Connect with us

Literary

TANTEX 206 వ & టెక్సాస్ 53 వ సాహిత్య సదస్సు @ Lewisville, Texas

Published

on


సెప్టెంబరు నెల 21 వ తేదీ శనివారం జరిగిన డల్లాస్ ఫోర్ట్ వర్త్, ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం టాంటెక్స్ ”నెలనెల తెలుగువెన్నెల” తెలుగు సాహిత్య వేదిక 206 వ సాహిత్య సదస్సు మరియు 53 వ టెక్సాస్ సాహిత్య సదస్సు లేవీస్ విల్లే,టెక్సాస్ (Lewisville, Texas) నగరము నందు గల సమావేశ మందిరము వేదికగా నిర్వహించబడింది.”’న భూతొ న భవిష్యతి ” అన్నట్లుగా జరిగిన ఈ ”సంగీత సాహిత్య సమలంకృత నెలనెలా తెలుగు వెన్నెల” సదస్సు ప్రారంభ సూచికగా శ్రీరామ చంద్ర మూర్తి ని స్తుతిస్తూ పురందరదాసు విరచిత కన్నడ భక్తి గేయం ””రామ నామ ఉమ్మే….”అనే ప్రార్దనా గీతాన్ని చిరంజీవి సమన్విత తన మధుర కంఠంతోరాగయుక్తంగానూ వీనుల విందుగాను పాడి సాహితీ ప్రియులను భక్తి పారవశ్యులను చేసింది.

టాంటెక్స్ (TANTX) బోర్డు ఆఫ్ ట్రస్టీస్ మెంబర్, మరియు సమన్వయ కర్త , శ్రీ దయాకర్ మాడా గారు స్వాగతోపన్యాసం చేశారు. ప్రముఖ సినీ లలిత గీతాల రచయిత కీ,శే.వడ్డేపల్లికృష్ణ చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించడంతో పాటు ఒక నిముషం మౌనం పాటించి పలువురు వక్తలు వడ్డేపల్లి కృష్ణగారితో తమకు గల అనుబంధాన్ని అనుభవాలను పంచుకొన్నారు. తరువాతమహిళా కళాశాల విశ్రాన్త ప్రిన్సిపాల్ శ్రీమతి అద్దేపల్లి సుగుణ గారు ”సాహిత్యంలో నారీభేరీ”అంశం గా ప్రస్తుత సమాజంలో మహిళల స్థితిగతులపై మాట్లాడడం జరిగింది.మహాకవి గురజాడ 162 వ జయంతి ని పురస్కరించుకొని ఇండియన్ జర్నలిస్టు యూనియన్ జాతీయ కార్యదర్శి డి.సోమసుందర్ గారు గురజాడ రచనల్లోని ఆధునికత శాస్త్రీయ దృష్టి గురించీ , తన సమకాలీకులలో ఆయన ప్రత్యేకతలను గురించి అద్భుతంగా మాట్లాడడం జరిగింది.

కన్యాశుల్కం నాటకం వ్రాయడంలో ఆనాటి సమాజంలో పేరుకొని పోయిన ద్వంద ప్రమాణాలను కపటత్వాన్ని గురజాడ మహాకవి ఎండగట్టిన తీరునుశ్రీ సోమసుందర్ గారు అద్భుతంగా వివరించడం జరిగింది. ప్రాధమిక విద్యాస్థాయిలో తెలుగు బోధనా భాషగావుండాలని శ్రీ సోమసుందర్ అభిలషించారు. ప్రముఖ సాహితీ విశ్లేషకులు శ్రీ బి.లలితానంద ప్రసాద్, పుస్తక పరిచయంలో విశ్వ మానవుడు సంజీవ్ దేవ్ ఆలోచనా సరళిని అర్ధం చేసుకోవాలని అన్నారు.తరువాత ”సాహిత్యంలో శ్రీ దేవులపల్లి కృష్ణ శాస్త్రి సాహితీ వీక్షణం ”లో కృష్ణ శాస్త్రి గారి రచన ప్రతిభా పాటవాల్ని శ్రీ నరేందర్ చక్కగా విశ్లేషించడం జరిగింది. అనంతరం సుప్రసిద్ధ అవధాని శ్రీ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు ”రామాయణ కల్పవృక్షం ”కావ్య వైశిష్ట్యాన్ని వివరిస్తూ కవి సామ్రాట్ బిరుదాంకితులైన విశ్వనాథవారు తె లుగు భాష మాధుర్యాన్ని,పడికట్టును, పలుకుబడిని ఆమహాకావ్యంలో సజీవంగా ప్రతిబింబింబింప చేసిన వైనాన్ని సోదాహరణంగాను అద్భుతంగాను వివరించటమేగాక శ్రీ పాలపర్తి గారు విశ్వనాధ వారి రచనలలోని తెలుగు భాషా మాధుర్యాన్ని తమ సవివరణాత్మక ఉపన్యాసంలో గుర్తుచేయడం జరిగింది.

