉంటుంది. ఈ భోగి పండ్లను పోయి ఆ బ్రహ్మరంద్రాన్ని ప్రేరేపితం చేస్తే, పిల్లలు జ్ఞానవంతులు అవుతారు. రేగు పండ్లు సూర్య కిరణాలలోని ప్రాణశక్తి ని అధికంగా గ్రహించి, నిల్వ ఉంచుకుంటాయి కనుక వీటిని తల మీద పోయడం వలన వీటిలోని విద్యుచ్చక్తి, శరీరం ఫై, ఆరోగ్యం ఫై ప్రభావాన్ని చూపించి మంచి ఫలితాలు ఇస్తాయి. అందువలనే పిల్లలకి భోగి పండ్లు పోసి అసిర్వాదిస్తారు. ఇదే రోజున బదరీ వనంలో శ్రీహరిని పిల్లాడిగా మార్చి దేవతలంతా బదరీ పళ్ల తో అభిషేకం చేశారు. అవే కాలానుగుణంగా వచ్చిన మార్పులో భోగి పళ్లుగా మారాయి. వీటితో పాటు పూలు, శనగలు కూడా కలిపి చిన్నారులపై వేయడం వల్ల వారు ఆయురారోగ్యాలతో వర్థిల్లుతారని చాలా మంది నమ్ముతారు. మన ప్రతి సంప్రదాయం వెనుక అనేక అర్దాలు, అంతర్దాలు, రహస్యాలు ఉంటాయి. అవి తెలియకపోయినంత మాత్రం చేత ఆచార, సాంప్రదాయాలను ముఢనమ్మకలు అనుకోవడం మూర్ఖత్వం. వాటి విలువలను తెలుసుకొని చేసుకుంటే అవి మనకి మార్గదర్శకులు అవుతాయి.