అమెరికాలోని ఎన్ ఆర్ ఐ లు చేస్తున్న ప్రకృతి వ్యవసాయం అద్భుతం అని సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ళ వెంకట గోపాల కృష్ణారావు పేర్కొన్నారు. అమెరికా దేశంలోని టెక్సస్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఎన్ అర్ ఐ లు చేస్తున్న ప్రకృతి వ్యవసాయాన్ని సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ళ వెంకట గోపాల కృష్ణారావు పరిశీలించారు.
దీనికి సంబంధించి ఒక పత్రికా ప్రకటనలో పూర్తి వివరాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆళ్ళ వెంకట గోపాల కృష్ణారావు మాట్లాడుతూ… టెక్సాస్ రాష్ట్రంలో ఆర్గెల్ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన విజయవాడ ప్రాంత ఎన్ ఆర్ ఐ లు వెల్ది ప్రదీప్ చౌదరి, కొల్లూరు అశోక్, పాలడుగు రామకృష్ణ తదితరులు “కృషి ప్రొడ్యూస్” అనే సంస్థను ఏర్పాటు చేసి 30 ఎకరాల్లో ఏ విధమైన క్రిమిసంహారక మందులు వాడకుండా సహజసిద్దంగా పంటలు పండిస్తున్నారు.
నూటికి నూరు శాతం ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో గోంగూర, మునగ,బెండ, దోస, బీర తదితర కూరగాయలను సాగు చేస్తున్నట్లు తెలిపారు. ఈ వ్యసాయ క్షేత్రంలో సాగునీటిని సబ్మెర్సిబుల్ గొట్టపు బావుల ద్వారా డ్రిప్పు విధానంలో మొక్క వేరుకు అందిస్తూ పూర్తిస్థాయి యాంత్రికరణ ద్వారా గింజలు నాటి మన ప్రాంతంలో పంచగవ్య విధానం లాగా బంగాళదుంపను ఊరబెట్టి నేలలో సహజంగా ఉన్న సూక్ష్మ క్రిములను అభివృద్ధి చేయుట ద్వారా నేలను సారవంతం చేస్తున్నారని అన్నారు.
అనంతపురం జిల్లాలో మాదిరిగా మొక్కల మధ్యలో కలుపు రాకుండా మల్చింగ్ విధానం అనుసరిస్తున్నారని, పండిన పంటను కోసిన మూడు గంటల లోపు డల్లాస్ నగరంలో స్థానికంగా ఉన్న ఇండియా సూపర్ బజార్లకు అందించడం ద్వారా తెలుగువారి ఆరోగ్యానికి ఉపయోగపడే సహజసిద్ధమైన కూరగాయలను అందించడం గొప్ప విషయం అన్నారు.
ఈ విధానంలో తక్కువ ఖర్చుతో ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల పెట్టిన పెట్టుబడికి వందకు వంద శాతం లాభాలు వస్తున్నట్లు “కృషి ప్రొడ్యూస్” సంస్థ నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లాకు చెందిన ఎన్ఆర్ఐ లు తుమ్మల రాంబాబు, కాకర్ల సత్యనారాయణ, మూల్పురి రామకృష్ణ, తుమ్మల చంద్రశేఖర్, త్రిపురనేని ఏసుబాబు తదితరులు పాల్గొన్నారు.