స్వర్ణోత్సవ వేడుకలను మరో 10 రోజుల్లో జరుపుకోబోతున్న సందర్భంగా GWTCS (Greater Washington Telugu Cultural Sangam) అమెరికా రాజధానిలో వందలాది టెస్లా (Tesla) కార్లతో నిర్వహించిన డాన్స్ షో నభూతో అన్న రీతిలో సాగి వీక్షకులను మంత్రముగ్దులను చేసింది.
నేటి యువత అమితంగా ఇష్టపడే టెస్లా కార్ల ఉన్నత సాంకేతికతను ఉపయోగించి, మనదైన సాంప్రదాయ పాటలతో జత కలిపి మిరుమిట్లు గొలిపే లైట్లతో తెలుగు పాటలకు ఏకకాలంలో ప్రదర్శించిన పాటలు ఇంతకు ముందెన్నడూ చూడని అనుభూతిని మిగిల్చిందని GWTCS (Greater Washington Telugu Cultural Sangam) అధ్యక్షులు కృష్ణ లాం (Krishna Lam) తెలిపారు.
తెలుగు భాష వైభవాన్ని ఈ తరానికి చేరువ చేసే ప్రయత్నాన్ని వినూత్నరీతిలో సాంకేతిక, సంప్రదాయ సమ్మిళిత అపూర్వ ఘట్టానికి ఈ కార్యక్రయం వేదికైంది. సాయంత్రం 5:00 గంటల నుండి మొదలై.. మా తెలుగు తల్లికి మల్లెపూదండ గేయంతో ఆరంభమై.. చిన్నారుల నృత్యానికి తోడు క్రమంగా పెద్దలు కూడా కాలు కదిపారు.
ఆపై ముందెన్నడూ చూడని విధంగా ధగ ధగ మెరిసే కార్ల కాంతుల వెలుతురులో మన ఆపాత మధుర గేయాలకు సమకాలీన సాంకేతికతను జత చేసి ఏకకాలంలో జరిగిన ప్రదర్శన అందరి ప్రశంసలనూ అందుకుంది. ఈ ఘట్టాలను అధునాతన డ్రోన్ (Drone Camera) సాయంతో చిత్రీకరించారు.
GWTCS (Greater Washington Telugu Cultural Sangam) కార్యవర్గ సభ్యులు, కృష్ణ గుడిపాటి టీమ్ సభ్యులు ఈ కార్యక్రమాన్ని సమన్వయపరచారు. పెద్దలు, యువకులు, చిన్నారులు ఇలా అన్ని తరాలవారిని అమితంగా ఆకట్టుకునే విధంగా గత ఆరు వారాల నుండి కార్యక్రమాలను వివిధ విభాగాలలో (నృత్య, క్రీడా, బాషా, సాంకేతిక) నిర్వహిస్తున్నారు.
ఐదు దశాబ్దాల ఘన వారసత్వ సంపదకు వేదికై నిలిచిన GWTCS స్వర్ణోత్సవ వేడుకలకు (Golden Jubilee Celebrations) తెలుగు వారందరూ హాజరై, మన ఇంటి పండుగలా పరస్పర సహకారంతో, అందరి సమన్వయంతో.. వేలాది మంది సమక్షంలో అతిరధ మహారధులైన పలు రంగాల అతిధుల సమక్షంలో దిగ్విజయంగా ఈ కార్యక్రమం నిర్వహించుకుందామని అధ్యక్షులు కృష్ణ లాం తెలిపారు.