ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (Telugu Association of North Texas) నెల నెలా తెలుగు వెన్నెల ధారావాహికలో భాగంగా ఈ నెల డిసెంబర్ 18న జరిగిన 185వ నెల నెలా తెలుగు వెన్నెల కార్యక్రమం ఆసక్తికరంగా సాగింది. సాహిత్య వేదిక సమన్వయ కర్త శ్రీనివాసులు బసాబత్తిన అంతర్జాలంలో సభకు విచ్చేసిన సాహితీవేత్తలకు నమస్కారములు తెలిపారు. చిరంజీవి భవ్య తన లేలేత మధుర గాత్రంతో ఆలపించిన త్యాగరాజ కీర్తన సాహిత్య ప్రియులను భక్తి పారవశ్యంలో తెలియాడేలా చేసింది.
నేటి ”మాసానికో మహ నీయుడు” శీర్షిక క్రింద డిసెంబరు నెలలో జయంతి మరియు వర్ధంతి జరుపుకొంటున్న ప్రముఖ కవుల సాహితీ వేత్తల వివరాల్ని అధిక శ్రమ కోర్చి సేకరించి ఆయా రచయితలను గుర్తు చేశారు. డెసెంబరు నెలలో జన్మించిన ప్రముఖ రచయిత శ్రీ ఉన్నవ లక్ష్మినారాయణ గారి మాలపల్లి నవలను సభకు గుర్తు చేసి మరొక్కసారి ఆ నవల విశిష్టతను తెలియజేశారు.
ఆధునిక పదబంధ ప్రహేళికా చక్రవర్తి శ్రీ ఊరిమిండి నరసింహారెడ్డి గారు తన సాహిత్యయజ్ఞంలో అందరినీ భాగస్వాములను చేయాలనే సత్సంకల్పంతో 2018 నుండి నేటివరకు ప్రతినెలా నిర్వహిస్తున్న “మనతెలుగు సిరిసంపదలు” కార్యక్రమములో ప్రహేళికలు, అంతర్లాపిక ప్రహేళికలు జానపద సాహిత్య మిళితమైన పొడుపు కథలు చమత్కార పద్యాలు వాటిలో పూరణ చేయవలసిన పదాలను ప్రశ్నలుగా సంధించి సాహితీ ప్రియులను తీవ్రముగా ఆలోచింపచేసి వారినుండి సరియైన సమాధానాలను రాబట్టే ప్రయోగం కొనసాగిస్తున్నారు. ఎప్పటిలాగే ఈ నెలలో కూడా ఒక వినూత్న ప్రయోగంతో ప్రపంచవ్యాప్త సాహితీ ప్రియుల మెదడుకు మేత వేసి వారిలో నూతన ఉత్సాహాన్ని నింపి అందరి ప్రశంసలనందుకున్నారు.
ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (TANTEX) 185వ నెల నెలా తెలుగు వెన్నెల కార్యక్రమం ముఖ్య అతిథి శ్రీ హరి చరణ ప్రసాద్ గారు “నాలుగు నవలలు – నాలుగు మాటలు. అర్ధనారీ, మున్నీటి గీతలు, మనోధర్మ పరాగం, పగులు“ అంశంపై అద్భుతమైన ప్రసంగము చేశారు. తానా, ఆటా సంస్థలు నిర్వహించిన నవలల పోటీలలో బహుమతి పొందిన నవలలను సభకు పరిచయం చేశారు. చక్కని నవలలను ఎంపిక చేసినందుకు తానా, ఆటా సంస్థలను అభినందించారు. వీరి ప్రసంగం తర్వాత అందరికీ ఆ నాలుగు నవలలను చదవాలని ఆసక్తి కలిగింది.
ప్రతి నెల నెలా తెలుగు వెన్నెల కార్యక్రమంలో సత్యం ఉపద్రష్ట గారు, రాధ కాశీనాధుని గారు కలిసి పద్య సౌగంధం శీర్షిక నిర్వహిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. శ్రీమతి కాశీనాధుని రాధ గారు నేటి పద్య సౌగంధం కార్యక్రమములో మను చరిత్ర నుండి చక్కని పద్యమును చదివి వివరించారు. సాహితీ మిత్రులు లెనిన్ వేముల గారు పెఒతన గారి రుక్మిణీ కళ్యాణం నుండి ఒక చక్కని పద్యమును చక్కగా ఆలపించి అందరి మన్ననలు పొందారు.
ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం సాహిత్య వేదిక సమన్వయ కర్త శ్రీనివాసులు బసాబత్తిన గారు ముఖ్య అతిథి హరి చరణ ప్రసాద్ గారికి జ్ఞాపికను బహుకరించారు. ప్రతి సంవత్సరం చివరలో అప్పటివరకు జరిగిన కార్యక్రమాలను సింహావలోకనం పేరిట నెమరు వేసుకోవడం ఆనవాయితీ. ఆ సందర్భంగా జనవరిలో జరిగిన 174వ నెల నెలా తెలుగు వెన్నెల కార్యక్రమం నుండి ఇప్పటీ వరకు జరిగిన సాహితీ సదస్సులను సభకు విచ్చేసిన సాహితీ మిత్రులతో సమన్వయ కర్త శ్రీనివాసులు బసాబత్తిన పంచుకున్నారు.
ప్రార్థనా గీతం పాడిన చిరంజీవి భవ్యతో పాటు కార్యక్రమంలో పాల్గొన్న సాహిత్య అభిమానులకు ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం అధ్యక్షులు శ్రీ ఉమామహేష్ పార్నపల్లి గారు ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం కార్యవర్గం, పాలక మండలి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సంస్థ ప్రస్తుత అధ్యక్షులు శ్రీ ఉమామహేష్ పార్నపల్లి గారు నేటి సభను విజయవంతము చేసిన ప్రముఖ సాహితీ వేత్తలందరికీ కృతజ్ఞతలు తెలిపారు.