తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం (Telugu Literary and Cultural Association – TLCA) వారి సంక్రాంతి మరియు గణతంత్ర దినోత్సవ వేడుకలు జనవరి 21న న్యూయార్క్ లోని హిందూ టెంపుల్ సొసైటీ ఆఫ్ నార్త్ అమెరికా (The Hindu Temple Society of North America) లో అత్యంత వైభవంగా నిర్వహించారు.
నూతన కార్యవర్గం ఛార్జ్ తీసుకున్న తర్వాత వెను వెంటనే సంక్రాంతి (Sankranti) ఈవెంట్ నిర్వహణ సమయాభావం వల్ల సవాలుతో కూడుకున్న విషయం. దీంతో సహజంగా ఈవెంట్ కి హాజరు తక్కువుంటుంది. కానీ అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ దాదాపు 500 మందికి పైగా ఆహ్వానితులతో అదరహా అనేలా నిర్వహించారు.
అంతమందిని ఉత్సాహభరితంగా పాల్గొనేలా ఆహ్లాదకరమైన ఏర్పాట్లు చేసిన అధ్యక్షులు నెహ్రూ కఠారు (Nehru Kataru) సారధ్యంలోని TLCA కార్యవర్గాన్ని అభినందించాల్సిందే. ముందుగా టి.ఎల్.సి.ఎ కార్యదర్శి సుమంత్ రాంశెట్టి పండుగ శుభాకాంక్షలతో కార్యక్రమాన్ని ప్రారంభించి అందరినీ ఆహ్వానించారు.
భక్తి పారవశ్యంతో నిండిన దేవుని శ్లోకంతో సాంస్కృతిక కార్యక్రమాలు (Cultural Programs) మొదలయ్యాయి. తెలుగుదనంతో ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు తెలుగు భాషను, సాంస్కృతిక వైభవాన్ని చాటాయి. భారత గణతంత్ర దినోత్సవ థీమ్ తో ప్రదర్శించిన చిన్నారుల నృత్యం దేశభక్తిని పెంపొందించింది.
అనంతరం వేదికపైన జండా వందనం (Flag Hoisting) గావించారు. కాంతారా సినిమాలోని పాటకు చేసిన నృత్యం సభికులను మంత్రముగ్ధులను చేసింది. అలాగే పలువురు మహిళలు, డాక్టర్స్ కలిసి చేసిన ఫ్యాషన్ షో (Fashion Show) కనులవిందుగా సాగింది. నటి అశు రెడ్డి తన చురుకైన యాంకరింగ్ తో ఆకట్టుకున్నారు.
పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్, బాలక్రిష్ణ నటించిన వీరసింహారెడ్డి వంటి లేటెస్ట్ సినిమాల్లోని పాటలకు ప్రముఖ కొరియోగ్రాఫర్ సత్య మాస్టర్ మరియు నటి అశు రెడ్డి కలిసి వేసిన స్టెప్పులకు ఆడిటోరియం దద్దరిల్లింది. సత్య మాస్టర్ వారం పాటు స్థానికులకు డాన్స్ నేర్పించి వేదికపై ప్రదర్శించిన నృత్యాన్ని అభినందించ కుండా ఉండలేరు.
తెలుగు లిటరరీ & కల్చరల్ అసోసియేషన్సంక్రాంతి వేడుకలను పురస్కరించుకుని నిర్వహించిన ముగ్గుల (Rangoli) పోటీలలో మహిళామణులు ఆసక్తిగా పాల్గొన్నారు. పిల్లల కొరకు నిర్వహించిన గాలిపటాల పోటీలు, భోగి పళ్ళు కార్యక్రమాలలో చిన్నారులు ఆహ్లాదకరంగా పాల్గొనడం ముదావహం.
ఫోటోబూత్ వద్ద అందరూ ఫోటోలు దిగుతూ ఉల్లాసంగా కనిపించారు. వివిధ రకాల వ్యాపారులు ఏర్పాటు చేసిన షాపింగ్ స్టాల్ల్స్ వద్ద మహిళలు కలియతిరిగారు. మధ్యమధ్యలో ర్యాఫుల్ డ్రాస్ తీసి మద్దిపట్ల ఫౌండేషన్ వారు సమర్పించిన బహుమతులు అందజేశారు.
TLCA అధ్యక్షులు నెహ్రూ కఠారు, మాజీ అధ్యక్షలు జయప్రకాశ్ ఇంజపురి, సంయుక్త కార్యదర్శి శ్రీనివాస్ శనిగేపల్లి, కోశాధికారి మాధవి కోరుకొండ, సంయుక్త కోశాధికారి అరుంధతి అదుప, కార్యనిర్వాహక సభ్యులు కరుణ ఇంజపురి, భగవాన్ నడింపల్లి చేసిన డాన్సులు అందరినీ అలరించాయి.
టాలీవుడ్ (Tollywood) సింగర్స్ మొదుమూడి శృతిరంజని మరియు అరుణ్ ముసునూరి తమ పాటలతో అలరించారు. విభిన్న పాటల మేళవింపుతో సాగిన మ్యూజికల్ నైట్ లో తమ అద్భుత గానంతో దాదాపు రెండు గంటల పాటు ప్రేక్షకులందరినీ ఉర్రూతలూగించారు.
TLCA 2023 ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులను, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ని వేదికపైకి ఆహ్వానించి సభికులకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా డా. ప్రసాద్ అంకినీడు బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. తానా మాజీ అధ్యక్షలు జయ్ తాళ్లూరి, శిరీష తూనుగుంట్ల, దిలీప్ ముసునూరు, అలాగే టిటిఏ నాయకులు విచ్చేసి అభినందనలు తెలియజేశారు.
స్పాన్సర్స్, ఆర్టిస్టులు అందరినీ సభాముఖంగా వేదికపైకి ఆహ్వానించి శాలువా, మెమెంటో మరియు పుష్పగుచ్చంతో ఘనంగా సత్కరించారు. చివరిగా సంక్రాంతి పండుగ స్పెషల్ అరిసెలు, కాజా వంటి ప్రత్యేక ఐటమ్స్ తో సంప్రదాయక తెలుగు భోజనం అందరి జిహ్వచాపల్యాన్ని తీర్చింది.
ఈ సంప్రదాయక భోజనం (Traditional Dinner) విషయంలో కరుణ ఇంజపురి, లావణ్య అట్లూరి, సునీల్ చల్లగుళ్ళ ఆధ్వర్యంలోని ఫుడ్ కమిటీని తప్పకుండా అభినందించాలి. ఆహ్వానితులు అందరూ పండుగ భోజనం చాలా బాగుందంటూ కితాబు ఇవ్వడం విశేషం.
ఉపాధ్యక్షులు కిరణ్ కుమార్ పర్వతాల స్పాన్సర్స్, ప్రేక్షకులు, వాలంటీర్లు, టెంపుల్, మీడియా పార్ట్నర్స్ NRI2NRI.COM, టీవీ ఛానెల్స్ ఇలా ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతాభినందనలు తెలిపి సంక్రాంతి మరియు భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను దిగ్విజయంగా ముగించారు.