Published
12 months agoon
By
NRI2NRI.COMసంక్రాంతి లేదా సంక్రమణం అంటే సూర్య భగవానుడు ఒక రాశి నుండి మరొక రాశి లోనికి చేరడం అని అర్ధం. ఆవిధంగా సూర్యుడు మకర రాశిలో చేరగానే ప్రతి సంవత్సరం జనవరి మాసంలో మనం జరుపుకొనే సంక్రాంతి పండుగ అంటే తెలుగు వాళ్ళకు ఎంతో ఇష్టం. భారతదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి పండుగ (Sankranti Festival) ఎంత గొప్పగా జరుగుతుందో వర్ణించడానికి మాటలు చాలవు.
అమెరికా లో నివసిస్తున్న తెలుగువారు కూడా సంక్రాంతి పండుగను అంతే ఘనంగా జరుపుకొనేలా, అతిపెద్ద తెలుగు సంస్థలలో ఒకటైన ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం, (TANTEX) వారు ఎప్పటిలాగే ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం ఆనవాయితీ గా వస్తోంది. ఈసారి కూడా సంప్రదాయానికి పెద్ద పీట వేసి, ఆధునికతను మేళవించి టాంటెక్స్ సంస్థ వారు ‘సంక్రాంతి సంబరాలు’ నిర్వహించి తెలుగు వారి మనసులను రంజింపచేశారు.
ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (TANTEX) Rick Reedy హైస్కూల్, Frisco లో ఏర్పాటు చేసిన ఈ “సంక్రాంతి సంబరాలు” అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణంలో, చూడ ముచ్చటైన సాంస్కృతిక కార్యక్రమాలతో ఎంతో ఘనంగా నిర్వహించ బడ్డాయి. సంస్థ 2024 అధ్యక్షులు శ్రీ సతీష్ బండారు (Satish Bandaru) మరియు కార్యక్రమ సమన్వయకర్త శ్రీ ఉదయ్ కిరణ్ నిడిగంటి ఆధ్వర్యంలో, సాంస్కృతిక సమన్వయకర్త దీప్తి సూర్యదేవర ఈ కార్యక్రమాలను నిర్వహించారు.
సంక్రాంతి పండుగ వాతావరణాన్ని కళ్లకు కట్టినట్టు సభా ప్రాంగ ణాన్నిశోభాయమానంగా అలంకరించారు. స్థానిక ఇండియన్ రెస్టారెంట్ సురవి Chapter1 వారు పండుగను మళ్ళీ తలపించే విధంగా ఆహూతులందరికీ నోరూరించే షడ్రసోపేతమైన పలు రకాల వంటకాల్ని రుచి చూపించారు. ఆహూతులే కాకుండా సుమారు 150 మంది బాలబాలికలు ఉత్సాహంగా పాల్గొన్న ఈ కార్యక్రమం,అచ్చమైన తెలుగు వాతావరణాన్ని అణువణువునా ప్రతిబింబించేలా వీనులవిందైన పాటలతో, తెలుగింటి ఆచారాలను వాటిలోని విశిష్టతను కళ్ళకు కట్టినట్లు చూపించే సంగీత, నృత్య అంశాలకు పెద్ద పీట వేసిందనటంలో ఏ మాత్రం సందేహం లేదు.
తొలుత శాస్త్రీయ సంగీతంలో అత్యంత ప్రతిభా మూర్తులైన చిన్నారులు సాహితీ వేముల, సింధూర వేముల మరియు సమన్విత మాడ లు శ్రీరామ నామామృత భక్తిరస గీతాన్ని ఆలపించడం ఇంకా అమెరికా జాతీయ గీతం వినిపించడంతో ఈ కార్యక్రమం ప్రారంభించబడింది. ప్రసిద్ధ ప్రధాన వ్యాఖ్యాతలు మైత్రేయి మియాపురం మరియు సిద్ధార్థ్ ఈ కార్యక్రమానికి యాంకర్లుగా వ్యవహరించారు.