గత 77 మాసాలుగా నిరాటంకంగా నిర్వహిస్తున్న ”మన తెలుగు సిరి సంపదలు” అందరినీ ఆకట్టుకున్నది. కార్యక్రమంలో అందరినీ భాగస్వాములను చెయ్యాలనే శుభ సంకల్పంతో ప్రారంభించిన ధారావాహికశీర్షిక ”మన తెలుగు సిరిసంపదలు”. చమత్కార గర్భిత పొడుపు పద్యాలు, ప్రహేళికలు,జాతీయాలు, పొడుపు కథలతో సహా దాదాపు యాభై ప్రక్రియల సమాహార మైన ఈ శీర్షికలో వైవిధ్య భరితమైన తెలుగు భాషా ప్రయోగాలను స్పృశించడం, అక్షరాల పద భ్రమకాలుకొంటె ప్రశ్నలుగా సంధించి సాహితీ ప్రియులనుండి సమాధానాలను రాబట్టడంలో విజయవంతమైన డాక్టర్ నరసింహారెడ్డి ఊరిమిండి వారిని పలువురు ప్రశంసించడం జరిగింది.


”సాహిత్యము-దాని ప్రభావము -మానవజీవన పరివర్తన-నేపథ్యము-” అనే అంశముపై శ్రీ విఠల రామశర్మ గారి ప్రసంగము,,”శ్రీ రామ రక్ష” అంశంపై శ్రీ పైడా వెంకట నక్త రాజు గారి ప్రసంగము,”సమాజంపై గురువుల ప్రభావం”అంశంపై శ్రీరామకృష్ణ శర్మగారి ప్రసంగం, శ్రీనివాస్ ఇరువంటి చదివి వినిపించిన ”’శ్రీమతి ప్రేమలేఖ ”కథ సాహితీ ప్రియుల మనసులను రంజింప చేశాయనడంలో సందేహం లేదు. అనంతరం వేటూరి, దాశరథి,వడ్డేపల్లి కృష్ణ వ్రాసిన సినీ గీతాలను శ్రీ చంద్రహాస్ మద్దుకూరి ,శ్రీమతి ఆకునూరి శారద,డాక్టర్ ఆళ్ళ శ్రీనివాస రెడ్డి బృందం అద్భుతంగా ఆలపించారు.గురజాడ విరచిత ”దేశమును ప్రేమించుమన్నా”గేయాన్నిశ్రీ యుతులు దయాకర్ మాడ,డాక్టర్ ఆళ్ళ శ్రీనివాస్ రెడ్డి,అనంత్ మల్లవరపు,,లెనిన్ వేముల ,చంద్రహాస్ మద్దుకూరి బృందం శ్రావ్యంగా ఆలపించడం జరిగింది.

డాక్టర్ ఇస్మాయిల్ పెనుగొండ గారు ఇటీవల ప్రచురితమైన నాలుగు పుస్తకాలను పరిచయం చేయడం జరిగింది. ఉత్తర టెక్సాస్ తెలుగుసంఘం టాంటెక్స్ ప్రస్తుత అధ్యక్షులు శ్రీ సతీష్ బండారు ,సంస్థ పూర్వాధ్యక్షులు, డాక్టర్ ప్రసాద్ తోటకూర, శ్రీ జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, డాక్టర్ నరసింహా రెడ్డి ఊరిమిండి,ప్రముఖ సాహితీ విమర్శకులుశ్రీ లెనిన్ వేముల, శ్రీ బి.లలితానంద ప్రసాద్,శ్రీ దయాకర్ మాడా, శ్రీఅనంత్ మల్లవరపు లతో పాటు డాలస్ , హ్యూస్టన్, ఆస్టిన్ నగరాలనుండి అనేక మంది సాహితీ ప్రియులు పాల్గొనడంతో సదస్సు విజయవంతమైంది. శ్రీ దయాకర్ మాడ వందన సమర్పణ గావించారు.

ఈ సందర్భంగా అధ్యక్షులు శ్రీ సతీష్ బండారు ,తమ అధ్యక్షోపన్యాసంలో, సంస్థ పూర్వాధ్యక్షులకూ , సంస్థ ఔన్నత్యానికి ఆర్ధికంగా తోడ్పడుతున్న దాతలకూ, ఇంకా ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలియ చేశారు. నేటి కార్యక్రమాన్ని ముందుండి నడిపించిన ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం ప్రస్తుత అధ్యక్షులు శ్రీ సతీష్ బండారు ,సమన్వయ కర్త శ్రీ దయాకర్ మాడా, సంస్థ పాలక మండలి మరియు అధికార కార్యవర్గ బృందం సభ్యులు అభినందనీయులు.

error: NRI2NRI.COM copyright content is protected