రామాయణం, భగవద్గీత, ఎన్టీఆర్ సమగ్ర జీవిత కథ, పెద్ద బాల శిక్ష, చందమామ కథలు, ఆంగ్ల తెలుగు నిఘంటువు, తెనాలి రామకృష్ణ కథలు, వేమన పద్యాలు లాంటి పలు తెలుగు పుస్తకాలను అమెరికా లైబ్రరీలలో అందుబాటులోకి తెచ్చే ప్రాజెక్ట్ కి తానా బోర్డు మాజీ ఛైర్మన్ డాక్టర్ నరేన్ కొడాలి తానా ద్వారా శ్రీకారం చుట్టారు. మొదటి విడతగా 40 పుస్తకాల చొప్పున అమెరికాలోని 25 కేంద్రాలలో పైలట్ ప్రాజెక్ట్ కింద అమలు చేస్తున్నారు.
తానా కమ్యూనిటీ సర్వీసెస్ కోఆర్డినేటర్ రాజా కసుకుర్తి, సమన్వయకర్తలు అనీల్ చౌదరి ఉప్పలపాటి మరియు భాను మాగులూరి ఆధ్వర్యంలో ఈ తెలుగు పుస్తకం ప్రాజెక్ట్ ని చేపట్టారు. ఇందులో భాగంగా న్యూ ఇంగ్లండ్ లోని వెస్ట్‌బొరో పబ్లిక్ లైబ్రరీకి తానా ప్రతినిధి ప్రదీప్ గడ్డం తెలుగు పుస్తకాలను అందజేశారు.
భవిష్యత్తులో న్యూ ఇంగ్లండ్ లో తెలుగు పుస్తకాలు అనేక లైబ్రరీలలో అందుబాటులోకి తెస్తామన్నారు. పిల్లలకు చిన్నప్పటి నుంచి తెలుగుపై శ్రద్ధ కలిగేలా ఈ పుస్తకాలు ఉపయోగపడతాయన్నారు. గోపి నెక్కలపూడి, కెపి సోంపల్లి, విజయ్ బెజవాడ, శ్రీనివాస్ గొర్లే తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వెస్ట్‌బరో పబ్లిక్ లైబ్రరీ ప్రతినిధులు తానా సంస్థను అభినందించారు. ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన తానా బోర్డు మాజీ ఛైర్మన్ డాక్టర్ నరేన్ కొడాలి గారికి మరియు తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు గారికి న్యూ ఇంగ్లండ్ తానా బృందం కృతజ్ఞతలు తెలిపింది.