సాంస్కృతిక కార్యక్రమాలు (Cultural Programs) ప్రారంభ సూచికగా భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను గుర్తు చేసుకుంటూ రుచికరమైన పిండి వంటలను ఇంకా మన తెలుగు వారి సంప్రదాయానికి ప్రతీకలైన గొబ్బెమ్మలు, గాలి పటాలు, ఎద్దుల పోటీలు,ఇంటింటికీ వచ్చే హరిదాసులు, గంగిరెద్దులు ఆడించేవాళ్ళు వంటి సంక్రాంతి సంబరాల జ్ఞాపకాలను నెమరు వేసుకోవడం జరిగింది.
నాటి సాంస్కృతికప్రదర్శనలలో భాగంగా దేవాది దేవులైన మహా శివుని, శ్రీ రాముని మరియు శ్రీ కృష్ణుని మనం భక్తితో తలచుకొనేలా చేసిన చలన చిత్ర పాటల ప్రదర్శనలు, ”జయ దుర్గే”,”శంభో మహాదేవ”, ”అలరులు కురియగ” అంటూ అద్భుతంగా సాగే సంప్రదాయక కూచిపూడి నృత్యాలు ”సంక్రాంతి పుష్పాంజలి” వంటి భారతీయ శాస్త్రీయ నృత్యాలు వీక్షకులను ఎంతగానో అలరించాయి.
టాంటెక్స్ తక్షణ పూర్వాధ్యకులు శ్రీ శరత్ రెడ్డి ఎర్రం (Sharath Reddy Yerram) మాట్లాడుతూ.. “క్రిందటి సంవత్సరం కార్యవర్గ సభ్యులు, స్వచ్చంద కార్యకర్తలు అందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు. 2023 పాలక మండలి అధిపతి అనంత్ మల్లవరపు గారు ప్రసంగిస్తూ.. అందరికి 2024 నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. తొలుత 2024 వ సంవత్సరానికి ఎన్నికైన అధ్య క్ష, కార్యదర్శిలతో పాటు పాలక మండలి మరియు కార్యనిర్వాహక బృందాన్ని ఒక చక్కటి గేయం ద్వారా సభకు పరిచయం చేయడం జరిగింది.
తదుపరి 2024 వ సంవత్సరానికి టాంటెక్స్ ప్రస్తుత అధ్యక్షులు శ్రీ సతీష్ బండారుమాట్లాడుతూ.. టాంటెక్స్ పాలక మండలి మరియు కార్యకర్తల సహకారాలతో అమెరికా తెలుగు వారికి సేవ చేసుకొనే అదృష్టం టాంటెక్స్ సంస్థ ద్వారా తనకు కలిగిందని, TANTEX సంస్థ ఘన చరిత్ర కాపాడేలా నిరంతరం శ్రామికుడిలా కష్టపడతాననీ ప్రమాణం చేశారు.
తన అపార అనుభవంతో సంస్థ పురోభివృద్ధికి కృషి చేస్తాననీ, భావితరాన్ని మరిన్ని అవకాశాలతో ప్రోత్సహిస్తూ, యువతకు ప్రాధాన్యత కల్పిస్తూ, ఎన్నో విన్నూత్న కార్యక్రమాలతో, మరింత సేవాతత్పరత కలిగిన సంస్థగా టాంటెక్స్ సంస్థను తీర్చిదిద్దుతాననీ ఆయన పేర్కొన్నారు. క్రొత్తగా ఎన్నికైన బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (Board of Trustees) అధిపతి శ్రీ సురేష్ మండువ (Suresh Manduva), ఉపాధిపతి శ్రీ హరి సింగం మాట్లాడుతూ.. కార్యనిర్వాహక బృందానికి తమ వంతు సహకారము సహాయము ఎప్పుడూ ఉంటుంది అని తెలిపారు.
గత సంవత్సర కాలంగా అసమాన ప్రతిభతో టాంటెక్స్ సంస్థను విజయ వంతంగా నిర్వహించి పాలక మండలి అధిపతిగా పదవీవిరమణ చేసిన శ్రీయుతులు అనంత్ మల్లవరపు గారినీ, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఉపాధిపతి డాక్టర్ భాస్కర్ రెడ్డి సానికొమ్ము గారినీ మరియు తక్షణ పూర్వ అధ్యక్షులు శ్రీ శరత్ రెడ్డి ఎర్రం గారినీ, వారితో పాటు సంస్థ అభి వృద్ధికి ఎంతగానో సహకరించిన పూర్వపు కార్యవర్గ సభ్యులనూ, పాలక మండలి సభ్యులనూ ప్రతి ఒక్కరినీసన్మానించడం జరిగింది.
శ్రీయుతులు అనంత్ మల్లవరపు గారు, డాక్టర్ భాస్కర్ రెడ్డి సానికొమ్ము గారు, శ్రీ శరత్ రెడ్డి ఎర్రం గారు సాటిలేని వారి నాయకత్వ ప్రతిభతో, ప్రతి ఒక్కరినీ కలుపుకొని పోయే స్నేహపూర్వకమైన వారి పరిపాలన దక్షత తోనూ, అంకిత భావంతోనూ సంస్థకు వారంతా చేసిన అమూల్యమైన సేవలకు గుర్తింపుగా టాంటెక్స్ గవర్నింగ్ బోర్డు 2024 తరపున వారిని కొనియాడడమే కాక వారికి శాలువా కప్పి, పుష్పగుచ్చములతోను, ప్రత్యేక జ్ఞాపికలతోను టాంటెక్స్ సంస్థ ప్రస్తుత అధ్యక్షులు శ్రీ సతీష్ బండారు, శ్రీ చంద్రశేఖర్ రెడ్డి పొట్టిపాటి మరియు ఉపాధ్యక్షులు శ్రీమతి మాధవి లోకిరెడ్డి, ఇంకా కార్యవర్గ మరియు పాలకమండలి సభ్యులు వారందరినీ ఘనంగా సన్మానించడం జరిగింది.
అంతే గాక ఈ Telugu Association of North Texas (TANTEX) సంక్రాంతి సంబరాలకి ప్రత్యేకంగా విచ్చేసి తమ వీనుల విందైన మధుర గాన ప్రదర్శనలతో అతిథులని ఎంతో ఆనందపరచిన గాయకులు శ్రీకాంత్ లంక (Srikanth Lanka) మరియు దీప్తి నాగ్ యాయవరం (Deepthi Nag Yayavaram) లకు పుష్పగుచ్చాలను అందించి సన్మానం చేయడం జరిగింది.
“సంక్రాంతి సంబరాలు” కార్యక్రమ సమన్వయకర్త శ్రీ ఉదయ్ కిరణ్ నిడిగంటి మాట్లాడుతూ.. ఎంతో ఓపికగా నాలుగు గంటలపాటు కార్యక్రమాన్ని ఆసాంతం తిలకించి వినోదాన్ని ఆస్వాదించిన ప్రేక్షకులకు, అతిథి మహారధులకూ, రుచికరమైన విందు భోజనం వడ్డించిన సురవి రెస్టారెంట్ యాజమాన్యంవారికీ, టాంటెక్స్ సంస్థ మహారాజ పోషకులకు మరియు ”సంక్రాంతి సంబరాలు” కార్యక్రమ పోషకులకు పేరుపేరునా కృతఙ్ఞతలు తెలియజేశారు.
అటు పిమ్మట, కార్యదర్శి శ్రీ సునీల్ సూరపరాజు మీడియా ముఖంగా మాట్లాడుతూ.. కార్యక్రమానికి హాజరైన జాతీయ మరియు స్థానిక సంస్థల ప్రతినిధులందరికీ ధన్యవాదాలు తెలిపారు. అంతే కాకుండా ప్రసారమాధ్యమాలైన TV9, Sakshi, Cross Roads Media, Prime9 News, I Asia News, NRI Page, NRI2NRI.COM, TNI Live, తెలుగు టైమ్స్ వారికి కూడా ప్రత్యేకంగా కృతఙ్ఞతలు తెలియచేశారు.
ఎలాంటి స్వలాభాపేక్ష లేకుండా తెరవెనుక ఉండి ఈ కార్యక్రమాన్ని విజయ వంతంగా నిర్వహించడానికి తోడ్పడిన ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (TANTEX) సంస్థ పాలక మండలిసభ్యులకూ, కార్యనిర్వాహక బృందసభ్యులకూ మరియు కార్యకర్తలందరికీ తమ హృదయపూర్వక కృతఙ్ఞతాభివందనాలు తెలియజేసిన పిదప భారతీయ జాతీయ గీతం ఆలాపనతో, నాటి అత్యంత శోభాయమైన కార్యక్రమం ”సంక్రాంతి సంబరాల”కు తెరపడింది.